Varaha Roopam Plagiarism Case: కాంతారా గత రికార్డుల దుమ్ము దులిపినా.. కోట్లకు కోట్లు కొల్లగొట్టినా.. ఓటిటిలో మాత్రం గిల గిలా కొట్టుకుంటున్నది. సినిమాకు ప్రాణమైన ఆ వరాహ రూపం పాట కిందా మీదా పడుతున్నది. ఏ పాట ఉంచాలి? ఏ పాట తీసేయాలి? ఇలా ఏదీ అర్థం కాక ఆ కాంతారా టీం బుర్ర బద్దలు కొట్టుకుంటున్నది. ఇప్పటికీ ఈ పాటకు సంబంధించిన కేసులు కోర్టుల్లో అటు ఇటు తిరుగుతున్నాయి. ఇది కాంతారా బృందాన్ని గంగ వెర్రులెత్తిస్తోంది. ముందే చెప్పుకున్నట్టు కాంతారా సినిమాలో వరాహ రూపం పాట ప్రాణప్రదం. వాస్తవానికి ఆ పాట లేకపోతే, క్లైమాక్స్ లో కనుక అది లేకపోతే అసలు సినిమాయే లేదు.. అది లేకుంటే అసలు అది సినిమానే కాదు. అది మా “నవరస”కు కాపీ అని, కాంతారా టీం దానిని కాపీ కొట్టిందని… మలయాళ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బం కంపెనీ రచ్చ రచ్చ చేసింది.. కేరళలోని కోజికోడ్, పాలక్కాడ్ జిల్లా కోర్టులకు ఎక్కింది. కోజి కోడ్ కోర్టు వెంటనే ఆ పాట ప్రదర్శన మీద స్టే విధించింది. ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కూడా ఆ పాట ప్రదర్శించకూడదని విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

చాలా డిఫరెంట్
నిజానికి ఆ పాట ఒక మలయాళం.. ఈ పాట ఒక కన్నడం.. మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్. మరి ఆ పాటకు, ఈ పాటకు పోలిక ఎక్కడుందో గౌరవ కోర్టు చెప్పలేదు. కాపీ కొట్టిందేమిటో వివరించలేదు. అయితే ఆ ప్రైవేట్ ఆల్బమ్ కంపెనీ తో కాంతారా బృందం సమస్య పరిష్కారం కోసం బయట ఏవేవో ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలించనట్టుంది.. పైగా ఆ ప్రైవేట్ ఆల్బమ్ కంపెనీ చెట్టు ఎక్కి కూర్చున్నది. ఇది తేలకుండా నేను ఓటీటీలో ప్రసారం చేయను అని అమెజాన్ బెట్టు చేసింది. దీంతో గత్యంతరం లేక చివరకు వేరే పాట కంపోజ్ చేశారు. అది వేరే కంటెంట్. ట్యూన్ మార్చారు. కానీ ఆ పాటలో ప్రాణం లేదు. జీవం అంతకన్నా లేదు. దీంతో ప్రేక్షకులకు ఆ పాట అసలు నచ్చలేదు. పైగా కొత్త పాట సినిమా ప్రాణం తీసింది అని విమర్శలు చేశారు. ఈలోపు కోజికోడ్ కోర్టు తను విధించిన స్టే ఎత్తేసింది. కాంతారా టీం ఊపిరి పీల్చుకుంది. కానీ పాలక్కాడ్ డిస్ట్రిక్ట్ కోర్టు కేసు అలాగే ఉంది.
ఈసారి హైకోర్టుకు వెళ్ళింది
కానీ ఈ విషయంలో ఆ మలయాళీ మ్యూజిక్ కంపెనీ విడిచిపెట్టదలుచుకోలేదు. కోజికోడ్ జిల్లా న్యాయస్థానం ఎత్తి వేయడంతో హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు కోజికోడ్ జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మీద స్టే విధించింది. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. అంతేకాదు హైకోర్టు ఈ సినిమా నిర్మాణ సంస్థ, దర్శకుడు రిషబ్ శెట్టి, ఓటీటీ సర్వీస్ వేదిక అమెజాన్ సెల్లర్, గూగుల్ కు నోటీసులు జారీ చేసింది. మరోవైపు పాలక్కాడ్ జిల్లా కోర్టు విధించిన స్టే అలాగే ఉంది. ఈ కోర్టు కేసులతో కాంతారా టీంకు 400 కోట్ల వసూళ్ళ ఆనందం కాస్త ఆవిరి అయిపోతున్నది. 15 కోట్ల పెట్టుబడి పెడితే 400 కోట్ల వసూలు అనేది నిజంగా ఒక మ్యాజిక్. దేశవ్యాప్తంగా ఇప్పుడు దీని గురించే చర్చ జరుగుతోంది. అయితే ఈ పాటను చోరీ చేశారా అనే అంశం మీద ఇంకా విచారణ జరగడం లేదు. స్టే ల మీద స్టేలు వస్తున్నాయి. కానీ ఊదు కావడం లేదు. పీరి లేవడం లేదు.

ఎవరికీ రైట్స్ లేవు
ఇక కర్ణాటక సంగీతంలో పేరెంట్స్ రాగాలుగా పేర్కొనే మేళ కర్త రాగాలనే అందరూ వాడుకుంటున్నారు. వరాహ రూపం దానికి ఇందులో మోడరన్ ఫ్యూజన్.. ఇది ఒక వినూత్న ప్రయోగం.. జనాలకు నచ్చొచ్చు. నచ్చకపోవచ్చు. కానీ ఆ రాగాలు ఓపెన్ సోర్స్. ఎవరికి వాటి పై పేటెంట్ రైట్స్ లేవు. ఇవేమి తేలకుండా… తేల్చకుండా కోర్టులు స్టేల మీద స్టే లు విధిస్తున్నాయి. ఇది ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు కానీ.. ఇప్పటికైతే కాంతారాకు ఓటిటిలో మాత్రం దెబ్బే. ఇంత జరుగుతున్నా కూడా… రిషబ్ శెట్టి మేం గెలిచాం అని ట్విట్ చేయడం.. నిజంగా ఆశ్చర్యకరమే.