Pawan Kalyan : ‘పవన్ ఏపీ సీఎం’ ఇప్పుడిదే ట్రెండింగ్.. ఏ వెబ్ సైట్ చూసినా.. ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా పవన్ సీఎం అంటూ హోరెత్తిస్తున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్‌లు, కొన్ని మీడియా వెబ్‌సైట్లు “డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాత్కాలికంగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్నారు” అనే ప్రచారాన్ని చేస్తున్నాయి. జనసేన అభిమానులు ఈ వార్తను ఆనందంగా పంచుకుంటూ, “మన కలలు నెరవేరాయి” అంటూ పోస్టులు చేస్తున్నారు. అయితే, ఈ వార్తకు ఉన్న ఆధారాలు ఏమిటి? వాస్తవం ఏమిటి? అసలు ఇది సాధ్యమేనా? అన్నది ప్రశ్న.
డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ తాత్కాలికంగా సీఎంగా బాధ్యతలు తీసుకోనున్నారంటూ పలు సోషల్ మీడియా ఖాతాలు ప్రచారం ప్రారంభించాయి. కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు దీనిని “బ్రేకింగ్ న్యూస్”గా ప్రసారం చేశాయి. దీని మీదే ఆధారపడి జనసేన అభిమానులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇది చంద్రబాబు వ్యూహమేనా? లేక ఎవరో మంట పెట్టే ప్రయత్నమా? అన్నది అందరికీ డౌట్ కొడుతోంది. ఈ ప్రచారం గమనిస్తే, ఇది ఒక రాజకీయ మాయాజాలంగా కనిపిస్తోంది. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆ సమయంలో పవన్‌ను తాత్కాలికంగా సీఎం చేస్తారన్న ఊహాగానాలు వ్యాప్తి చెందడం, టీడీపీ-జనసేన మధ్య అపోహలు కలిగించాలన్న కుట్రగా అనిపిస్తోంది. చంద్రబాబు రాజకీయంగా ఎంత అప్రమత్తుడో అందరికీ తెలిసిందే. గతంలో ఎన్టీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు ఏకంగా సీఎం అయ్యి ఎన్టీఆర్ కు వెన్నుపొటు పొడిచాడు. దానికి చంద్రబాబే నాడు ప్రధాన సాక్షి కావడంతో బాబు ఇలాంటి ప్రయోగాలు అస్సలు చేయడు. చేయలేడు. నాలుగు రోజుల విదేశీ పర్యటన కోసం సీఎం బాధ్యతలు ఎవరికీ అప్పగించరు. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయిన పవన్ కల్యాణ్‌కు అప్పగించడం అసంభవం అనే చెప్పాలి.
రాజ్యాంగం ప్రకారం “డిప్యూటీ సీఎం” అనే పదవి కేవలం లాంఛనప్రాయమైనది. దీనికి ప్రత్యేక అధికారాలు ఉండవు. అది ఒక గౌరవ హోదా మాత్రమే. పాలనా వ్యవహారాల్లో డిప్యూటీ సీఎంకు ఏ ప్రత్యేక అధికారం ఉండదు. మంత్రివర్గంలోని ఒక సాధారణ సభ్యుడిగానే ఆయన్ను పరిగణిస్తారు. ఒక సీఎం విదేశీ పర్యటనలలో ఉన్నప్పుడు సాధారణంగా ఏ బాధ్యతను కూడా తాత్కాలికంగా ఇతరులకు అప్పగించరు. ఎందుకంటే బాబు ఎవరినీ నమ్మడు.. అత్యవసర ఫైళ్లను, ముఖ్య నిర్ణయాలను విదేశాల నుంచే పరిశీలించగల సామర్థ్యం చంద్రబాబుకు ఉంది. అంతేకాదు, గతంలో ఎన్నిసార్లు విదేశీ పర్యటనలలో పాల్గొన్నా ఎప్పుడూ ఇన్‌చార్జి సీఎంగా ఎవరినీ నియమించలేదు.ప్రస్తుతం మంత్రివర్గంలో టీడీపీ తరఫున కీలకమైన బాధ్యతలు నారా లోకేష్ చూసుకుంటున్నారు. అయితే ఆయనకు కూడా ఇన్‌చార్జ్ సీఎంగా అవకాశం ఇవ్వలేదు. అలాంటప్పుడు పవన్ కల్యాణ్‌కు ఇస్తారా? అదీ ప్రత్యేక ప్రయోజనం లేకుండా? దీన్ని బట్టి బాబు నమ్మడు.. పవన్ సీఎం కాలేడు అన్నది నిజం..
ఈ ప్రచారం వెనుక అసలైన ఉద్దేశ్యం, టీడీపీ-జనసేన మధ్య సున్నిత బంధాన్ని బలహీనపర్చడమే అనిపిస్తుంది. పవన్ కల్యాణ్ అభిమానుల్లో “ఇదిగో మేము కోరుకున్నది నెరవేరింది” అనే భావన కలిగించి, తర్వాత అది నిరాశకు దారితీసేలా, తద్వారా అసహనం పెంచే ప్రయత్నం అయి ఉండవచ్చు.
సమాజంలో మారుతున్న ప్రచార పద్ధతుల వలన ఎంతటి అవాస్తవమైన వార్తలైనా హోరెత్తేలా మారాయి. కానీ ప్రజలు, ముఖ్యంగా రాజకీయ విషయాల్లో ఆసక్తి కలిగిన వారు, సంక్షిప్తంగా కాకుండా విశ్లేషణాత్మకంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వార్తపై ఉద్వేగం కన్నా సూక్ష్మ పరిశీలన అవసరం. “వాట్సాప్ విశ్వాసం” కంటే “వాస్తవ విజ్ఞానం” మిన్న.