https://oktelugu.com/

Pithapuram Varma: పవన్ కళ్యాణ్ రైట్ హ్యాండ్ కు చంద్రబాబు షాక్

2014 ఎన్నికల్లో పిఠాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు వర్మ. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో టిడిపి టికెట్ ను ఆశించారు. దక్కకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 2, 2024 / 10:04 AM IST

    Pithapuram Varma

    Follow us on

    Pithapuram Varma: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు షాక్ తగిలింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదు. కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇద్దరినీ ఖరారు చేశారు. అందులో తెలుగుదేశం పార్టీ నుంచి రామచంద్రయ్య, జనసేన నుంచి హరిప్రసాద్ పేర్లను ఖరారు చేస్తూ ప్రకటన ఇచ్చారు. ఈరోజు వారు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దీంతో వర్మకు ఆదిలోనే నిరాశ ఎదురయ్యింది. కొద్దిరోజుల కిందటే తనకు తాను ఒక ట్విట్ పెట్టుకున్నారు వర్మ. ఎమ్మెల్సీ వర్మ అంటూ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అంశంగా మారింది. తప్పకుండా ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారని కూడా ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఆయన పేరు లేకుండా.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

    2014 ఎన్నికల్లో పిఠాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు వర్మ. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో టిడిపి టికెట్ ను ఆశించారు. దక్కకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగారు. త్రిముఖ పోటీలో గెలిచారు. తన పట్టును నిలుపుకున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని విధాలా ఏర్పాట్లు చేసుకున్నారు. సరిగ్గా అప్పుడే జనసేన అధినేత పవన్ పిఠాపురం పై దృష్టి పెట్టారు. కూటమి అభ్యర్థిగా అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో వర్మ అనుచరులు ఆందోళన పడ్డారు. మరోసారి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని వర్మపై ఒత్తిడి చేశారు. చంద్రబాబు వర్మను పిలిపించుకొని మాట్లాడారు. పవన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని.. నీ రాజకీయ భవిష్యత్తుకు నాది హామీ అంటూ భుజం తట్టడంతో.. పవన్ విజయానికి కృషి చేశారు వర్మ. ఏకంగా 70 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో పవన్ గెలిచారు. వర్మ కృషి చేయడం వల్లే ఇది సాధ్యమని అటు పవన్ సైతం ఒప్పుకున్నారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీ ఖాయమని ప్రచారం జరిగింది.

    అయితే వర్మకు పక్కన పెట్టి.. టిడిపి తరఫున రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం విశేషం. దీనిపై వర్మ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు రామచంద్రయ్య తో పాటు ఇక్బాల్ టిడిపిలో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు పడింది. ఎన్నికలు అనివార్యంగా మారడంతో.. ఆ ఇద్దరికీ మరోసారి ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఒక స్థానం వర్మకు కట్టబెట్టి.. మరో ఎమ్మెల్సీ పదవి ఇక్బాల్ కు ఇస్తారని టాక్ నడిచింది. కానీ వారిద్దరికీ అవకాశం లేకుండా పోయింది. టిడిపి తరఫున రామచంద్రయ్యకు, జనసేన తరఫున హరిప్రసాద్ కు ఛాన్స్ ఇచ్చారు. అయితే ముఖ్యంగా వర్మకు తొలిసారి పదవి దక్కుతుందని అంతా భావించారు. అంచనాలు కూడా వేశారు. వర్మ కోసమే మంత్రి పదవి ఖాళీగా ఉంచారని కూడా ఎక్కువ మంది అనుమానించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు.