Urea in Diesel Cars: సాధారణంగా డీజిల్ వెహికల్స్ నడిపే వాళ్లకు యాడ్‌బ్లూ లేదా డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ గురించి చెప్పాల్సిన పని లేదు. దీన్ని సింపుల్ ల్యాంగ్వేజీలో యూరియా ద్రావణం అనొచ్చు. చాలా మందికి డీజిల్ కార్లలో యూరియా ఎందుకు వేస్తారు, దాని అసలు పని ఏమిటి అనేది తెలుసుకోవాలని ఉంటుంది. మామూలుగా డీజిల్ ఇంజిన్‌తో నడిచే వాహనాలు నడుస్తున్నప్పుడు, వాటి నుండి పొగతో పాటు చాలా ప్రమాదకరమైన వాయువులు బయటకు వస్తాయి. ఈ వాయువులలో ముఖ్యంగా నైట్రోజన్ ఆక్సైడ్ ఒకటి. ఇది గాలిలో కలిసి వాతావరణ కాలుష్యాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, మనుషుల ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం. ఇలాంటి ప్రమాదకరమైన వాయువుల ప్రభావాన్ని తగ్గించడానికే ఈ యూరియా ద్రావణాన్ని వాడుతారు.
ప్రభుత్వం బీఎస్6 అనే కొత్త నియమాలను తీసుకొచ్చినప్పుడు, డీజిల్ కార్ల నుంచి వచ్చే పొగను మరింత శుభ్రం చేయడం వాహన కంపెనీలకు తప్పనిసరి అయ్యింది. అందుకే ఇప్పుడు చాలా డీజిల్ కార్లలో ఎస్‌సీఆర్ టెక్నిక్ అనే దాన్ని వాడుతున్నారు. ఈ టెక్నిక్‌లోనే యూరియా ద్రావణాన్ని కలుపుతారు. కారు నుండి వచ్చే పొగలో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్‌లను తగ్గించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. యూరియా ద్రావణాన్ని కారులో ఒక స్పెషల్ ట్యాంక్‌లో నింపుతారు. దీన్ని సాధారణంగా మార్కెట్లో యాడ్‌బ్లూ అనే పేరుతో అమ్ముతారు. ఇంజిన్ నుండి పొగ ఎగ్జాస్ట్ పైపు నుండి బయటకు వచ్చినప్పుడు, అది మొదట ఎస్‌సీఆర్ సిస్టమ్‌లోని ఒక ప్రత్యేక భాగాన్ని దాటుతుంది. అక్కడ ఈ యూరియా ద్రావణాన్ని ఆ పొగలోకి పిచికారీ చేస్తారు.
Also Read: WhatsApp money fraud: వాట్సాప్‌లో ఇది తెరిచారో మీ డబ్బులు గోవిందా
ఈ యూరియా ద్రావణం వేడికి, కెమికల్ ఛేంజెస్ కు గురై అమ్మోనియాగా మారుతుంది. ఈ అమ్మోనియా, పొగలో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్‌లతో కలిసి వాటిని విడదీస్తుంది. దీనివల్ల నైట్రోజన్ ఆక్సైడ్‌లు నైట్రోజన్ , నీరుగా మారిపోతాయి. ఈ నైట్రోజన్, నీరు రెండూ వాతావరణానికి హానికరం కావు. ఈ విధంగా కారు నుండి వచ్చే పొగ చాలా శుభ్రంగా మారి, పర్యావరణానికి మేలు చేస్తుంది. యాడ్‌బ్లూ లేదా యూరియా ద్రావణం పెద్దగా ఖరీదైనది కాదు. దీన్ని సాధారణంగా కారు సర్వీసింగ్ చేయించుకునే చోట లేదా పెట్రోల్ బంకుల్లో నింపించుకోవచ్చు. ఇది ఎంత ఖర్చవుతుందనేది కారు ఇంజిన్‌ను బట్టి మారుతుంది.. కానీ సగటున 1,000 కిలోమీటర్లకు చాలా తక్కువ మొత్తంలోనే ఇది అవసరం అవుతుంది. డీజిల్ కారులో యూరియాను వేయడం అనేది పెద్ద కష్టమైన పని కాదు.