Gujarat Couple: ఆయనో పెద్ద వ్యాపారి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. సమాజంలో ఎంతో పలుకుబడి ఉంది. చిటికేస్తే అన్నీ కూర్చున్న చోటకే వచ్చే పరిస్థితి. కూర్చుని తిన్నా.. తరగని సంపద. కానీ, ఇవేవీ ఆ వ్యాపారి దంపతులకు సంతృప్తిని ఇవ్వలేదు. పిల్లల భవిష్యత్ కోసం సంపదను కూడబెడితే.. వాళ్లిదరూ రెండేళ్ల క్రితం సన్యాసం తీసుకున్నారు. భౌతిక సుఖం వదిలిపెట్టారు. తృప్తి లేని సంపాదన కన్నా.. ఎంతో సంతృప్తిని ఇచ్చే తమ పిల్లల దారిలోనే నడవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వందల కోట్ల ఆస్తులను దానం చేసి సన్యాసులుగా మారిపోయారు. ఈనెల 22న దేశయాత్రకు బయల్దేరనున్నారు. ఈ కుబేరుల నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గుజరాత్‌కు చెందిన రియల్టర్..
గుజరాత్ సబర్‌కాంత జిల్లా వాసి భవేశ్ భండారి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొద్ది మొత్తంలో పెట్టుబడితో వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. క్రమంగా వ్యాపారం ఊపందుకుంది. దీంతో ఊహించని లాభాలు వచ్చాయి. ఆస్తులను కూడబెట్టారు. ఆయనకు కూతురు, కుమారుడు సంతానం. వారి పేరిట కూడా భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఇవేవీ వారికి సంతృప్తిని ఇవ్వలేదు.
తల్లిదండ్రులు సంపాదన కోసం..
తల్లిదండ్రులు తమకు ఏమీ ఇవ్వలేదని, ఎలాంటి ఆస్తిపాస్తులు సంపాదించలేదని నిందించే సంతానం ఉన్న ఈ రోజుల్లో భవేష్ భండారి పిల్లలు మాత్రం తల్లిదండ్రుల ఆస్తుల కోసం పాకులాడలేదు. భౌతిక సుఖాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 19 ఏళ్ల కుమార్తె, 16 ఏళ్ల కుమారుడు 2022లో సన్యాసం తీసుకున్నారు.
పిల్లల బాటలో నడవాలని..
రెండేళ్ల తర్వాత భవేష్ భండారి దంపతులు కూడా పిల్లల బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. వారి నుంచి ప్రేరణ పొంది తాము కూడా భౌతిక బంధాలను త్యజించాలని, సన్యాసి మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నారు. మనిషి జీవితంలో అనేక దశలు ఉంటాయి. శైశవ దశ మొదటిది అయితే సన్యాసం దశ చివరిది. మధ్యలో బాల్యం, కౌమారం, యవ్వనం.. ఇలా అనేక దశలు ఉన్నాయి. కానీ భవేష్ పిల్లలు కౌమార దశలోనే భౌతిక బంధాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న తమ పిల్లలే ఇంతటి త్యాగం చేయడంతో భవేష్ దంపతులు కూడా వారినుంచి స్ఫూర్తి పొందారు.
రూ.200 కోట్లు విరాళం..
రెండు నెలల క్రితమే సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్న భవేష్ దంపతులు ఫిబ్రరిలో జరిగిన ఓ వేడుకలో తమ సంపద రూ.200 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 22న అధికారికంగా సన్యాసం తీసుకోనున్నారు. మోక్షం పొందేదుకు దేశయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
భిక్షాటనతో జీవనం..
ఏప్రిల్ 22న సన్యాసం తీసుకోబోతున్న భండారీ దంపతులు మరో 35 మందితో కలిసి చెప్పులు లేకుండా నాలుగు కిలోమీటర్లు ఊరేగింపు చేయనున్నారు. అక్కడ వారు తమ ఆస్తులను వదిలేస్తారు. తర్వాత రెండు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. భిక్షం కోసం ఒక గిన్నె తీసుకుని దేశమంతటా చెప్పులు లేకుండా సంచారం చేస్తారు. భిక్షాటనతోనే జీవనం సాగిస్తారు.