Biryani Competition: కొడుకు కోసం తండ్రి ఒకేసారి నాలుగు చికెన్ బిర్యానీలు తిన్నాడు… కారణం తెలిస్తే హృదయం ద్రవించక మానదు..

తల్లి ప్రేమ బయటికి కనిపిస్తుంది.. తండ్రి ఆప్యాయత చేతల్లో దర్శనమిస్తుందంటారు. అలాంటి సంఘటనే ఇది. తన కొడుకు ఆరోగ్యాన్ని బాగు చేసుకునేందుకు ఓ తండ్రి పడిన తాపత్రయం అందరి కంటా నీరు తెప్పిస్తోంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 30, 2024 8:29 am

Biryani Competition

Follow us on

Biryani Competition: మన సమాజంలో తల్లికి దక్కినంత గౌరవం తండ్రికి లభించదు. తల్లి ప్రేమను గొప్పగా చూసే జనం.. తండ్రి ప్రేమను పెద్దగా లెక్కలోకి తీసుకోరు. అయినప్పటికీ తండ్రి ఏనాడూ గుర్తింపును కోరుకోకుండా తన కన్న పిల్లల అభివృద్ధి కోసం తాపత్రయపడుతుంటాడు. పిల్లలకు ప్రపంచాన్ని పరిచయం చేసి.. మంచి, చెడులను చెబుతూ ఉంటాడు. పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల అమితమైన ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటాడు. పిల్లల కోసం తండ్రి ఎన్నో త్యాగాలు చేస్తాడు. స్థూలంగా చెప్పాలంటే తన జీవితాన్ని మొత్తం పిల్లల కోసం వెచ్చిస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఈ సమాజం తల్లి ప్రేమ తర్వాతే తండ్రి ఆప్యాయతకు స్థానం ఇస్తుంది.

తన ద్వారా పుట్టిన పిల్లలకు ఏదైనా కష్టం వస్తే తండ్రి తట్టుకోలేడు. ఆ కష్టాన్ని తీర్చడానికి ఎంతటి ఇబ్బందులయినా పడతాడు. మరెన్ని త్యాగాలైనా చేస్తాడు. చివరికి తన ప్రాణాలను కూడా పణంగా పెడతాడు. అయితే తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో చెబుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. తన కొడుకు కోసం ఆ తండ్రి ఏకంగా నాలుగు బిర్యానీలు తిని త్యాగానికి సిసలైన అర్ధాన్ని చెప్పాడు. తన కొడుకు కోసం బిర్యానిలు తిన్న తండ్రి త్యాగం చేయడం ఏంటనే? ప్రశ్న మీలో ఉత్పన్నం కావచ్చు.. కానీ దాని వెనుక గుండెలను మెలిపెట్టే కథ ఉంది.

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ లో ఓ తండ్రి తన కొడుకు ఆరోగ్యాన్ని బాగు చేయించుకునేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. కోయంబత్తూర్ ప్రాంతంలో టీఎన్ రెస్టారెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిర్యాని ఈటింగ్ ఛాలెంజ్లో పోటీపడ్డాడు. ఆరు బిర్యానీలు తిన్నవారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ఆ రెస్టారెంట్ నిర్వాహకులు పోటీ నిర్వహించారు.. ఆటిజం అనే వ్యాధితో బాధపడుతున్న తన కొడుకు చికిత్స కోసం డబ్బులు కావాలనే ఉద్దేశంతో ఆ తండ్రి బిర్యానీ చాలెంజ్ లో పాల్గొన్నాడు. కొడుకు ఆరోగ్యాన్ని కాపాడేందుకు తాను ఈ పోటీలో నిలుచున్నాడు. బాధను దిగమింగుకుంటూనే.. ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూనే.. అతను బిర్యానీలు తిన్నాడు. తన పొట్టలో నొప్పి వస్తున్నప్పటికీ.. బిర్యానీ తినే సామర్థ్యం లేకపోయినప్పటికీ.. అతడు మొత్తం నాలుగు బిర్యానీలు లాగించాడు. నాలుగు బిర్యానీలు తిన్న నేపథ్యంలో ఆ తండ్రికి హోటల్ నిర్వాహకులు 50,000 బహుమతిగా ఇచ్చారు. అయితే ఇందులో ఎవరు విజేతగా నిలిచారనేది తెలియాల్సి ఉంది.. అయితే తన కుమారుడి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆ తండ్రి బిర్యాని ఈటింగ్ చాలెంజ్ లో పాల్గొన్న నేపథ్యంలో..నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రభుత్వం ఆ బాలుడిని ఆదుకోవాలని సూచిస్తున్నారు.