CM Revanth Reddy Vs KCR: తెలంగాణలో 12 ఏళ్లుగా డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్.. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొదటి నాలుగున్నరేళ్లు టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేయాలనుకున్నారు. ఇక 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి డైవర్షన్ పాలిటిక్స్‌కు కొత్త అర్థం చెప్పారు. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న సమయంలోనే ఎన్నికలకు వెళ్లి.. మరోమారు అధికారంలోకి వచ్చారు. తమ ప్రభుత్వం విమర్శలు లేదా ఆరోపణలు పెరిగినప్పుడు కేంద్ర బీజేపీపై దాడి చేయడం, బండి సంజయ్ వంటి నాయకులపై ప్రెస్‌మీట్లు నిర్వహించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయాలు చేసేవారు. ఇది క్లాసిక్ డైవర్షన్ టాక్టిక్‌గా మారింది. సొంత సమస్యల నుంచి దూరం చేయడానికి విమర్శకులపై ప్రతిదాడి చేసేవారు.
రేవంత్ రాజ్‌లో మరింత ఎక్కువగా..
ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రాజ్ నడుస్తోంది. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు రేవంత్ కూడా కేసీఆర్‌ను మించిన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదనిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తన వ్యూహాన్ని మరింత షార్ప్‌గా అమలు చేస్తున్నారు.
మూసీ ఆక్రమణల కూల్చివేత వేళ..
మూసీ శుద్ధీకర ప్రాజెక్ట్‌పై హైదరాబాద్ ప్రజల్లో రేవంత్ సర్కార్‌పై వ్యతిరేకత వచ్చింది. మూసీ ఆక్రమణల కూల్చివేతతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తమకు అనుకూలంగా మలచుకోవాలని భావించింది. దీంతో రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫార్ములా ఈ రేసు కేసులో నోటీసులు జారీ చేశారు. హైడ్రా కూల్చివేతలపై మొదట్లో హైదరాబాద్ వాసుల్లో హర్షం వ్యక్తమైంది. కానీ తర్వాత పెద్దల ఇళ్లు కూల్చకుండా పేదలవి కూల్చడంపై వ్యతిరేకత వచ్చింది. దీని నుంచి దృష్టి మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి ఫీచర్ సిటీని తెరపైకి తెచ్చారు.
హెచ్‌సీయూ భూముల విషయంలో..
హెచ్‌సీయూ భూములను అమ్మేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఈమేరకు భూమల్లోని చెట్లను బుల్డోజర్లతో తొలగించడం రాష్ట్రవ్యాపంగా రచ్చకు తెరలేపింది. అడవిని తొలగిస్తున్నారని, వన్యప్రాణులను చంపేస్తున్నారని మీడియాలో పెద్ద ఎత్తుక కథనాలు వచ్చాయి. పర్యావరణ ప్రేమికులు కోర్టును ఆశ్రయించారు. దీంతో యథాతధ స్థితి కొనసాగించాలని న్యాయస్థానాలు స్టే విధించాయి. దీనిని తమకు అనుకూలంగా మార్చకునేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నించింది. ఈ సమయంలోనూ రేవంత్‌రెడ్డి ప్రజల దృష్టి మళ్లించేందుకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ అంశాన్ని తెరపైకి తెచ్చారు.
తాజాగా బొగ్గు గనుల వ్యవహాం..
తాజాగా, నైనా బొగ్గు టెండర్‌లో భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. టెండర్ కోసం ఇద్దరు మంత్రులు పోటీ పడడం, భట్టికి చెందిన సంస్థకు అప్పగించే ప్రయత్నాలు జరగడం సంచలనమైంది. ఇదే సమయంలో కోమటిరెడ్డికి, ఓ ఐఏఎస్‌కు లింకు అంటగట్టడం, ఐఏఎస్‌లు అంతా ఒక్కటై కేసు పెట్టడం రేవంత్ సర్కార్‌కు మచ్చగా మారింది. దీంతో రేవంత్‌రెడ్డి మరోమారు డైవర్షన్ పాలిటిక్క్‌కు తెరతీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును తెరపైకి తెచ్చి మాజీ మంత్రి హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులకు నోటీసులు ఇచ్చారు. విచారణ చేయించారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొత్త ట్విస్ట్..
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఈ సమయంలో, కాంగ్రెస్ మెజారిటీ మున్సిపాలిటీలను కౌవసం చేసుకుని బలంగా కనిపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి భాగంగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ డ్రామాను సస్పెండ్ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేయాలని భావిస్తున్నారు.
వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేలా..
ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. లోపాలు బయట పడిన సమయంలో విపక్ష నాయకులపై కేసులు పెట్టడం వల్ల ప్రజలు ప్రభుత్వ విఫలాలను మరచిపోతారు. ఇది కేవలం రాజకీయ డైవర్షన్ కాదు, విచారణల ద్వారా ఎదుగుదలను కూడా సృష్టిస్తుంది.
ఈ వ్యూహం కొంతమేర పని చేసినా, ప్రజలు దీర్ఘకాలిక సమస్యలు (మూసీ, టెండర్లు) మరచిపోరేలా లేదు. కేసీఆర్ తన హయాంలో చేసినట్లే రేవంత్ కూడా ఇదే మార్గం తీసుకుంటుంటే, ఎన్నికల్లో కాంగ్రెస్ బలం నిజమేనా అనేది పరీక్షించాలి. డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయాల్లో సాధారణం కాబట్టి, దీర్ఘకాలంలో పాలసీలు, అభివృద్ధి చూపితేనే నిజమైన విజయం వస్తుంది.