Homeఆంధ్రప్రదేశ్‌Kakinada: పేగు బంధం పిలుపుతో కన్ను తెరిచి.. అంతలోనే అనంత లోకాలకు..!

Kakinada: పేగు బంధం పిలుపుతో కన్ను తెరిచి.. అంతలోనే అనంత లోకాలకు..!

Kakinada
Kakinada

Kakinada: పేగు బంధం ఆ మాతృమూర్తిలో కదలికను తీసుకువచ్చింది.. అమ్మా.. అమ్మా.. అంటూ ఆ చిన్నారి పిలిచిన పిలుపు.. కదల్లేని స్థితిలో ఉన్న ఆ మాతృ మూర్తిని కదిలేలా చేసింది. ఆ చిన్నారి నోటి వెంట వచ్చిన శబ్దాలే.. సంజీవనిగా మారి జీవచ్ఛవంలా మారి మృత్యువుతో పోరాడుతున్న ఆ తల్లిలో చలనం తీసుకువచ్చింది. పేగు బంధం పిలుపుతో చలనం వచ్చినా.. అది కొద్దిసేపటికే పరిమితమై మళ్ళీ మృత్యువు కబళించడంతో.. తుది శ్వాస విడిచింది ఆ మాతృమూర్తి.

లారీ గుద్దడంతో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ కొద్ది రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె బతుకుతుందన్న ఆశతో కుటుంబ సభ్యులు వేచి చూశారు. కానీ, ఫలితం లేకపోవడంతో అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళుతున్న సమయంలో చేయి కొద్దిగా కదపడంతో అందరిలో ఆశలు చిగురించాయి. ఆమె రెండేళ్ల కుమారుడిని తల్లి దగ్గరకు తీసుకెళ్లి అమ్మ అంటూ పిలిపించారు. ఆ మాటలకు మరోసారి చేయి కదపడంతో వెంటనే అవయవదానాన్ని నిలిపేశారు. ఆ మహిళ కొద్దిసేపటిలో 40 శాతం వరకు కోలుకున్నారు. ఇంతలోనే పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం మృతి చెందారు. కోలుకుంటుంది అనుకున్న ఆ కుటుంబ సభ్యులకు మరోసారి వేదనే మిగిలింది. అమ్మ అన్న పిలుపుతో చలనం వచ్చిన.. ఆ తల్లి తనతో ఉంటుందన్నకున్న ఆ బిడ్డకు నిరాశే మిగిలింది.

Kakinada
Kakinada

కాకినాడ జిల్లా అన్నవరం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తోంది అనపర్తి వీర వెంకట కనకదుర్గ అఖిల. సహచర ఉపాధ్యాయులతో కలిసి సంకల్పం పేరిట స్వచ్ఛంద సేవలు నిర్వర్తించేవారు ఆమె. అఖిల గత వారం 10వ తరగతి చివరి పరీక్ష విధులకు హాజరై తిరిగి వెళుతుండగా కత్తిపూడి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రాంగ్ రూట్లో వచ్చిన ఓ లారీ ఆమె ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వైద్యులు ఆమెను బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. అంతకుముందే ఆమె తన మరణానంతరం అవయవదానానికి అంగీకారం తెలపడంతో వైద్యులు అందుకు సన్నద్ధమయ్యారు. అయితే ఇక్కడే ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా చలనం లేని ఆమె ఆపరేషన్ థియేటర్ కు వెళుతున్న సమయంలో కొద్దిగా చేయి కదపడంతో అందరి ఆశలు చిగురించాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు రెండేళ్ల కుమారుడిని తల్లి దగ్గరకు తీసుకెళ్లి అమ్మా అంటూ పిలిపించారు. ఆ మాటలకు మరింత స్పందించిన ఆమె చేయి కదపడంతోపాటు మరో 40% వరకు కోలుకున్నట్లు కనిపించారు. దీంతో అప్రమత్తమైన వైద్యులు వెంటనే అవయవదాన ప్రక్రియను నిలిపేశారు. వైద్యులు కూడా ఇదో అద్భుతంగానే భావించారు. కుటుంబ సభ్యులు అఖిల మళ్ళీ మా కుటుంబంలోకి వస్తుందని ఆశపడ్డారు. ఆ చిన్నారి కూడా అమ్మ మళ్లీ ఎప్పటిలానే తనతో ఆడుకుంటుందని, అన్నం తినిపిస్తుందని ఆశపడ్డాడు. అయితే, ఆ ఆశలన్నీ నిరాశను చేసేలా విధి మరో రాత రాసింది. కోలుకున్న కొద్ది నిమిషాల తర్వాత ఆమె పరిస్థితి మళ్ళీ విషమించి బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, ఆ చిన్నారి, సంకల్ప మిత్రులు రోదనలు అక్కడ వారిని కలిసి వేశాయి.

Exit mobile version