
Uttarakhand Tiger: పెరుగుతున్న జనాభా, నగరీకరణతో వనాలు కనుమరుగవుతున్నాయి. దీంతో అరణ్యాల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. ప్రజలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా ఓ పెద్దపులి ఉత్తరాఖండ్‌లో మనుషులను చంపేస్తోంది. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
రాత్రి కర్ఫ్యూ..
ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లా పరిధిలో పులి సంచరిస్తుండడంతో పులి ఆనవాళ్లు గుర్తించిన అధికారులు అది 25గ్రామాల పరిధిలో సంచరిస్తున్నట్లు అంచనా వేశారు. ఈమేరు ఆ 25 గ్రామాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలుచేస్తున్నారు. మరోవైపు మంగళవారం వరకు అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేయాలని ఆదేశించారు.
సగం తిని వదిలేసిన మృతదేహం
పులి ఓ వ్యక్తిని చంపి సగం తిని వదిలి వెళ్లిన మృతదేహాన్ని గ్రామస్తులు ఆదివారం గుర్తించారు. ఈమేరకు ఫారెస్ట్ రేంజర్ మహేంద్ర సింగ్ రావత్‌కు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహం పరిశీలించిన అధికారులు సిమ్లీ గ్రామానికి చెందిన రణ్‌వీర్‌సింగ్ నేగికి చెందినదిగా గుర్తించారు. కార్బెట్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలోని సిమ్లీ గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న రణ్‌వీర్‌సింగ్ నేగికి దేహరాదూ¯Œ లోని తన బంధువులు శనివారం నుంచి ఫోన్ చేస్తున్నా స్పందించడంలేదు. దీంతో ఆ గ్రామస్తులకు సమాచారం ఇచ్చి ఇంటికి వెళ్లాలని కోరగా.. నేగి ఇంటికి వెళ్తున్న గ్రామస్తులకు దారిలో రక్తపు మరకలు కనిపించాయి. దీంతో అతడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించగా.. తన ఇంటికి 150 మీటర్ల దూరంలోనే అతడి మృతదేహాన్ని గుర్తించారు.
మూడు రోజులు రెండు ఘటనలు..
మూడు రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు, పులుల దాడిలో మరణించిన వారి సమీప బంధువులకు రూ.4 లక్షల పరిహారం అందజేయనున్నట్టు అటవీశాఖ అధికారి తెలిపారు. ఆ పులిని మనుషుల్ని వేటాడే జంతువుగా ప్రకటించాలని కోట్‌ద్వార్ ఎమ్మెల్యే దిలీప్ సింగ్ కునర్వార్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీని కోరారు.

పట్టుకునేందుకు విఫల యత్నం..
మనుషులను చంపుతున్న ఆ పులిని పట్టుకొనేందుకు గ్రామంలో ఓ బోనును ఏర్పాటు చేసినట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. పశువులకు మేతను తీసుకొచ్చేందుకు గ్రామస్తులు అడవుల్లోకి వెళ్లొద్దని సూచించారు. పులి కోసం అడవిని జల్లెడ పడుతున్నా అది చిక్కకపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఏ రోజు ఎవరిపై దాడిచేస్తుందో అని జంకుతున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.