Poco X8 Review : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బడ్జెట్, మిడ్‌రేంజ్ విభాగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పోకో (Poco) మరో కొత్త ఫోన్‌తో వినియోగదారుల ముందుకొచ్చింది. మంచి పనితీరు, ఆకర్షణీయమైన ఫీచర్లు, అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్లను అందించడం పోకో ప్రత్యేకత. ఈ ఏడాది ఇప్పటికే Poco X8 సిరీస్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చిన సంస్థ.. తాజాగా Poco X8, Poco X8 Power మోడళ్లతో తన లైనప్‌ను మరింత విస్తరించింది. ముఖ్యంగా రూ.30 వేలలోపు ధరల విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన Poco X8 ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ర్యామ్ ధరల పెరుగుదల (RAM Crisis) కారణంగా ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి. దీంతో చాలా కంపెనీలు తక్కువ ధర మోడళ్ల కంటే ప్రీమియం ఫోన్లపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోకో తన కొత్త X8 మోడల్‌ను పోటీ ధరల విభాగంలో తీసుకురావడం విశేషం. భారీ బ్యాటరీ, మంచి డిస్‌ప్లే, ఆకట్టుకునే డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ వినియోగదారులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.
డిజైన్: ఆరెంజ్ కలర్‌లో ప్రత్యేక ఆకర్షణ
Poco X8 డిజైన్ విషయంలో కంపెనీ కొంత భిన్నమైన ప్రయోగం చేసింది. సాధారణ స్మార్ట్‌ఫోన్ల మాదిరిగా కాకుండా వెనుక ప్యానెల్‌పై మూడు విభిన్నమైన డిజైన్ భాగాలను అందించింది. పైభాగంలో గ్లోసీ ఫినిష్, కింది ఎడమవైపు డాట్ మెష్ తరహా ప్యాటర్న్, మరోవైపు నిలువు గీతల డిజైన్ కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కేవలం విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే. చేతితో తాకినప్పుడు మాత్రం సాధారణ ఫ్లాట్ ఉపరితలంలానే అనిపిస్తుంది.
ఈ ఫోన్ బ్లాక్, ఫ్రాస్ట్ వైట్, ఫైరీ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వీటిలో ఫైరీ ఆరెంజ్ కలర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాధారణ ఆరెంజ్ షేడ్స్‌లా ఎక్కువ ప్రకాశవంతంగా కాకుండా సున్నితమైన రంగుతో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. వెనుక ప్యానెల్‌కు అనుగుణంగా గోల్డ్ షేడ్‌లో ఉన్న ఫ్లాట్ మిడ్‌ఫ్రేమ్ ఫోన్ అందాన్ని మరింత పెంచుతుంది.
పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్‌ను కుడివైపు అందించారు. వీటిని సులభంగా ఉపయోగించుకునేలా అమర్చారు. ఫోన్ పరిమాణం పెద్దదిగా ఉన్నప్పటికీ బటన్ల పొజిషనింగ్ కారణంగా చేతిలో పట్టుకోవడం సౌకర్యవంతంగా ఉంటుంది.
భారీ బ్యాటరీ కారణంగా పెరిగిన బరువు
Poco X8లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం 9,000mAh భారీ బ్యాటరీ. ఈ బ్యాటరీ కారణంగానే ఫోన్ మందం, బరువు కొంత ఎక్కువగా ఉన్నాయి. దీని కొలతలు 163.45 x 78.27 x 8.6 మిల్లీమీటర్లు కాగా, బరువు 223 గ్రాములు. సాధారణంగా ఇదే పరిమాణంలో ఉండే ఇతర స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే దాదాపు 20 గ్రాముల వరకు ఎక్కువ బరువు ఉంటుంది.
అయితే భారీ బ్యాటరీని అందించిన నేపథ్యంలో ఈ బరువును కొంతవరకు సమర్థించవచ్చు. రోజంతా ఎక్కువగా ఫోన్ ఉపయోగించే వారికి, వీడియోలు చూసేవారికి, గేమింగ్ చేసే వారికి పెద్ద బ్యాటరీ ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది.
డిస్‌ప్లే: 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED స్క్రీన్
డిస్‌ప్లే విషయానికి వస్తే Poco X8లో 6.83 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్‌ను అందించారు. దీనికి గరిష్ఠంగా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. దీంతో స్క్రోలింగ్, యానిమేషన్లు, వీడియోలు చూడటం వంటి సందర్భాల్లో మెరుగైన విజువల్ అనుభూతి లభించే అవకాశం ఉంది. పెద్ద స్క్రీన్ కావడంతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, గేమింగ్‌కు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.
వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌లోనూ ప్రత్యేకత
Poco X8లో మరో ముఖ్యమైన ఫీచర్ దాని డ్యూరబిలిటీ. ఈ ఫోన్‌కు IP66, IP68, IP69, IP69K రేటింగ్స్‌ను అందించారు. ఇవి దుమ్ము, నీటి నుంచి ఫోన్‌కు రక్షణ కల్పించడంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా రోజువారీ వినియోగంలో అనుకోకుండా నీరు పడటం వంటి పరిస్థితుల్లో అదనపు భరోసా లభిస్తుంది.
Poco X8 కొనడం విలువైనదేనా?
Poco X8 డిజైన్, బ్యాటరీ, డిస్‌ప్లే అంశాల్లో ప్రత్యేకతను చూపించే స్మార్ట్‌ఫోన్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా 9,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, బహుళ IP రేటింగ్స్ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణలు. అయితే 223 గ్రాముల బరువు, 8.6mm మందం కొంతమంది వినియోగదారులకు ఇబ్బందిగా అనిపించవచ్చు.
రూ.30 వేలలోపు ధరల విభాగంలో పెద్ద బ్యాటరీ, విభిన్నమైన డిజైన్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కోరుకునే వారికి Poco X8 ఒక ఆసక్తికరమైన ఎంపికగా నిలవనుంది. అయితే ఫోన్ పూర్తి స్థాయి పనితీరు, కెమెరా నాణ్యత, బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్ వేగం వంటి అంశాలను కూడా పరిశీలించిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.