Politics Lookback 2024: రాజకీయాలు అన్నాక చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. అందులోనూ ఒక రాజకీయ పార్టీని నడపాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి.ఇది సహజంగా అందరికీ తెలిసిన విషయమే. పార్టీలు ఏర్పాటు చేసిన చాలామంది నేతలు కొద్ది రోజులకే.. వేరే పార్టీలో విలీనం చేసిన సందర్భాలే అధికం. సంస్థాగతంగా దశాబ్దాల పాటు కొనసాగిన పార్టీలు కేవలం కొన్నే. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడే నేతలు కొందరే. అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మొన్నటి వరకు ఆయన ఒక ఫెయిల్యూర్ నాయకుడు. ప్రత్యర్థులు సైతం చులకనగా చూసేవారు. నీది ఒక పార్టీయేనా అని ఎద్దేవా చేసేవారు. ఎందరో అదే పనిగా విమర్శలు చేసేవారు. కానీ అందరి నోళ్లు ముయిస్తూ.. సూపర్ విక్టరీతో ఏపీ రాజకీయాలనే షేక్ చేశారు పవన్ కళ్యాణ్. శత శాతం విజయంతో దేశం మొత్తం తన వైపు చూసుకునేలా చేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 2024లో ఏపీ రాజకీయాల్లో అత్యంత ఎక్కువగా లబ్ధి పొందిన నేత పవన్ కళ్యాణ్. ఈ ఏడాది చిరకాల విజయాన్ని అందించి.. పవన్ మనసులో చిరస్థాయిగా ఉండిపోతుంది.
* దారుణ పరాజయం
2019 ఎన్నికల్లో డిజాస్టర్ ఫలితాలను చవిచూశారు పవన్ కళ్యాణ్. పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిపోయారు. తన పార్టీని సైతం కేవలం ఒక్క సీటుకే పరిమితం చేశారు. ఏ స్థాయిలో ఓటమి చెందారో.. అదే స్థాయిలో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో గేమ్ చేంజర్ గా మారిపోయారు. అప్పట్లో పవన్ చంద్రబాబుకు కొండంత అండగా నిలిచారు. కానీ అదే స్థాయిలో పవన్ కూడా లబ్ధి పొందారు. టిడిపి మనసును గెలుచుకున్నారు. అదే కూటమికి టర్నింగ్ పాయింట్ అయింది. వైసీపీకి గ్రహ పాటుగా మారింది. చంద్రబాబు అరెస్ట్ ముందు వరకు ఒక లెక్క.. తరువాత మరో లెక్క అన్నట్టు జనసేన పరిస్థితి మారిపోయింది.
* పిఆర్పి అనుభవాలతో
ప్రజారాజ్యం పార్టీ అనుభవాలతో రంగంలోకి దిగారు పవన్ కళ్యాణ్. తొలుత జనసేన ఉద్యమ సంస్థను ఏర్పాటు చేసి.. దానిని రాజకీయ పార్టీగా మార్చారు. అయితే చిరంజీవి ఏం చేయలేకపోయాడు.. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడులే అంటూ తేలిగ్గా తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పవన్ వ్యూహాలు ఫెయిల్ అయినట్లు కనిపించాయి. కానీ ఏపీ ప్రజల్లో బలమైన ముద్ర చాటుకునే ప్రయత్నంలో పవన్ ఉన్నారని విశ్లేషకులు కూడా గుర్తించలేకపోయారు. పవన్ కళ్యాణ్ వ్యూహాలను నిత్యం ఎద్దేవా చేసే కుహనా విశ్లేషకులు కూడా ఉన్నారు. అయితే ఇంతింతై వటుడింతై అన్న మాదిరిగా ఏపీ రాజకీయాలను అవపోషణ పట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లారు. తన ఒక్కడి బలం చాలదని భావించారు. టిడిపి, బిజెపిని కలుపుకెళ్లారు. ఈ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి శత శాతం విజయం సాధించారు. దీంతో పవన్ పేరు జాతీయస్థాయిలో మార్మోగిపోయింది. ఎన్డీఏ లోను పవన్ పలుకుబడి బాగా పెరిగింది. ఒక జాతీయస్థాయిలో ప్రభావం చూపగలిగే నేతగా పవన్ ఎదిగారు. పవన్ అంటే తుఫాన్ అని సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోదీ కీర్తించే స్థాయికి చేరుకున్నారు. నిజంగా ఇది పవన్ కళ్యాణ్ కు కలిసి వచ్చే కాలం. ముఖ్యంగా 2024 తన మదిలో నిండుగా ఉండిపోతుంది అనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.