Operation Kagar : నమ్మిన సిద్ధాంతం కోసం.. దోపిడీ లేని సమాజం కోసం.. నక్సల్స్ సంవత్సరాలుగా అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నారు. అడవుల్లో బతుకుతూ.. సభ్య సమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు. దీనికోసం ఎంచుకున్న వారి పోరాటం కొన్ని సందర్భాల్లో సత్ఫలితాలను.. మరి కొన్ని సందర్భాలలో దుష్ఫలితాలను ఇస్తోంది. వీటి గురించి చర్చ పక్కన పెడితే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏరిపారేస్తోంది. ఇటీవలి కాలంలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకులను కేంద్ర బలగాలు మట్టు పెడుతున్నాయి. వరుస ఆపరేషన్లతో ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు నక్సల్స్ లేని దేశంగా భారత్ ను మార్చుతామని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగానే చత్తీస్ గడ్ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది..
చత్తీస్ గడ్ ప్రభుత్వం నక్సలైట్లకు సంసార జీవిత యోగాన్ని కల్పించేందుకు ఒక కొత్త పథకానికి రంగం సిద్ధం చేసింది. అయితే సంసారపు జీవితానికి మావోయిస్టులు ఆకర్షితులవుతారా? తిరిగి జనజీవన స్రవంతిలోకి వస్తారా? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. సంసార జీవితానికి ఆకర్షితులు కాని వారంటూ ఉండరు.. ఎందుకంటే 1990లో తిప్పారపు రాములు అనే నక్సలైట్ వరంగల్ నగరాన్ని తన కంటిచూపుతో శాసించేవాడు. ఎంతోమందిని మట్టుపెట్టాడు. వరంగల్ జాయింట్ కలెక్టర్ ను చూస్తుండగానే కిడ్నాప్ చేశాడు. అయితే ఇతడిని హన్మకొండలోని గుడిమండల్ అనే ప్రాంతంలోని సుధా నగర్ ఏరియాలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సుధా నగర్ ఏరియాలో రాములు ఉన్న ఇల్లు ఓ మహిళకు చెందింది. ఆ మహిళతో అతడికి సన్నిహిత సంబంధం ఉంది. అతడికి ఉన్న ఈ వీక్నెస్ ను పోలీసులు గుర్తించి.. ఆమె ఇంటికి వచ్చేది కనిపెట్టి.. చివరికి లేపేశారు.
1996లో ఉమ్మడి ఆదిలాబాద్ లో నస్పూర్ ఏరియాలో ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. నాటి పీపుల్స్ వార్ గ్రూపుకు అనుబంధంగా ఉండే సింగరేణి కార్మిక సమాఖ్య అగ్ర నాయకుడు రమాకాంత్ అలియాస్ మాదిరెడ్డి సమ్మిరెడ్డి పోలీసులతో ఏకంగా 36 గంటల పాటు పోరాడాడు. నాడు అతడి చేతిలో సిఐ చక్రపాణి, ఇంకా చాలామంది కానిస్టేబుళ్లు చనిపోయారు.. రమాకాంత్ అత్యంత తెలివిగా తప్పించుకోవడంతో.. ఒకానొక దశలో పోలీసులు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. చివరికి రమాకాంత్ ఒక మహిళతో ఉన్నాడని తెలుసుకున్నారు. అతడు ఆమెతో ఉన్న ఇంటి పై కప్పుకు రంద్రం చేసి.. అందులో నుంచి పెట్రోల్ పోశారు. నిప్పు అంటించి అంతం చేశారు. ఈ ఉదాహరణలు సంసార జీవితానికి దూరంగా ఉన్న అగ్రనేతల వీక్నెస్ పాయింట్లను బయటి ప్రపంచానికి తెలిసేలా చేశాయి.
ఇప్పుడు మావోయిస్టులకు చత్తీస్ గడ్ ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది. మరోవైపు ఇటీవల కాలంలో ఆ రాష్ట్రంలో దొరికిపోతున్న మావోయిస్టులు పోలీసులు నిర్వహించిన ప్రెస్ మీట్ లలో సంచలన విషయాలు చెబుతున్నారు.. దళంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతుందని.. అత్యాచారాలు నిరాటంకంగా జరుగుతున్నాయని మహిళా నేతలు చెబుతున్నారు. ఈ ప్రచారాన్ని మావోయిస్టు నేతలు ఖండిస్తున్నారు.. ఈ ప్రచారం ఎలా ఉన్నప్పటికీ.. సంసార జీవితాన్ని కోరుకొని మనిషి ఉండడు. సంసార జీవితానికి ఆకర్షితుడు కాని వ్యక్తి ఉండడు.. అలాంటప్పుడు చత్తీస్ గడ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.
ఇక ప్రస్తుతం చత్తీస్ గడ్ రాష్ట్ర విషయానికి వస్తే బస్తర్ జిల్లాలోని కాంకేర్ ప్రాంతంలో 2010లో దాదాపు ఆరడజను మంది నక్సలైట్లు వివాహానికంటే ముందు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు. ఈ విషయాన్ని అక్కడ పోలీసులు గుర్తించారు. బస్తర్ పోలీసుల పరిశీలనలో 26 కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇందులో 12 మందికి వైద్యుల పర్యవేక్షణలో తిరిగి సంసార జీవితాన్ని ప్రసాదించారు. మిగతా వారికి కూడా ఆ యోగాన్ని కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా లొంగిపోయే మావోయిస్టులకు గృహాలు.. వివాహాలు.. ఐవీఎఫ్ విధానంలో తల్లిదండ్రులయ్యే అవకాశాన్ని కల్పిస్తామని చత్తీస్ గడ్ హోం శాఖ మంత్రి విజయవర్మ ఇప్పటికే చెప్పడం గమనార్హం.