Transgender Ruth Janpal: వెక్కిరించిన విధిని.. సవాల్ చేసింది.. కోర్టు మెట్లెక్కి డాక్టర్ అయింది

ఖమ్మంలోని రమణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ దళిత కుటుంబంలో పుట్టిన రూత్‌జాన్‌పాల్‌ ఒకటి నుంచి పదో తరగతి వరకు ఖమ్మం మామిళ్లగూడెం హైస్కూల్లో చదివారు.

Written By: NARESH, Updated On : September 5, 2023 2:07 pm

Transgender Ruth Janpal

Follow us on

Transgender Ruth Janpal: కొన్ని కథలు వింటుంటే కన్నీరు ఒలుకుతుంది. ఈ సమాజం మీద యవగింపు కలుగుతుంది. మనుషులుగా ఎందుకు పుట్టామని అసహ్యం వేస్తుంది. అలాంటి వేదన నుంచి పుట్టింది ఈ మహిళ. తన ఎత్తింది మగ జన్మయిప్పటికీ.. శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా ట్రాన్స్ జెండర్ అయింది. ఆమె పాలిట శాపం అయింది. సమాజం చిన్నచూపు చూసింది. దగ్గరి వాళ్ళు దూరం పెట్టారు. అయినవాళ్లు కాదు పొమ్మన్నారు. బడికి వెళ్తే తోటి పిల్లలు గేలిచేసారు. బయటికి వెళ్తే చుట్టూ ఉన్న మనుషులు అదోలా చూశారు.. రాజ్యాంగం తనకు ఎలాంటి హక్కులు ఇచ్చిందో తెలియదు. వాటి గురించి తెలుసుకోవాలంటే తనకు అప్పటికీ అవగాహన లేదు. ఎగతాళి చేస్తున్న సమాజం మీద కసిని పెంచుకుంది. అలా అలా చదవడం మొదలు పెట్టింది. కష్టాలకు ఎదురీదడం మొదలుపెట్టింది. చివరికి శివంగిలాగా మారింది. ప్రాణాలు పోసే డాక్టర్ అయింది. ఇంతటి సుదీర్ఘ చరిత్రలో ఎన్నో అవమానాలు. మరెన్నో పద ఘట్టనలు.

మురికి వాడలో పుట్టి..

ఓ మురికివాడలో పుట్టి పెరిగిన ఓ ట్రాన్స్‌జెండర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అందరితో తాము కూడా సమానమేనని దేశానికే చాటిచెప్పారు ఖమ్మం జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్‌ రూత్‌జాన్‌పాల్‌ కొయ్యల. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తూ తాజాగా పీజీలో సీటు సంపాదించారు. ఖమ్మానికి చెందిన రూత్‌జాన్‌ పాల్‌ మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ కళాశాలలో 2018లో గ్రాడ్యుయేట్‌ చేశారు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌లో చాలా ఆస్పత్రుల్లో ప్రయత్నం చేసినా.. ట్రాన్స్‌జెండర్‌ అన్న కారణంతో అందరూ తిరస్కరించారు. దీంతో నిరాశపడిన రూత్‌ జాన్‌ పాల్‌ తన హక్కుకోసం కోర్టుకు వెళ్లారు. ట్రాన్స్‌ జెండర్స్‌ హరిజెంటల్‌ రిజర్వేషన్‌ కోసం పిటీషన్‌ వేయగా.. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే.. 2014 నల్సార్‌ జడ్జిమెంట్‌ ప్రకారం థర్డ్‌ జెండర్స్‌కు కూడా ఉద్యోగ, ఉపాధి విద్య అవకాశాల్లో హక్కు కల్పించాలంటూ సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆధారంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కొయ్యల రూత్‌ జాన్‌పాల్‌కు మెడిసిన్‌లో పీజీ విద్యకు అవకాశాన్ని కల్పించాలని ఆలిండియా, రాష్ట్రస్థాయిలో ఆమె కోరుకున్న విభాగంలోఎస్సీ ట్రాన్స్‌జెండర్‌ కోటాలో సీటు కల్పించాలంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కానీ ఫిమేల్‌ ఎస్సీ కేటగిరిలో తెలంగాణ ప్రభుత్వం పీజీ సీటును కేటాయించింది. అదీ కూడా తాను కోరుకున్న సీటు కాకుండా 15అంశాల్లో (ప్రియారిటీ బ్రాంచిలు కాకుండా ) 15వ ఆఫ్షన్‌లో ఎంపిక చేసి కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు ఈఎస్‌ఐ హస్పటల్‌లో ఎండీగా ఎమర్జెన్సీ విభాగంలో సీటును కల్పించారు. దీనికి తాను ఎంచుకున్న విభాగంలో సీటు లభించకపోవడంతో కొంత అసంతృప్తిగానే ఉన్నట్లు రూత్‌జాన్‌ చెబుతున్నారు. అయితే ఇది దేశంలోనే ఓ ట్రాన్స్‌జెండర్‌కు దక్కిన అరుదైన గౌరవమంటున్నారు.

