Siddipet : ఒకప్పుడు పెళ్లి అంటే ఇంటి ముందు పచ్చని పందిరి. పసుపుతో ముగ్గులు.. పేడతో కల్లాపి చల్లడం, అడవిలో దొరికే ఆకులతో ఇంటి ముందు పందిరి వేయడం, పెళ్లి మండపం కొబ్బరి ఆకులతో తయారు చేయడం, కుటుంబ సభ్యుల చేతికి మామిడి ఆకులతో కంకణాలు కట్టడం, వధూవరుల చేతికి పసుపు కొమ్ములు కట్టడం ఇలా జరిగేది. ఇప్పుడు రెడీమేడ్ యుగం వచ్చింది. అన్నీ షాపుల నుంచి తెచ్చి కల్యాణం తంతు ముగిస్తున్నారు. నాడు కనీసం ఐదు రోజులు జరిగే పెళ్లి తంతు నేడు మూడు రోజుల్లో ముగుస్తుంది. ఇక నాటి పెళ్లిలో బంతి భోజనం పెట్టేవారు. అంటే అందరినీ కూర్చోబెట్టి. అరటాకు లేదా విస్తరాకు వేసి భోజనం పెట్టేవారు. నేడు బఫే సిస్టం వచ్చేసింది. పాత ఒక రోత.. కొత్త ఒక వింత అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు నేటి తరం. ఈ క్రమంలో ప్లాస్టిక్ మన జీవితాల్లో భాగమైంది. దీంతో ప్రకృతి విధ్వంసం జరుగుతోంది. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ప్రభుత్వాలు, ప్రకృతి ప్రేమికులు ఎంత చెబుతున్నా.. పట్టించుకునేవారు లేరు. నూటిలో ఒకరిద్దరు మాత్రమే ప్లాస్టిక్‌కు దూరంగా ఉంటున్నారు. ఇక పెళ్లిళ్లు, ఇతర శుభ, అశుభ కార్యాల్లోనూ ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. క్వింటాళ్ల కొద్ది ప్లాస్టిక్ ఒక వేడుకలోనే వినియోగిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ కుటుంబం ప్లాస్టిక్ వాడకుండా వివాహం జరిపించి ఆదర్శంగా నిలిచింది.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఓ వివాహ వేడుకలో ప్లాస్టిక్ లేకుండా వేడుక జరిపించారు. దుబ్బాక మండలం ధర్మారం గ్రామానికి చెందిన సంఘం పద్మ–మధుసూదన్‌రెడ్డి దంపతుల కుమారుడు ప్రేమ్‌చందర్‌రెడ్డి వివాహం పట్టణలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం(ఫిబ్రవరి 3న) జరిపించారు. ఈ వివాహంలో పర్యావరణ పరిరక్షణ, చైతన్యం తెచ్చేలా చేసిన ఏర్పాట్లు చూసి బంధువులు, మిత్రులు ఆశ్చర్యపోయారు. స్వాగత తోరణాలు మొదలు.. భోజనాల వరకు ఎక్కడా ప్లాస్టిక్ కనిపించలేదు. తినే ప్లేట్లకు బదులు అరటి ఆకులు, నీళ్లు తాగే ప్లాస్టిక్ గ్లాసులకు బదులు గాజు గ్లాసులు వాడారు. పెళ్లిలో జ్యూస్‌ను మట్టి ముంతల్లో ఇచ్చారు.
అభినందించిన బంధు మిత్రులు..
ప్లాస్టిక్ ఫ్రీ పెళ్లి జరిపించిన వధూవరుల తల్లిదండ్రులను వేడుకకు వచ్చిన బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అభినందించారు. లగ్గం అంటే ఇలా చేయాలి అన్నట్లుగా పేర్కొన్నారు. ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాల పై కల్పించాలని పెళిలని ఇలా జరిపించామని తెలిపారు. అయితే ప్లాస్టిక్ లేకుండా పెళ్లి చేయడం అంత ఆషామాషీ కూడా కాదు. నిజంగా వీరు సమాజానికి గొప్ప మెస్సేజ్ ఇచ్చారు. దీంతో పెళ్లికి వచ్చిన వారిలో పది మంది స్ఫూర్తి పొందినా చాలు.