Alluri District: ఒక భార్యతోనే వేగలేం.. ముగ్గురా ‘పండన్న’

పెదబయలు మండలం కించూరు గ్రామానికి చెందినపండన్న అనే వ్యక్తికి 2000 సంవత్సరంలో పెళ్లి జరిగింది. అయితే పండన్నమొదటి భార్యకు సంతానం లేదు. దీంతో ఆయన 2005లో మరో మహిళను వివాహం చేసుకున్నాడు.

Written By: Dharma, Updated On : July 2, 2024 9:59 am

Alluri District

Follow us on

Alluri District: సాధారణంగా రెండో పెళ్లి చేసుకోవాలి అంటే విడాకులు తప్పనిసరిగా తీసుకోవాలి. చట్టం కూడా దీనిని స్పష్టంగా చెబుతోంది. అయితే విడాకులు తీసుకోకుండానే మూడో వివాహం చేసుకున్నాడు ఓ వ్యక్తి. అయితే భార్యలు ఏం చేస్తున్నట్టు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక్కడే ట్విస్ట్. కట్టుకున్న భర్తకు ఇద్దరు భార్యలు దగ్గరుండి మరీ మూడో పెళ్లి చేయడం విశేషం. ఈ విచిత్ర వివాహం అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెదబయలు మండలం కించూరు గ్రామానికి చెందినపండన్న అనే వ్యక్తికి 2000 సంవత్సరంలో పెళ్లి జరిగింది. అయితే పండన్నమొదటి భార్యకు సంతానం లేదు. దీంతో ఆయన 2005లో మరో మహిళను వివాహం చేసుకున్నాడు. 2007లో ఒక కుమారుడు పుట్టాడు. అటు తర్వాత రెండో భార్యకు పిల్లలు పుట్టలేదు. మరో బిడ్డ కావాలని భర్త కోరడంతో మూడో పెళ్లి చేసేందుకు భార్యలు సిద్ధమయ్యారు. ఓ మహిళతో వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. భార్యలే భర్త పెళ్లికి పెద్దలుగా మారారు. శుభలేఖలు కుట్టించారు. బ్యానర్లు వేయించారు. వారి పేర్లను కింద ముద్రించారు. జూన్ 25న అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.

ఒక భార్యతోనే కొందరు భర్తలు వేగలేకపోతుంటారు. కానీ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు భార్యలను సొంతం చేసుకున్న పండన్నను చూసి మిగతావారు ముక్కున వేలేసుకుంటున్నారు. పండన్నకు తల్లిదండ్రులు లేరు.. ఇద్దరు భార్యలే అతనికి సర్వస్వం. వాళ్లు కూడా అదే స్థాయిలో పండన్నను ప్రాణానికి మించి చూసుకుంటున్నారు. కలిసి మెలిసి అన్యోన్యంగా గడుపుతున్నారు. అందుకే భర్త కోరిక మేరకు మూడో పెళ్లికి సిద్ధపడ్డారు. పెళ్లి వేడుకలను ధూంధాం గా నిర్వహించారు. అయితే భర్తకు వివాహం జరుపుతున్నామన్న ఆనందం ఆ ఇద్దరు భార్యలు కనిపించింది. వారి మనోధైర్యాన్ని మెచ్చుకున్నారు గ్రామ పెద్దలు, వివాహానికి హాజరైన వారు.