Transgender Ruth Janpal

నేపథ్యమిదీ..

ఖమ్మంలోని రమణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ దళిత కుటుంబంలో పుట్టిన రూత్‌జాన్‌పాల్‌ ఒకటి నుంచి పదో తరగతి వరకు ఖమ్మం మామిళ్లగూడెం హైస్కూల్లో చదివారు. 540 మార్కులు రావడంతో అప్పట్లో ఇంటర్‌ బైపీసీలో ఎక్స్‌లెంట్‌ కళాశాల యాజమాన్యం ఉచితంగా సీటు ఇచ్చి ప్రోత్సహించింది. ఇంటర్‌లోనూ 900మార్కులు సంపాదించిన రూత్‌ జాన్‌పాల్‌ ఆ తర్వాత ఎంసెట్‌లో 3200ర్యాంకును సాధించి మెడికల్‌ విభాగంలో సీటు సంపాదించారు. దీంతో రూత్‌జాన్‌ మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ కళాశాలలో కన్వీనర్‌ కోటాలో ఎంబీబీఎస్‌ చదివి ఏడాదిన్నర పాటు హౌస్‌ సర్జన్‌ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత ట్రాన్స్‌జెండర్‌ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయగా.. ఆ కోటాలో ఏ ప్రభుత్వ శాఖలోనూ కోటా లేకపోవడంతో వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో 2022లో ఏఆర్‌టీ కేంద్రంలో మెడికల్‌ ఆఫీసర్‌గా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తూ రెండేళ్ల న్యాయ పోరాటం తర్వాత పీజీ సీటును సాధించారు.

అన్నయ్య ప్రోత్సాహంతో

తాను పదోతరగతి చదువుతున్నప్పుడే నాన్న చనిపోయాడని, అన్నయ్య వెంకన్న ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయి ఎదిగానని రూత్‌జాన్‌పాల్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నో బాధలు పడ్డామని, ఇప్పటికీ కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదని, అంబేద్కర్‌ పుస్తకాలు చదివానని, ఆయన రచనలు తనను బాగా ప్రేరేపితం చేశాయని చెబుతున్నారు. భవిష్యత్తులో ఎవ్వరూ కూడా ట్రాన్స్‌జెండర్ల పట్ల వివక్షత చూపించొదద్దనేదే తన ఉద్దేశ్యమన్నారు.

సత్కరించిన ఖమ్మం కలెక్టర్‌

పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన రూత్‌జాన్‌.. అందరికీ ఆదర్శమని, నేటి సమాజంలో ట్రాన్స్‌ జెండర్లకు ఎక్కడా గుర్తింపు లేదని, వారిలో చదువుకున్న వారే చాలా తక్కువ ఉన్నారని అనుకునే వారికి రూత్‌జాన్‌ సమాధానమని ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో రూత్‌జాన్‌ను ఆయన ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కూల పరిస్థితులకు ఎదురొడ్డి లక్ష్యం సాధించడం గొప్ప విషయమని, పీజీ పూర్తయిన తర్వాత రూత్‌జాన్‌కు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.