Teenmar Mallanna party : ‘రాజకీయ పార్టీ పెట్టడం.. నిర్మించడం.. నడపడం అంటే పాన్ డబ్బా పెట్టుకున్నట్లు కాదు’ తెలంగాణ ముక్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పే మాటలు ఇవీ. ఎవరు చెప్పినా.. ఈ మాట మాత్ర నూటికి నూరుశాతం నిజం. ఒక పార్టీని స్థాపించి దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎవరికైనా అంత ఈజీ కాదు. గడిని ఐదారేళ్లలో తెలంగాణలో 15 పార్టీలు రిజిస్టర్ అయ్యాయి. కానీ, ఏపార్టీ కూడా ఆశించిన మేరకు అధికార పార్టీకి పోటీ ఇవ్వడం లేదు. కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎందుకంటే.. ఆ పార్టీలన్నీ కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసినవే. తాజాగా తెలంగాణలో మరోపార్టీ ఏర్పాటు కాబోతోంది. తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్‌కుమార్) జైను నుంచి విడుదలైన వెంటనే తాను పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. దాని పేరుకూడా ‘తెలంగాణ నిర్మాణ పార్టీ’ అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల స్థాపన, నిర్మాణం, పార్టీల ముందు ఉండే సవాళ్లు మరోమారు చర్చకు దారితీశాయి.
వ్యక్తికి వ్యతిరేకంగా…
తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న పార్టీలన్నీ కేవలం వ్యక్తికి వ్యతిరేకంగా ఏర్పడుతున్నాయి. ఏ రాజకీయా పార్టీకి అయినా వ్యక్తి వ్యతిరేక ఎజెండాతో ఏర్పాటయితే మనగలగడం కష్టం. అధికార పార్టీని దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో తెలంగాణలో ఇప్పటికే 15 పార్టీలు రిసిస్టర్ అయ్యాయి. అందులో కోదండరామ్ సారథ్యంలోని టీజేఎస్, చెరకు సుధాకర్ సారథ్యంలోని తెలంగాణ ఇంటిపార్టీ, షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్‌టీపీ, కేఏపాల్ నేత్రృత్వంలో మరో పార్టీ, టీఆర్‌ఎస్ పేరుతో మరో పార్టీ ఏర్పాట కాబోతోంది అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నయి. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న తాను కూడా పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఆయన పార్టీ కూడా కేసీఆర్ వ్యతిరేక పార్టీనే. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న కోదండరామ్ పార్టీకే పెద్దగా ఆదరణ లేదు. పార్టీ నిర్మాణం చేసినా జనాల్లో ఆశించిన మేర స్పందన లేదు. ఈ క్రమంలో తీన్మాన్ మల్లన్న తెలంగాణ నిర్మాణ పార్టీ ఎలా ఎదుగుతుందని రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.
ఫైర్ ఉంటే సరిపోదు..
తీన్మార్ మల్లన్న మంచి ఫైర్ ఉన్న నేత. అధికార బీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొంటున్నారు. జైలుకు వెళ్లొచ్చినా తగ్గేదే లే అంటున్నారు. అధికార బీఆర్‌ఎస్, కేసీఆర్ కుటుంబం, బీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై తిరుబాటు కొనసాగిస్తున్నారు. అయితే ఆయనలో ఉన్న ఫైర్ పార్టీ నడపడానికి సరిపోతుందా అంటే సరిపోదనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, వ్యక్తికి వ్యతిరేకంగా పార్టీ ఏర్పాటు చేసి రాజకీయం చేయడం, ప్రజలను ఆకట్టుకోవడం సాధ్యం కాదంటున్నారు.
వివిధ పార్టీల్లో చేరిక, ఇండిపెండెంట్‌గా పోటీ..
తీన్మార్ మల్లన్న మొదట జర్నలిస్టుగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొన్ని రోజులకే పార్టీ వీడి బయటకు వచ్చారు. ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి అధికార బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్)కు చుక్కలు చూపించాడు. ఓడించినంత పనిచేశాడు. తర్వాత ఇండిపెండెంట్‌గా హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు. కానీ విజయం సాధించలేదు. మారిణ రాజకీయ పరిణామాలతో బీజేపీలో చేరి కొన్ని రోజులకే బయటకు వచ్చాడు. తాను స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే ప్రజలను ఆకట్టుకునే వాక్‌చాతుర్యం ఉన్న మల్లన్న.. ఏ పార్టీలో ఇమడలేకపోయాడు. ఇప్పుడు సొంత పార్టీని ఎంతమేరకు నడుపుతాడనే చర్చ జరుగుతోంది.
మల్లన్న ముందు సవాళ్లు..
తెలంగాణలో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామంటే తామంటున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా కొన్నిసార్లు వ్యక్తికి వ్యతిరేంగానే రాజకీయాలు చేస్తున్నాయి. కేసీఆర్ టార్గెట్‌గా కార్యక్రమాలు చేస్తున్నాయి. వాస్తవంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా నిలబడాలంటే.. ఆ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి. అంతేకాదు. తాము అధికారంలోకి వస్తే ఆ వైఫల్యాలను ఎలా అధిగమిస్తామనే నమ్మకం కల్పించాలి. కానీ కాంగ్రెస్, బీజేపీ ఆ పని చేయడం లేదు. ఇలాంటి పరిస్థితిలో పార్టీ పెడుతున్న తీన్మార్ మల్లన్న కూడా కేవలం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పార్టీ నడపడం మాత్రం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపడంతోపాటు వాటిని తాను, తన పార్టీ ఎలా పరిష్కరిస్తుందో చెప్పడంతోపాటు ప్రజలను నమ్మించగలగాలి. అప్పుడే తెలంగాణ నిర్మాణ పార్టీ సక్సెస్ అవుతుంది. మరి మల్లన్న పార్టీని ఎలా నిర్మిస్తాడో.. ప్రజాక్షేత్రంలో ఎలాంటి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాడో చూడాలి.