Helicopter- Yadadri: ఢిల్లీలో చక్రాలు తిప్పుతా. దేశంలో అగ్గి పెడతా.. గాయిగత్తర చేస్తా. భారత రాష్ట్ర సమితి ప్రారంభానికి ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆయన చెప్పినట్టుగానే ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. మొన్న ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటున్నారు.. అంతేకాదు ఏకంగా ఢిల్లీలో మకాం వేశారు.. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో భారత రాష్ట్ర సమితి ఒక హెలికాప్టర్ కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కాకపోతే అది రాజ్యసభ సభ్యుడు బోయినపల్లి సంతోష్ కుమార్ దగ్గర చుట్టం బోయినపల్లి శ్రీనివాసరావు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

ఎవరు ఈ శ్రీనివాసరావు
శ్రీనివాసరావు కరీంనగర్ జిల్లా వాస్తవ్యుడు.. ఎంపీ సంతోష్ కుమార్ కు దగ్గర బంధువు. ఈ లెక్కన సీఎం కేసీఆర్ కు కూడా దగ్గర అన్నట్టే. ఈయనకు కరీంనగర్, హైదరాబాదులో హాస్పిటల్స్ ఉన్నాయి.. మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఆర్థికంగా స్థిరపడ్డాడు.. అంతేకాదు మొన్న వరంగల్ లో కూడా పెద్ద ఆసుపత్రి నే ప్రారంభించాడు.. ప్రగతి భవన్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాడు.. నిర్మాణరంగంలోకి కూడా ప్రవేశించినట్టు వార్తలు వస్తున్నాయి.. సంతోష్ కుమార్ కు బంధువు కావడంతో అనుకున్నవన్నీ వెంటనే జరిగిపోతున్నాయి.
హెలికాప్టర్ కొన్నది అందుకోసమేనా
ఆ మధ్య భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తామని కెసిఆర్ ప్రకటించినప్పుడు దక్షిణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు చెందిన కొంతమంది నాయకులు విమానం కొనేందుకు విరాళాలు ఇచ్చారు.. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు ప్రతిమ సంస్థల చైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు ఏకంగా హెలికాప్టర్ ని కొన్నాడు.. ఇది కేవలం తన కుటుంబం కోసం అని చెబుతున్నప్పటికీ తెర వెనుక వేరే కథ ఉంది.

ఈ హెలికాప్టర్ ను 47 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.. ఇది ఎయిర్ బస్ ఏసీ హెచ్ 135 రకానికి చెందినది.. హెలికాప్టర్ కొన్న వెంటనే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో పూజలు చేయించారు. కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నేపథ్యంలో ఈ హెలికాప్టర్ ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్తారని సమాచారం. అయితే ఇప్పటికే కొనుగోలు చేసిన విమానాన్ని ముఖ్యమైన నేతలను కలిసేందుకు వెళ్తున్నప్పుడు ఉపయోగిస్తారని సమాచారం. దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నామని ప్రకటన చేయగానే విమానం వచ్చేసింది. ఢిల్లీలో ఆఫీస్ నిర్మాణమైంది.. ఇప్పుడు హెలికాప్టర్ కూడా సమకూరింది.. ఏమైనా కెసిఆర్ సుడి ఇప్పుడు బాగుంది.