Facial Recognition: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు షాకిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, విధులకు హాజరుకాకున్నా మేనేజ్ చేసుకోవడం, ఉన్నతాధికారుల సహకారంతో అబ్సెంట్ లను సైతం హాజరుగా చూపుకోవడం వంటివి ఇక నుంచి కుదరవని ప్రభుత్వం తేల్చిచెప్పింది.ఇకపై ఉద్యోగుల హాజరు గుర్తింపు కోసం ఫేసియల్ రికగ్నేషన్ టూల్ పద్ధతిని వినియోగించాలని అన్ని శాఖలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఏపీ సచివాలయం, హెచ్ వోడీలు, కలెక్టరేట్లతో సహా అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు ఫేస్ రికగ్నేషన్ తప్పనిసరి కానుందని తెలుస్తోంది. తొలి దశలో సచివాలయంలోని అన్ని శాఖల హెచ్ వోడీలు, జిల్లాల్లోని అన్ని శాఖల విభాగాధిపతులు వర్తింపజేయాలని నిర్ణయించారు. సంక్రాంతి తరువాత అన్ని శాఖల ఉద్యోగులు, సిబ్బందికి ఈ హాజరు విధానాన్ని అమలు చేయాలని ఏపీ సీఎస్ స్పష్టం చేశారు.

జగన్ సర్కారు వరుసగా ఉద్యోగులకు షాకుల మీద షాకులిస్తోంది. ఇప్పటికే వారికి న్యాయబద్ధంగా చెందాల్సిన జీతాలు, ఇతరత్రా రాయితీలకు జగన్ సర్కారు మంగళం పాడింది. అటు వేతన సవరణఅమలుచేయకపోగా.. వేతన బకాయిలు చెల్లించలేదు. జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదు. అటు రద్దుచేస్తామన్నసీపీఎస్ కూడా అటకెక్కించారు. నెలలో రెండో వారం దాటుతున్నా జీతాలు, పెన్షనర్లకు పింఛన్లు అందలేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల వారు ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుకున్నారు. ఇప్పుడు ఫేసియల్ రికగ్నేషన్ తప్పనిసరి చేయడంతో ఆ రెండు వర్గాలు ప్రభుత్వానికి మరింత దూరమయ్యే అవకాశముంది.

ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో జగన్ సర్కారు కఠినతరంగా వ్యవహరించడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఉపాధ్యాయులకు ఫేసియల్ రికగ్నేషన్ హాజరు అమలుచేస్తున్నారు. వాటితో పాటు యాప్ ల నమోదు భారాన్ని మోపారు. ఉపాధ్యాయులకు కేవలం 5 నిమిషాల ఆలస్యానికి మాత్రమే వెసులబాటు కల్పించారు.అంతకు మించి ఆలస్యమైతే జీతంలో కోత విధిస్తున్నారు. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో సీఎం జగన్ దూకుడు ఇబ్బందులను తెచ్చి పెడుతుందని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. గతంలో ఆ రెండు వర్గాలు వ్యతిరేకించిన ప్రభుత్వాలు ఏవీ రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు జగన్ అటువంటి వైఖరే ప్రదర్శిస్తుండడంతో ఆ రెండు వర్గాల నుంచి ప్రతిఘటన, వ్యతిరేకత తప్పదని భావిస్తున్నారు.