దేశంలో శరవేగంగా అడ్డూఅదుపు లేకుండా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ప్రజల్లో అపోహలను, మూఢ నమ్మకాలను పెంచింది. వైరస్ గురించి ప్రతిరోజూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు, వైద్యులు సైతం వైరస్ ఎలా సోకుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరో మార్గం లేదు.
అయితే కరోనా మహమ్మారి విషయంలో నెలకొన్న అపోహల వల్ల హర్యానాలోని రెండు గ్రామాల ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామాల్లో కరోనా పరీక్షలను బహిష్కరించేలా గ్రామ పెద్దలతో తీర్మానం చేయించారు. రాష్ట్రంలోని ఫతేహాబాద్ జిల్లా తమస్పురా, అలీపూర్ భరోత పంజాయితీల ప్రజలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఆరోగ్య బృందాలు తమ గ్రామాల్లోకి రాకూడదని వెల్లడించాయి.
తమస్పురా, అలీపూర్ భరోత గ్రామాల ప్రజలు ఇలాంటి వింత నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది. కరోనా లక్షణాలు ఉన్న ఆరోగ్య సిబ్బంది తమ గ్రామంలోకి వస్తే తమ గ్రామాల్లో కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. సర్పంచ్ బలరామ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో నెలకొన్న భయాందోళన వల్లే ఇలాంటి వింత తీర్మానం చేశామని వెల్లడించారు.
గ్రామ ప్రజలు ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్ కేంద్రాలకు తీసుకెళతారని భయపడుతున్నారని.. కరోనాకు సరైన మందులు లేకపోవడంతో చికిత్స చేయించుకోవడానికి ఆసక్తి చూపడం లేదని సర్పంచ్ తెలిపారు. విషయం ఫతేహాబాద్ డిప్యూటీ కమిషనర్ నరహరి సింగ్ దృష్టికి రాగా ఆయన ఇలాంటి తీర్మానాలు తమను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని.. తీర్మానం చేసిన సర్పంచ్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని వెల్లడించారు.