iQOO 16R Launch స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు ఐక్యూ (iQOO) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వివో సబ్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఈ సంస్థ.. ఐక్యూ 16 సిరీస్‌లో భాగంగా iQOO 16R స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఇండోనేషియాకు చెందిన TKDN సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో ఈ మోడల్‌కు సంబంధించిన వివరాలు కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు రంగం సిద్ధమవుతోందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
TKDN సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో iQOO 16R
ఇండోనేషియాలోని Tingkat Komponen Dalam Negeri (TKDN) సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లో I2606 మోడల్ నంబర్‌తో ఓ కొత్త ఐక్యూ స్మార్ట్‌ఫోన్ నమోదైంది. AndroidTreasure నివేదిక ప్రకారం.. ఈ పరికరం PT Vivo Mobile Indonesia సంస్థ పేరుతో, ఐక్యూ బ్రాండ్ కింద కనిపించింది. ఈ మోడల్ నంబర్ ఐక్యూ 16R స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించినదని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే, TKDN సర్టిఫికేషన్‌లో ఫోన్‌కు సంబంధించిన పూర్తి హార్డ్‌వేర్ వివరాలు వెల్లడికాలేదు. కేవలం కనెక్టివిటీకి సంబంధించిన కొన్ని వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ GSM, WCDMA, FDD-LTE, TDD-LTE నెట్‌వర్క్ బ్యాండ్లతో పాటు 5G NR కనెక్టివిటీకి మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. పలు సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ మోడల్ కనిపిస్తుండటంతో.. ఐక్యూ 16Rను అంతర్జాతీయ మార్కెట్లలోనూ విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గతంలోనూ కనిపించిన మోడల్ నంబర్
I2606 మోడల్ నంబర్ గతంలో GSMA IMEI డేటాబేస్‌లోనూ కనిపించినట్లు నివేదికలు వెల్లడించాయి. అక్కడ ఈ పరికరాన్ని iQOO 16R పేరుతో పేర్కొన్నట్లు సమాచారం. ఇదే మోడల్ నంబర్ యూరేషియన్ ఎకనామిక్ కమిషన్ (EEC) సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లోనూ కనిపించినట్లు ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రావడానికి ముందు వివిధ దేశాల్లోని సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లలో కనిపిస్తుంటాయి. అయితే, సర్టిఫికేషన్ పూర్తయిందంటే వెంటనే లాంచ్ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఐక్యూ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు విడుదల తేదీ, ధర వంటి వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం
లీకుల ప్రకారం.. iQOO 16R స్మార్ట్‌ఫోన్ చైనాలో విడుదలయ్యే అవకాశం ఉన్న iQOO Z12 Turboకు రీబ్రాండెడ్ వెర్షన్‌గా మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను అందించే అవకాశముంది. అలాగే 6.59 అంగుళాల డిస్‌ప్లే, హై రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే. ఫోన్‌లో ఉపయోగించే ప్రాసెసర్ ఏది? డిస్‌ప్లే రిజల్యూషన్ ఎంత? కెమెరా సామర్థ్యం, బ్యాటరీ, ఛార్జింగ్ వేగం ఎలా ఉంటాయి? అనే అంశాలపై కంపెనీ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
iQOO 15Rతో పోలిస్తే ఎలాంటి అప్‌గ్రేడ్లు?
ఐక్యూ 16Rకు ముందున్న మోడల్‌గా భావిస్తున్న iQOO 15R ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. ఈ ఫోన్‌లో 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ Sony LYT-700V ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
బ్యాటరీ విషయానికి వస్తే.. iQOO 15Rలో 7,600mAh బ్యాటరీ, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
ఈ నేపథ్యంలో కొత్త iQOO 16Rలో పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, కెమెరా విభాగాల్లో ఎలాంటి మార్పులు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు ప్రాధాన్యమిచ్చే వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి.. TKDN సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో iQOO 16R కనిపించడం ఈ ఫోన్‌పై అంచనాలను పెంచుతోంది. అయితే, భారత మార్కెట్లో విడుదల తేదీ, ధర, పూర్తి స్పెసిఫికేషన్లపై ఇప్పటికీ అధికారిక సమాచారం లేదు. కంపెనీ ప్రకటన వచ్చే వరకు మరిన్ని వివరాల కోసం వేచి చూడాల్సిందే.