AP Debts: ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందా? అఖిలభారత సర్వీసు అధికారులు సైతం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకే పరిమితమయ్యారా? రాష్ట్రం ఆర్థిక దివాళా వైపు పరుగులు తీస్తున్నా పట్టించుకోవడం లేదా? అప్పుల కోసం అడ్డదారులు తొక్కుతున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కట్టడి చేయలేకపోయారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల తప్పుడు లెక్కలపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర జేసినట్టు తెలుస్తోంది. ‘పొలిటికల్ బాస్’లను ప్రసన్నం చేసుకోవడానికి ‘తప్పులు చేస్తున్న’ అఖిల భారత సర్వీసు అధికారులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అప్పుల కోసం తప్పుడు లెక్కలు సమర్పించి, కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఇష్టానుసారంగా అప్పులు చేయకూడదని చెప్పాల్సిన అధికారులే… కొత్త అప్పుల కోసం అడ్డదారులు తొక్కుతూ, తప్పుడు నివేదికలు ఇస్తూ, అబద్ధాలు చెబుతున్న వైనంపై కేంద్ర ఆర్థిక శాఖ కన్నెర్ర చేసింది. ఈ విషయంలో నేరుగా డీవోపీటీ (డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్)ని రంగంలోకి దించింది. తప్పు చేసిన అధికారులను సర్వీసు నిబంధనల మేరకు ‘ఫ్రేమ్’ చేసేలా రంగం సిద్ధం చేసింది. అంటే… ఇలాంటి అధికారుల పదోన్నతులు, డిప్యుటేషన్లు, జాతీయ, అంతర్జాతీయ శిక్షణ, పోస్టింగ్‌లు, సెంట్రల్ సర్వీసుల్లోకి తీసుకోవడం వంటి అంశాలపై ప్రభావం పడుతుందన్న మాట! దీనిపై కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ ఇటీవల సీఎ్‌సకు ఘాటు లేఖ రాసినట్లు తెలిసింది. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ఈ లేఖ వెళ్లింది. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు 90శాతం ఏపీకి వర్తించేవే కావడం విశేషం. నేరుగా ‘ఏపీ అధికారులు’ అనేపదం వాడకుండా… రాష్ట్రంలో ఇప్పటిదాకా చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. ఈ లేఖ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. మరీ ముఖ్యంగా ఆర్థిక శాఖలోని ముఖ్య అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.
ప్రారంభం నుంచి అంతే..
ఆది నుంచి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. కానీ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఏమీ అనలేదని తెలుస్తోంది. అయితే ఇటీవల వైసీపీ ప్రజాప్రతినిధులు శ్రుతిమించి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు. ధిక్కార ధోరణితో మాట్లాడుతున్నారు. దాని పర్యవసానమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పొత్తులపై నిఘా పెట్టడం ప్రారంభించింది. ఒక రాష్ట్రమంటూనే అంటూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రస్తావించింది ఏపీ గురించేనని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే… అప్పుల కోసం ఏపీ ఆర్థిక శాఖ అధికారులు చేసిన నిర్వాకాలన్నీ ఎప్పుడో కేంద్రం దృష్టికి వచ్చాయి. రకరకాల గిమ్మిక్కులు, మాయలు చేయడం… కార్పొరేషన్ల మాటున అప్పులు తీసుకొచ్చి కేంద్రం కళ్లకు గంతలు కట్టడం అధికారులకు అలవాటైపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం అధికారులు రాష్ట్రాలు చేస్తున్న అడ్డగోలు అప్పులపై గత నెలలో ప్రధాని మోదీని అప్రమత్తం చేశారు.
ఆ తర్వాత రాష్ట్రాల అప్పులపై కేంద్రం పట్టు బిగించింది. అప్పులు, ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ 26పేజీల లేఖ రాసింది. రాష్ట్రం నివేదిక పంపినప్పటికీ కేంద్ర ఆర్థికశాఖ సంతృప్తి చెందలేదు. కొత్త అప్పులకోసం గతనెల చివర్లో ఢిల్లీ వెళ్లిన ఆర్థికశాఖ అధికారికి కేంద్ర అధికారులు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. ‘‘అప్పులకోసం రాజకీయ నాయకులు ఏదైనా చెబుతారు. వాస్తవ పరిస్థితిని మీరు వివరించాలి కదా! ఉల్లంఘనలు జరగకుండా ప్రొసీజర్స్ చెప్పాలి కదా! అప్పులపై మీరు చెబుతున్న లెక్కలు తప్పు. మొత్తం ఎన్ని రూపాల్లో, ఏయే పేర్లతో ఎంత అప్పు చేశారో పూర్తి వివరాలతో రండి’’ అని ఆ అధికారిని వెనక్కి పంపించారు. ఇదే నేపథ్యంలో ‘ఒక రాష్ట్ర అధికారులు తప్పుడు నివేదికలు పంపారు’ అంటూ అన్ని రాష్ట్రాలకు లేఖలు వెళ్లడం, తప్పు చేసే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించడం గమనార్హం.
హస్తినాలో చుక్కెదురు
నెలలో రెండు మూడు సార్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్ హస్తినాకు చక్కర్లు కొట్టడం పరిపాటిగా మారింది. అప్పులకు తప్పుడు లెక్కలు చూపడానికి నానా తిప్పలు పడుతున్నారు. రావత్ తో పాటు ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీసుకు చెందిన కేబీవీ సత్యనారాయణ స్పెషల్ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలన్నీ వీరిద్దరి చేతుల మీదే నడుస్తున్నాయి. లేఖలో పేర్కొన్నట్లుగా కేంద్రం చర్యలు తీసుకుంటే… వీరిద్దరికీ తిప్పలు తప్పవని అధికారవర్గాలు చెబుతున్నాయి. సత్యనారాయణ 2017 జూన్ నుంచి డిప్యుటేషన్‌పై ఏపీలో పనిచేస్తున్నారు. సీఎ్‌ఫఎమ్‌ఎ్‌సకు ఆయనే అధిపతి. డిప్యుటేషన్ ఒకసారి ముగిసినా పొడిగించారు.
జూన్ 18తో ఆ గడువూ ముగుస్తుంది. ఆర్థికానికి సంబంధించి సర్కారు పెద్దలు ‘కోరుకున్న’ పనులన్నీ ఆయన చేసి పెడుతున్నారు. అప్పులకోసం మార్గాలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన డిప్యుటేషన్ మరోసారి పొడిగించాలని కోరే అవకాశముంది. ఈసారి డీవోపీటీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక… రావత్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఇటు సర్కారు పెద్దల మాట కాదనలేక, అటు కేంద్రంతో వేగలేక సతమతమవుతున్నారు.అందుకే ఇటీవల సెలవుపై వెళ్లిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Ganta Srinivasa Rao: గంటా మళ్లీ యాక్టివ్.. మాజీ మంత్రి తీరుపై తెలుగు తమ్ముళ్ల గుస్సా
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: The center is serious about miscalculating ap debts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com