
Amalapuram Psycho: సోషల్ మీడియాను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. భావస్వేచ్ఛ పేరిట కొత్త చిక్కులు పెడుతున్నారు. నేరాలకు పురిగొల్పడమే కాకుండా.. హత్యలు, అఘాయిత్యాలకు కారణమవుతున్నారు. కొందరు చేస్తున్న అతి అనర్థాలకు కారణమవుతోంది. మరొకరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్ ఇలాంటి సామాజిక మాధ్యమాల వేదికల్లో పరిచయం అవుతున్నవారితో చేస్తున్న స్నేహం ముదిరి హద్దులుదాటి నేరాలకు తావిస్తోంది. నిండు ప్రాణాలను బలిగొంది. అమలాపురంలో ఓ సైకో సృష్టించిన మారణకాండ వెనుక ఇటువంటి స్టోరీ ఒకటి నడవడం పోలీసులను సైతం విస్తుగొల్పుతోంది. అమలాపురంలో మహిళ హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు.
ఆ రోజు ఏం జరిగిందంటే?
అమలాపురం పట్టణం ఎఎంజి కాలనీలోని పాత సుబ్బాలమ్మ గుడి వద్ద కమ్మిడి వెంకటరమణ కుటుంబం నివసిస్తోంది. వీరి ఇంట్లోనే మరో పోర్షన్‌లో మన్నె శ్రీదేవి (28) కుటుంబం అద్దెకు ఉంటోంది. మంగళవారం ఎప్పటిలానే శ్రీదేవి ఇంటి పనులు చేసుకుంటోంది. వెంకటరమణ ఇంట్లో ఉంది. ఈ సమయంలో ఒక వ్యక్తి డాబాపైకి ఎక్కాడు. అక్కడి నుంచి కింద పనిచేస్తున్న శ్రీదేవిని చూశాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి డాబా నుంచి కిందికి దిగి నేరుగా శ్రీదేవి వద్దకు వెళ్లి తన వెంట తెచ్చుకున్న చాకుతో దాడి చేశాడు. ఆమె కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న వెంకటరమణ పరుగున బయటకు వచ్చిఅడ్డుకునే ప్రయత్నం చేసింది. శ్రీదేవి గొంతును చాకుతో సైకో కోసేశాడు. దీంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత వెంకటరమణను వీపుపై చాకుతో పొడిచి తీవ్రంగా గాయపర్చాడు. ఈలోగా స్థానికులు అక్కడికి చేరుకుని అతడ్ని పట్టుకొని స్తంభానికి కట్టి కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
పోలీసు విచారణలో షాకింగ్ విషయాలు..
పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసే క్రమంలో ఆసక్తికరరమైన అంశం వెలుగులోకి వచ్చింది. దీనింతటికీ ‘స్నాప్ చాట్’ కారణమని తేలింది. అమలాపురం ఏఎంజీ కాలనీకు చెందిన వివాహితకు అయిదు నెలల క్రితం స్నాప్‌చాట్‌లో నెల్లూరుకు చెందిన కోట హరికృష్ణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఫోన్‌లో తరచూ మాట్లాడుకుంటున్న క్రమంలో స్నేహం పెరిగింది. అయితే హరికృష్ణ కొన్ని రోజుల నుంచి వివాహితను ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడని, అతనిలో వచ్చిన మార్పు వల్ల ఫోన్‌మాట్లాడడం తగ్గించి, అలాగే స్నాప్‌చాట్‌లో చాట్‌చేయడం తగ్గించింది. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా, మెసేజ్‌లు చేసినా రిప్లై ఇవ్వకపోవడంతో హరికృష్ణ కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్థారించుకున్నాడు. ఆమె ఇంతకు ముందు ఫోన్లో మాట్లాడినప్పుడు, ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసినప్పుడు చెప్పిన అడ్రస్ వివరాలు ప్రకారం మంగళవారం ఉదయం అమలాపురం చేరుకున్నాడు. పూటుగా మద్యం తాగి శ్రీదేవి ఇంటి వద్దకు చేరుకొని దారుణంగా హత్య చేశాడు.
అడ్రస్ మార్చడంతో…
నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించేసరికి అసలు విషయం బయటపడింది. అయితే సైకో హరికృష్ణ భావిస్తున్నట్టు సదరు వివాహిత శ్రీదేవి మాత్రం కాదు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. శ్రీదేవి.. సైకో ప్రేమించిన వివాహిత పుట్టింటివద్ద గత పదిహేనేళ్లుగా ఇంటి పనిచేస్తోంది. మద్యాహ్నం 3 గంటలకు వచ్చి పనులు ముగించుకుని సాయంత్రం 6 గంటలకు తిరిగి వెళ్లిపోతుంది. మృతురాలు శ్రీదేవి భర్త అమలాపురం మున్సిపాలిటీలో పారిశుధ్యకార్మికునిగా పనిచేస్తున్నాడు. అయితే సైకో వేధింపులకు గురవుతున్న వివాహిత రాంగ్ అడ్రస్ ఇచ్చింది. ఆ అడ్రస్ కే వెళ్లిన హరికృష్ణ శ్రీదేవే వివాహిత అని భావించి బలితీసుకున్నాడు. అడ్డుకోబోయిన వెంకటరమణ అనే మహిళను సైతం దారుణంగా కత్తితో పొడిచాడు. ప్రస్తుతం ఆ వివాహితను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే చేయని తప్పుకు శ్రీదేవి బలైపోయింది. ఆ కుటుంబలో అంతులేని విషాదం నెలకొంది.