https://oktelugu.com/

Monkey: ఆటో ఢీకొని పిల్ల కోతి మృతి.. కోపంతో మిగతా కోతులు ఏం చేశాయో తెలుసా?

ప్రేమ, మానవత్వం, సానుభూతి ప్రదర్శించాల్సిన మనిషి మాత్రం మాయమవుతున్నాడు. కోపం, పగ, ప్రతీకారంతో రెచ్చిపోతున్నాడు. బంధాలు, అనుబంధాలను దూరం చేసుకుంటున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 12, 2023 / 03:15 PM IST

    Monkey

    Follow us on

    Monkey: నవ్వు, ఏడుపు, కోపం, పగా ఇవన్నీ కేవలం మనుషులకే పరిమితం అనుకుంటాం. అయితే ఈ భావోద్వేగాలకు జంతువులు కూడా మినహాయింపు కాదు. అందుకే ఒక కాకి చనిపోతే.. వందలాదిగా కాకులు వచ్చి తమ సానుభూతి తెలుపుతాయి. చనిపోయిన కాకిని ఎవరూ ముట్టుకోకుండా చూస్తాయి. ఆ రోజంతా అక్కడే ఉంటాయి. అచ్చం ఇలాగే ఇక్కడ కోతులు చేశాయి. వరంగల్‌ జిల్లా కరీమాబాద్‌లోని సరస్వతి స్కూల్‌ ప్రాంతంలో ఆటో ఢీకొని ఓ కోతి పిల్ల మరణించింది. దీంతో అక్కడే ఉన్న తల్లి కోతి బిడ్డను రోడ్డుపై నుంచి పక్కకు లాక్కేళ్లేందుకు ప్రయత్నించింది. అయితే అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ కోతుల గుంపు ఒక్కసారిగా దూసుకొచ్చింది. వందలాది కోతులు ఆ ప్రాంతాకి వచ్చాయి. అటుగా వెళ్తున్న వారిపై దండయాత్ర చేశాయి. తమ జాతికి చెందిన జీవి ప్రాణాలు తీశారన్న పగో, మరెంటో కానీ.. ప్రజలపై తిరగబడ్డాయి. ఈ క్రమంలో కొందరు వాహనదారులకు గాయాలు కూడా అయ్యాయి.

    పారిపోయిన ప్రజలు..
    కోతుల బీభత్సం చూసి అటుగా వెళ్తున్న ప్రజలు, వాహనాలను రోడ్డుపైనే వదిలేసి పరుగులు పెట్టారు. అనంతరం కోతులు చనిపోయిన ఆ పిల్ల కోతిని అక్కడి నుంచి తీసుకెళ్లాయి. సుమారు గంటసేపు కోతులు బీభత్సం సృష్టించాయి.

    మాయమవుతున్న మనిషి..
    ప్రేమ, మానవత్వం, సానుభూతి ప్రదర్శించాల్సిన మనిషి మాత్రం మాయమవుతున్నాడు. కోపం, పగ, ప్రతీకారంతో రెచ్చిపోతున్నాడు. బంధాలు, అనుబంధాలను దూరం చేసుకుంటున్నారు. జంతువులతో పోలిస్తే.. తెలివైన మనిషి.. చదువకున్న మనిషి.. సాంకేతికతను అందిపుచ్చుకున్న మనిషి, మంచి, చెడులను ఎంచే వివేచన ఉన్న మనిషి మాత్రం జంతువులకన్నా హీనంగా మారుతున్నాడు. ఐనవారిని కూడా దూరం చేసుకుంటున్నారు. పగ, ప్రతీకారంతో మట్టుపెడుతున్న ఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం. ఎవరైనా మనిషి చనిపోతే ఫోన్లలో సమాచారం ఇస్తేనే సకాలంలో బంధుమిత్రులు చేరుకోరు.. అలాంటిది ఏ సమాచారం లేకపోయినా ఈ మూగ జీవులకు ఎలా తెలిసింది..? ఇన్ని వందలాది కోతులు అంత తక్కువ సమయంలో ఎలా చేరుకున్నాయి.? అని స్థానికులు చర్చించుకున్నారు. మరి కోతి నుంచే పుట్టిన మనిషి.. వాటిని చూసి కొంతైనా నేర్చుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.