
Bajji Center: శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కాలేజీ రూట్ అది. సాయంత్రం 4 గంటలు దాటితే చాలూ ఓ చోట జనం గుమిగూడిపోతారు. పిల్లల నుంచి పెద్దవారి వరకూ క్యూకడతారు. అక్కడకు వెళ్లిచూస్తే మనం అవాక్కవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడ వేచి ఉండేవారంతా బజ్జీలు, చాట్ కోసమే. అదేంటి మరీ ఇంత మోజా అని అక్కడున్న వారిని అడిగితే ఒకసారి రుచి చూడండని సమాధానం వస్తోంది. ఇలా తేరుకున్నంతలోపే… జుమాటో కంపెనీ డెలివరీ బాయ్స్ వచ్చి అక్కడ నుంచి బజ్జీలు, చాట్లు తీసుకెళుతుంటారు. బయటకు తోపుడు బండి కనిపించినా.. దాని వెనుక కథ ఇంత ఉందా? అని మనం తెలుసుకోవడం ప్రారంభిస్తాం. బయటకు చిన్నపాటి తోపుడు బండి కనిపించినా.. దాని వెనుక ఉండే ప్రకాష్ చాట్ పార్లర్ కథ వినడానికి ఎవరికైనా ఆసక్తి కలుగుతుంది.
జీఎస్టీ కట్టే బజ్జీ సెంటర్..
చేస్తున్న పనిలో చిత్తశుద్ధి ఉంటే సక్సెస్ దానంతట అదే వెతుక్కొని వస్తుంది. కష్టానికి మించి ప్రతిఫలం అందిస్తుంది. దీనికి చక్కటి ఉదాహరణ శ్రీకాకుళంలో ప్రకాష్ పార్లర్ చాట్ సెంటర్. మూడు దశాబ్దాల కిందట రూ.100తో తోపుడి బండితో ప్రారంభమైన వీధి వ్యాపారం.. ఇప్పుడు నెలకు సగటున రూ.6 లక్షల ఆదాయం పొందే వరకూ చేరుకుంది. శ్రీకాకుళం జిల్లాలో జీఎస్టీ కట్టే ఎకైక బజ్జీ సెంటర్ గా మారింది. బతుకు కోసం తోపుడి బండిలో బజ్జీలు విక్రయించే సత్యనారాయణ ఈ మూడు దశాబ్దాలుగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని.. ప్రకాష్ పార్లర్ చాట్ సెంటర్ ను నిలబెట్టారు. కస్టమర్ల ఆదరణ పొందుతున్నారు.
ఆ కుటుంబమే అంతా..
శ్రీకాకుళం జిల్లాలోనే ప్రకాష్ చాట్ పార్లర్ ఫేమస్ గా మారింది. నగరానికి పనిమీద వచ్చే వారు, విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు సాయంత్రమైతే చాలూ ప్రకాష్ పార్లర్ కు చేరుకుంటారు. అక్కడ పనిచేసేది ఐదుగురే అయినా.. వందలాది మందికి బజ్జీలను సప్లయ్ చేస్తుంటారు. సత్యనారాయణ, ఆయన కుమారుడు ప్రకాష్, భార్య, ఇద్దరు పనివార్లు మాత్రమే ఉంటారు. చాట్ కు అవసరమైన ముడిపదార్థాల నుంచి చాట్ తయారీచేసే పనిని సత్యనారాయణ, ఆయన భార్య చూస్తుంటారు. సప్లయ్, క్యాష్ కౌంటర్ కుమారుడు ప్రకాష్ చూస్తుంటారు. వారి సరాసరి రోజు ఆదాయం రూ.20 వేలు అని స్వయంగా వారే చెబుతున్నారు. నెలకు రూ.6 లక్షలన్న మాట.

కష్టే ఫలిని నమ్మడంతో..
కుటుంబ జీవనం కోసం తోపుడుబండిలో బజ్జీలు విక్రయించే సత్యనారాయణకు కుమారుడు ప్రకాష్ ఆలోచన తోడైంది. ఇంటర్ వరకూ చదవుకున్న ప్రకాష్ తండ్రికి చేదోడు వాదోడుగా నిలవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో బజ్జీలు, చాట్లు, సమోసాలను క్వాలిటీగా అందిస్తే వినియోగదారులకు చేరువకావచ్చని భావించాడు. అందుకే వాటి తయారీలో నాణ్యతకు పెద్దపీట వేశాడు. తొలుత రోజుకు వెయ్యి, రెండు వేల రూపాయల విక్రయాలతో సాగే వ్యాపారం ఇప్పుడు రూ.50 వేలకు చేరువ అయ్యింది. ఆ కుటుంబ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు దక్కుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కష్టేఫలి అన్న సూత్రాన్ని నమ్ముకున్నామని చెబుతున్నారు.