Telangana Rains: తెలంగాణకు వాతావరణ శాఖ చల్లచి కబురు అందించింది. వచ్చే పది రోజులు ఎండ తీవ్రత తగ్గుతుందని, పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కానీ, తర్వాత ఎండ తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది.
ఉపరితల ఆవర్తనం..
ఎల్‌నినో కారణంగా దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నుంచే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. దీంతో వేడికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మూగజీవాలు తల్లడిల్లుతున్నాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మళ్లీ రెండు రోజులుగా భానుడు భగ్గుమంటున్నాడు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మళ్లీ వర్ష సూచన చేసింది. వచ్చే పది రోజులు అంటే… ఏప్రిల్ 25 వరకు వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపింది. ఎండలు, వడగాలులు కూడా ఉండవని పేర్కొంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఏప్రిల్ 18 నుంచి 25 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
నైరుతి రుతుపవనాలు తుపానుగా
రాజస్థాన్ మీదుగా నైరుతి రుతుపవనాలు తుపానుగా మారి కోస్తా, కర్ణాటక వరకు వ్యాపించాయని తెలిపింది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరో ఐదు రోజులు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. గురు, శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రైతుల ఆందోళన…
అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంటలు ఇప్పుడే చేతికి వస్తున్నాయి. ఈ తరుణంలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. మామిడితోపాటు కూరగాయల రైతులు కూడా వాతావరణ శాఖ సూచనతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు కోయడాని రైతులు వెనకాడుతున్నారు.