Himachal Pradesh: పెళ్లి అనగానే బంధాలు, బంధుత్వాలు ఉంటాయి. వధువు లేదా వరుడిని చూసినప్పుడు అటేడు తరాలు, ఇటేడు తరాలు చూసేవారు. కానీ, నేటి ఉరుకులు పరుగుల జీవితంలో పెళ్లి చూపులు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. చివరకు పెళ్లి కూడా ఆన్‌లైన్‌లోనే జరిపిస్తున్నారు. దీంతో మోసాలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా మ్యాట్రిమొనీలు, మ్యారేజ్ బ్యూరోలు తమ కమీషన్ల కోసం అనేక మోసాలకు పాల్పడుతున్నారు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా నమ్మించి పెళ్లి జరిగేలా చేస్తున్నారు. తర్వాత వాస్తవాలు తెలిసి విడాకుల వరకు వెళ్తున్నారు. తాజాగా ఓ మధ్యవర్తి లేని వధువు ఉన్నట్లు చూపి వరుడిని మోసం చేశాడు.
కొత్తరకం మోసం..
చాలాకాలంగా పెళ్లి కావడం లేదని చూస్తున్న ఓ వరుడిని మధ్యవర్తి కొత్త రకంగా మోసగించాడు. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగింది. రాష్ట్రంలోని ఉనా జిల్లాలోని నారీ గ్రామానికి చెందిన 34 ఏళ్ల యువకుడికి పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో అతను ఓ మధ్యవర్థిని ఆశ్రయించాడు. ఆయన పలు సంబంధాలు చూపించాడు. చివరకు రూ.50 వేలు తీసుకుని ఓ సంబంధాన్ని ఓకే చేశారు. అయితే ఇక్కడ అమ్మాయిని చూపించకుండా ఫొటో మాత్రమే చూపించి పెళ్లి ఓకే చేశాడు. చాలా కాలానికి పెళ్లి కుదరడంతో వరుడు సంతోషంతో పొంగిపోయాడు. పెళ్లి ఘనంగా చేసుకునేందుకు భారీగా ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈమేరకు పెళ్లిని సోమవారం(ఫిబ్రవరి 3న ) నిశ్చయించారు. దీంతో వరుడు పెళ్లి కోసం వధువు గ్రామానికి భాజా భజంత్రీలతో బయల్దేరాడు.
గ్రామానికి వెళ్లాక షాక్..
ఇక పెళ్లి కోసం వధువు సింగా గ్రామానికి వెళ్లిన వరుడు, అతడి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లాక షాక్ అయ్యారు. గ్రామంలో వధువు ఇల్లు ఎక్కడో తెలుసుకునేందుకు గ్రామస్తులను అడిగారు. వారు చెప్పిన సమాధానంతో ఖంగుతిన్నారు. అసలు తమ గ్రామంలో ఎలాంటి పెళ్లి జరగడం లేదని, అసలు వధువు తమ గ్రామంలో లేదని తెలిపారు. మరోవైపు గ్రామానికి వచ్చిన పెళ్లి బృందాన్ని గ్రామస్తులు వింతగా చూడసాగారు. అయితే వధువు ఫొటోను చూపించారు. కానీ, అక్కడ ఆ ఆమ్మాయే లేదని తేలింది. దీంతో మధ్యవర్తి మోసం చేశాడని గ్రహించి నిరాశగా వెనుదిరిగారు.