
Indian Cricket: క్రికెట్.. ఈ మూడు అక్షరాల పదం దేశంలో అందరి నర నరాన జీర్ణించుకుపోయింది.. క్రికెట్ పుట్టిన దేశంలో కంటే మన దగ్గరే బహుళ ప్రాచుర్యం పొందుతోంది. అందుకే ప్రపంచంలోనే మిగతా దేశాల క్రికెట్ సమాఖ్యల కంటే.. భారత క్రికెట్ సమాఖ్య కు అధికంగా ఆదాయం రావడం వెనుక కారణం ఇదే. అందుకే ప్రపంచ క్రికెట్ సమాఖ్యను బిసిసిఐ శాసిస్తోంది. అసలు బీసీసీఐ లేకుంటే ప్రపంచ క్రికెట్ సమాఖ్య మనుగడ ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఉంది. అంటే భారత్ లో క్రికెట్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడంటే క్రికెట్ అన్ని వర్గాలకు చేరువయ్యింది. కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా లేదు.
వెనుకటి రోజుల్లో..
భారతదేశంలో ఒకప్పుడు క్రికెట్ ను జెంటిల్మెన్ ఆటగా పరిగణించేవారు. సంపన్న వర్గాలు మాత్రమే ఆటను ఆడేవి. ఇప్పట్లో మాదిరి ఇప్పుడు మైదానాలు లేవు. సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్స్ లో క్రికెట్ మ్యాచ్లు ఆడేవారు.. వాటిని వీక్షించేందుకు సంపన్న వర్గాలు మాత్రమే వెళ్లేవి.. సామాన్యులు కలలో కూడా క్రికెట్ గురించి ఆలోచించేవారు కాదు. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారాయి.. అన్ని వర్గాల ప్రజలు క్రికెట్ ఆడే రోజులు వచ్చాయి.. ఈ క్రమంలో యువతరం భారత క్రికెట్ జట్టును మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాంటి టోర్నీలు నిర్వహిస్తుండటంతో వర్థమాన క్రీడాకారులకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయి. వారిని ఆయా జట్లు భారీ ధరకు కొనుగోలు చేస్తుండటంతో ఆటగాళ్ల ఆర్థిక పరిస్థితి మారుతున్నది. గత ఏడాది ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ను ఓ టీ టీ ప్లాట్ పాం లో 200 మిలియన్ల మంది వీక్షించారంటే మనదేశంలో క్రికెట్ కు ఏ స్థాయిలో ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక ఈ ఏడాది శ్రీలంకతో భారత్ 3 టీ 20 మ్యాచ్ లు ఆడింది. ఇందులో సూర్య కుమార్ యాదవ్, అక్షర్ పటేల్, గిల్, హుడా, శివమ్ మావి, చాహల్, ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. భారత్ సీరిస్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించారు.. వాస్తవంగా వీరంతా కూడా ఎటువంటి క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చినవారు కాదు. వీరంతా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. కేవలం తమ ప్రతిభ ద్వారా అపారమైన అవకాశాలను పొంది భారత జట్టులో స్థానం సంపాదించారు. ఇక భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడే.
మార్పు స్పష్టంగా కనిపిస్తోంది
ఒకప్పుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, రంజిత్ సిన్హాజీ, దిలీప్ సిన్హాజీ, విజయనగరం మహారాజా, పోర్బందర్ మహారాజా, పాటియాలా మహారాజా, బన్ స్వారా రాష్ట్రానికి చెందిన రాజు మిగతావారు క్రికెట్ ను ఆ రోజుల్లో బాగా ఆడేవారు. 1932లో మొదటి ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా పోర్బందర్ మహారాజా భారత జట్టుకు కెప్టెన్ గా వివరించారు.. అది టెస్ట్ కాబట్టి ఆట కూడా తీరికలేకుండా సాగింది.. స్వాతంత్ర్యం అనంతరం క్రికెట్ పై సంపన్నుల ఆధిపత్యం తగ్గింది.. ఆ తర్వాత బ్రాహ్మణుల ఆధిపత్యం మొదలైంది.. 1960 నుంచి 1990 వరకు టెస్ట్ ఆడే భారత జట్టులో కనీసం ఆరుగురు బ్రాహ్మణ క్రీడాకారులు ఉండేవారు. ఒక్కోసారి ఆ సంఖ్య 9 దాకా ఉండేది. ముఖ్యంగా 1950 నుంచి 1980 వరకు బొంబాయి బ్రాహ్మణులు క్రికెట్ పై తిరుగులేని పెత్తనం చెలాయించారు.
పరిస్థితి మారింది
కాలానుగుణంగా పరిస్థితులు మారిపోవడంతో క్రికెట్లోకి అన్ని కులాలకు చెందిన యువకులు వచ్చారు.. ప్రతిభ ఆధారంగానే ఎంపికలు చేస్తుండడంతో ఒకరిని ఒకరు అడ్డుకునే పరిస్థితి లేకపోయింది. 85 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో కేవలం నలుగురు దళిత యువకులు మాత్రమే జాతీయ జట్టులో ఆడే అవకాశం పొందడం బాధాకరం. ఇప్పటివరకు భారత జాతీయ జట్టులో 289 మంది క్రీడాకారులు క్రికెట్ ఆడారు. ఇక క్రికెట్లో కి దిగువ స్థాయి ఆటగాళ్లు ప్రవేశించడం వెనక అనేక కారణాలు ఉన్నాయి. . ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ గేమ్ అత్యంత ప్రజాదరణ కలిగి ఉండేది. తర్వాత ఆ ఫార్మాట్ వన్ డేకు మార్పు చెందింది.. ఇందులో ఆటగాళ్ల ఫిట్నెస్ కీలకంగా మారడంతో వారు శారీరక వ్యాయామంపై దృష్టి సారించడం పెట్టారు. దాని తర్వాత అది టి20 ఫార్మాట్ లోకి మారింది. ఆట వేగం పెరిగిపోవడంతో ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో సెలెక్టర్లకు ఆటగాళ్లను ఎంపిక చేయడం కత్తి మీద సామైంది.. ఎంతటి గొప్ప క్రీడాకారుడైనా ఫామ్ లో లేకపోతే తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇతర ఆటగాళ్లకు మార్గాలు సుగమం అయ్యాయి.

ఊరుకునే పరిస్థితి లేదు
ఎంపికైన ఆటగాళ్లు సరిగా ఆడక పోతే అభిమానులు ఊరుకోవడం లేదు. ఆటగాళ్లపై నేరుగా విమర్శలు చేస్తున్నారు.. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్లో భారత క్రీడాకారుడు సంజు శాంసన్ విఫలమయ్యాడు. దీంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. “ఈ ఆటతీరుతో జాతీయ జట్టుకు ఎలా ఎంపికయ్యావంటూ” నెటిజన్లు ఏకిపారేశారు. ఇదే మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ నోబాల్స్ వేయడంతో అభిమానులు విమర్శలకు దిగారు. “అతడికి బౌలింగ్ ఎలా వేయాలో కొండ ప్రాంతంలో శిక్షణ ఇవ్వాలని” చురకలు అంటించారు.. గెలిచినప్పుడు చొక్కా విప్పి సంబరాలు జరుపుకునే అభిమానులు… జట్టు ఓడిపోతే అంత ఈజీగా తీసుకునే పరిస్థితులు లేవు.. ఎందుకంటే భారతదేశంలో క్రికెట్ ఒక మతం కాబట్టి.