Kerala: “పువ్వు పూస్తే గుడికి పూజకు వెళ్తుంది. జడకు అలంకారం అవుతుంది” అంటాడు సిరివెన్నెల. “పువ్వుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం. వేణువులో దాగున్న రాగం ఎంతో అతిశయం” అని రాశాడు వేటూరి. ఇంకా గొప్ప గొప్ప కవులు.. పూల గురించి మరింత గొప్పగా వర్ణించారు. ఇంతకీ పువ్వు ఎందుకు ఆకర్షిస్తుంది? ఎందుకంత రంగులను కలిగి ఉండి వర్ణ రంజితం చేస్తుంది? ఇలాంటి వర్ణాలు కెరోటినాయిడ్స్ వల్ల ఉత్పన్నమవుతాయని శాస్త్రవేత్తలు ఎప్పుడో తేల్చి చెప్పారు. ఈరోజు పూల పండుగ.. తెలంగాణ మొత్తం పూల జాతరను తలపించే పండగ.. తంగేడు పూలు, గునుగు పూలు, కట్ల పూలు, గుమ్మడి పూల సమ్మేళితంతో కనిపించే పండుగ.. అమ్మ లక్కలు ఒకచోట చేరి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ పాటలు పాడి సందడి చేసే పండుగ. మన దగ్గర సరే.. కేరళలో నిత్యం పూల పండుగే. ఇంతకీ ఏమిటా పూలు? ఎందుకు ఆ పండగ? ఒకసారి తెలుసుకుందామా?
దేవుడి సొంత ప్రాంతంగా కేరళ రాష్ట్రం ప్రసిద్ధి పొందింది. మలబార్ తీరం, కొబ్బరి తోటలు, సుగంధ ద్రవ్యాలు.. ఇలా ఎటు చూసుకున్నా ప్రకృతి రమణీయత కనిపిస్తుంది. పారే నీళ్లతో, పచ్చగా కనిపించే తేయాకు తోటలతో వర్ణ రంజితాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అయితే అలాంటి కేరళలో కలువ పూలకు కొదవలేదు. ఈ కలవ పూలు చూసేందుకు కాశ్మీర్లో కనిపించే టులిఫ్ పుష్పాల మాదిరిగా అనిపిస్తాయి. అయితే ఈ కలువ పూలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కలువ పువ్వులు కేవలం నీటిలోనే పెరుగుతాయి కాబట్టి కేరళలోని కొన్ని ప్రాంతాలకు చెందిన రైతులు తమ పొలాలను నీటి కొలనులుగా మార్చేశారు. దాదాపు వందల ఎకరాల్లో వారు ఈ తోటలను సాగు చేస్తున్నారు. ఒకసారి మొక్కలు నాటితే ఇక పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. చీడ పీడల బాధ అసలు ఉండదు. మొక్కలు కూడా ఏపుగా పెరుగుతాయి కాబట్టి.. పూల ఉత్పత్తి కూడా బాగుంటుంది.
రైతులు ఉదయాన్నే పడవల మీద వెళ్లి పూలను కోసుకొస్తుంటారు. ఈ పూలకు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. తిరుమల లోని వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడి నుంచే పూలు ఎగుమతి అవుతుంటాయి. గురు వాయుర్ కృష్ణ మందిరంలో స్వామివారికి జరిపే పూజల్లో ఈ పూలను విరివిగా వినియోగిస్తుంటారు. రోజూ ఇక్కడి పూలనే అభిషేకాల్లో వినియోగిస్తుంటారు. ఇక ఈ ప్రాంత రైతులు ఒక అడుగు ముందుకేసి ఆ నీటి కొలను ల్లో చేపలను పెంచడం ప్రారంభించారు. ఫలితంగా రెండు చేతులా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. వారు సాగు చేస్తున్న కలువ పూల తోటలను చూసి.. ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.