Chittoor: డిప్యూటీ సీఎం కుమార్తెకు కోపమొచ్చింది… 50 మంది వాలంటీర్ల పోస్టుకు ఎసరొచ్చింది

చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలానికి చెందిన 50 మంది వాలంటీర్లకు ఎంపీడీవో షోకాజ్ నోటీసులను జారీ చేశారు. వారు చేసిన తప్పేంటంటే డిప్యూటీ సీఎం కుమార్తె కృపా లక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరైన కార్యక్రమానికి హాజరు కాకపోవడమే.

Written By: Dharma, Updated On : October 22, 2023 11:37 am

Chittoor

Follow us on

Chittoor: వాలంటీర్ల గురించి పవన్ ప్రస్తావిస్తే దాన్ని ఒక రాజకీయ కోణంలో చూశారు. రూ. 5000 చేతిలో పెట్టి మీతో ఊడిగం చేయిస్తున్నారని చెబితే పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు పవన్ చెప్పిందే నిజమవుతోంది. వైసీపీ సర్కార్ ఎంతలా వాలంటీర్లను వాడుకుంటుందో అర్థమవుతోంది. ఓ మంత్రి కుమార్తె పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి హాజరు కాలేదని ఏకంగా 50 మంది వాలంటీర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎందుకు హాజరు కాలేదు అని సంజాయిషీని కోరారు. ప్రస్తుతం ఏపీలో ఇదొక వైరల్ వార్తగా మారింది.

చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలానికి చెందిన 50 మంది వాలంటీర్లకు ఎంపీడీవో షోకాజ్ నోటీసులను జారీ చేశారు. వారు చేసిన తప్పేంటంటే డిప్యూటీ సీఎం కుమార్తె కృపా లక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరైన కార్యక్రమానికి హాజరు కాకపోవడమే. శ్రీరంగరాజపురం మండల కేంద్రంలో” ఎందుకు ఆంధ్రకు జగనే కావాలి ” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కుమార్తె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ కార్యక్రమం కావడంతో అధికారులు హాజరు కాలేదు. గృహసారధులతో పాటు వాలంటీర్లు హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అయితే అది పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో ఎక్కడ ఇబ్బందులు వస్తాయని తెలిసి 50 మంది వాలంటీర్లు కార్యక్రమానికి హాజరు కాలేదు. మండలంలో 190 మంది వాలంటీర్లకు గాను.. 140 మంది మాత్రమే హాజరయ్యారు.

అయితే హాజరు కాని వాలంటీర్లకు ఎంపీడీవో నోటీసులు జారీ చేయడం విశేషం. మూడు రోజుల్లో వివరణ ఇవ్వకుంటే శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని అందులో పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం కుమార్తె హాజరైన కార్యక్రమానికి హాజరు కాలేదన్న కారణం చూపి వాలంటీర్లకు నోటీసులు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం కార్యక్రమానికి హాజరు కానందున.. వారి పనితీరు బాగాలేదని సాకుగా చూపడం ప్రారంభించారు. దీంతో వాలంటీర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొందరైతే బాహటంగానే విమర్శలు చేస్తున్నారు. ఇలా అయితే ఉద్యోగాన్ని వదులుకుంటామని.. ఎన్నికల్లో తమ ప్రతాపం చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి అయితే స్వచ్ఛంద సేవను పార్టీ సేవగా మార్చిన ఘనత మాత్రం వైసీపీ ప్రభుత్వానిదే.