Rishikesh: మద్యం ఇచ్చే కిక్కు మరొకటి ఇవ్వదు కాబోలు.. అందుకే మందుబాబులు పీకలదాకా మందు తాగుతారు. ఇంకొందరైతే కిక్కు కోసం మాదకద్రవ్యాలు తీసుకుంటారు. వారు ఈ జాబితాలో కి రారు కాబట్టి మనం మందుబాబుల గురించే మాట్లాడుకుందాం. మందు బాబులంటే ఎవరు టాక్స్ పేయర్లు. దేశంలోని పలు రాష్ట్రాలకు కీలకమైన ఆదాయ మార్గాలు. తెలంగాణ రాష్ట్రంలో అయితే వారే ప్రగతి చోదక శక్తులు. కాబట్టి వారిని మనం ఏమీ అనకూడదు. ప్రభుత్వానికి, పోలీసులకు దయాదాక్షిణ్యం లేదు కాబట్టి, వారు రాష్ట్ర ఖజానాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే కృతజ్ఞత కూడా లేదు కాబట్టి వారిపై డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ఇంకా వారిపైనే అపరాధ రుసుము విధిస్తున్నారు. ఒక్కసారి అలా చేసే ఆ పోలీసులకు నెలాఖరుకు వేతనం రాకుంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించుకున్నారా? అందుకే టాక్స్ పేయర్లను ఈ సమాజమే కాదు, పోలీసులు కూడా గౌరవించాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మనకు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంటే కచ్చితంగా వారిని మనం అభినందించాలి. ఇలా అభినందించలేదనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మందుబాబు ఏకంగా కైలాసనాధుడికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. ఇందుకు అతడు ఎంచుకున్న మార్గమే పూర్తి విభిన్నం.
దేవ భూమి అయితేనేమి
ఉత్తారఖాండ్.. ఈ పేరు చెప్తే చాలామంది మదిలో దేవ భూమే మెదులుతుంది. అలాంటి రాష్ట్రంలోనూ మద్యం దుకాణాలకు కొదవలేదు. పైగా ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో పావు శాతం మద్యం వ్యాపారం వల్లే లభిస్తుంది. పైగా ఆ రాష్ట్రంలో చాలామంది వ్యవసాయ కార్మికులు ఉంటారు కాబట్టి.. పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకున్న తర్వాత కాసింత ఉపశమనం కోసం మద్యం తాగుతారు. ఇలా మద్యం తాగి తాగి ఒక యువకుడు వ్యసనపరుడైపోయాడు. సాయంత్రం దాటితే క్వార్టర్ మందు తాగకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఒకరోజు ఫుల్లుగా మందు తాగాడు. మందు తాగాడు కాబట్టి మాట తూలింది. ఎదుటి వ్యక్తికి ఎక్కడో అది గట్టిగా తగిలింది. ” నీకేంటి రా సమాధానం చెప్పేది తాగుబోతు నాయాలా” అనే కౌంటర్ ఎదుటి వ్యక్తి నుంచి గట్టిగా వచ్చింది. దీంతో ఈ మందు బాబు హార్ట్ అయ్యాడు. ఉండేది ఉత్తరాఖండ్ కాబట్టి, ఆ రాష్ట్రం శివుడికి ఆలవాలం కాబట్టి, శివుడి కోసం తపస్సు చేసే సాధువులు ఆ మంచు నుంచి శరీరానికి వెచ్చదనం కలిగించుకునేందుకు గంజాయి లాంటి మాదకద్రవ్యాలు పీలుస్తారు కాబట్టి.. వెంటనే ఆ శివయ్యకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు.
నంది మీద స్వైర విహారం
అసలే ఫుల్లుగా తాగి ఉన్నాడు. పైగా ఎదుటి వ్యక్తి అన్నమాటకు నొచ్చుకున్నాడు. వెంటనే కైలాస వాసుడుకి ఫిర్యాదు చేయాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఎదురుగా ఒక నంది కనిపించింది. తాగిన మత్తులో ఉన్నాడు కాబట్టి దాని మీద ఎక్కి కూర్చున్నాడు. అది కూడా పరుగు లంకించుకుంది. దీంతో తాను ఉండే రిషికేష్ పట్టణంలోని పలు వీధుల్లో ఆ నంది మీద కూర్చుని దానిని పరిగెత్తించికుంటూ ” కైలాస పతి నాథ్ జీ” అని శివుడిని స్మరించుకుంటూ ఆ పట్టణం మొత్తం కలియతిరిగాడు. చివరికి ఆ నంది అలసిపోయింది పరిగెత్తేందుకు మొరాయించింది. అతగాడికి మత్తు దిగింది. ఇలా ఈ కథ ముగిసింది.