Jabardasth Vinod: జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో వినోద్ అలియాస్ వినోదిని ఒకరు. లేడీ గెటప్ లో అచ్చు అమ్మాయిలా ఉండే వినోద్ ఆ కోణంలో బాగా ఫేమస్ అయ్యాడు. చాలా కాలం వినోద్ చమ్మక్ చంద్ర టీమ్ లో చేశాడు. చమ్మక్ చంద్ర స్కిట్స్ మొత్తం భార్య పాత్రతో కూడిన ఫ్యామిలీ డ్రామాలుగా ఉంటాయి. దీంతో వినోద్ ని ఎక్కువగా చంద్ర తీసుకునేవారు. సత్య అనే లేడీ కమెడియన్ వచ్చే వరకు చంద్ర స్కిట్స్ లో వినోదే చేసేవాడు. కాగా వినోద్ తీవ్ర అనారోగ్య సమస్యకు గురయ్యాడట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

భార్యతో పాటు ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వినోద్… కలచి వేసే సంగతులు పంచుకున్నారు. వినోద్ లంగ్ డిసీజ్ కి గురయ్యారట. ఆయన ఊపిరితిత్తులో నీరు చేరిందట. ఒకరోజు అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారట. స్కాన్ తీసిన వైద్యులు ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కి గురయ్యాయని చెప్పారట. ఆ సమయంలో వినోద్ కనీసం నడవలేక పోయారట. జంక్ ఫుడ్ తినడం, కూల్ డ్రింక్స్ తాగడం, ఎక్కువగా ప్రయాణాలు చేయడం ఈ వ్యాధికి కారణమయ్యాయని వైద్యులు చెప్పారట.
వినోద్ ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారని ఆయన భార్య వెల్లడించారు. మందులు వాడటం వలన వినోద్ జుట్టు ఊడిపోయిందట. కఠిన పరిస్థితుల్లో తోటి కమెడియన్స్ సహాయం చేశారట. ఆది, సుడిగాలి సుధీర్, చంద్ర వంటి కమెడియన్స్ వినోద్ ని కలిసి మద్దతుగా నిలిచారట. వినోద్ పడిన ఇబ్బందులు గురించి తెలుసుకున్న అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి కోలుకున్నందుకు సంతోషపడుతున్నారు.

వినోద్ మాదిరే పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కిడ్నీలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ ఇటీవల నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఆయనకు భార్య సపర్యలు చేస్తున్నారు. కాగా వినోద్ గతంలో ఇంటి ఓనర్ చేతిలో దాడికి గురయ్యాడు. వినోద్ ఎప్పటి నుండో అద్దెకు ఉంటున్న ఇంటిని ఓనర్ దగ్గర కొనుగోలు చేశాడు. అయితే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయకుండా ఓనర్ ఇబ్బంది పెట్టాడు. గట్టిగా అడిగినందుకు దాడి చేశాడు. ఈ దాడిలో వినోద్ కంటికి తీవ్ర గాయమైంది. కొన్నాళ్ళు జబర్దస్త్ కి దూరమయ్యాడు.