Nagar kurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో అమానుషం.. ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించిన ఎస్సై.. కారణం ఏంటంటే..

శాంతి భద్రతలు కాపాడే విషయంలో పోలీసులు కఠినంగా ఉంటారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి ఉండదు. అందువల్లే పోలీసులు కఠిన వైఖరి ప్రదర్శిస్తుంటారు. అయితే అలాంటి ఓ పోలీస్ ఈగో ను కొందరు యువకులు రెచ్చగొట్టారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Written By: Anabothula Bhaskar, Updated On : October 19, 2024 4:24 pm

Nagar kurnool

Follow us on

Nagar kurnool: తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఈ జిల్లాలోని లింగాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొందరు యువకులకు శిరో ముండనం చేయించాడు. ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది. ఎస్సై దగ్గరుండి గుండు కొట్టించడంతో ఓ యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ఆ యువకుడు నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ యువకుడి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లింగాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకునే విషయంలో యువకులు, బంక్ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బ్యాంక్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు ఆ యువకులను పిలిపించారు.. పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇరు వర్గాలను విచారిస్తుండగా.. ఓ యువకుడు ఎస్ఐ ముందు నిలుచుని తల దువ్వుకున్నాడు. దీంతో ఆ ఎస్ఐ ఆగ్రహంతో రెచ్చిపోయాడు. దీంతో అతనితో పాటు మరో ఇద్దరి యువకులకు కూడా గుండు కొట్టించాడు.

ఎస్సై చేసిన పనితో..

ఎస్ఐ చేసిన పనితో తీవ్రమైన మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు యుద్ధ ప్రాతిపదికన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే ఆ యువకుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు అంతర్గతంగా విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ తో ఇప్పటికే ఒక నివేదిక తెప్పించుకున్నారని సమాచారం.. ఎస్సై అందరి ముందు గుండు కొట్టించడంతో ఆ యువకుడు తీవ్రమైన మనస్థాపానికి గురైనట్టు స్థానికులు చెబుతున్నారు. పైగా అందరూ చూస్తుండగానే గుండు కొట్టించడం అతడిని మనస్థాపానికి గురయ్యాలా చేసిందని.. అందువల్లే అతడు ఆత్మహత్యకు యత్నించాడని చెబుతున్నారు. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకునే సమయంలో ఆ యువకుల తప్పులేదని.. పెట్రోల్ బంక్ నిర్వాహకులే అనవసరంగా పోలీసులకు ఫిర్యాదు చేశారని.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇంతటి దారుణానికి కారణమయ్యాయని స్థానికులు అంటున్నారు. ఆ యువకుడు ఉరి వేసుకోవడం వల్ల.. గొంతు భాగం వద్ద గాయమైంది. పైగా ఆ తాడు నైలాన్ ది కావడంతో గొంతుకు తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది. ఆ భాగంలో కమిలి పోయింది. శ్వాస సరిగా ఆడక పోవడంతో అంతర్గతంగా అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.