
Y. S. Vijayamma: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి సతీమణి వైఎస్.విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పోలీసుపై చేయి చేసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, చేయి చేసుకున్నరని జూబ్లీహిల్స్ పోలీసులు షర్మిలను అదుపులోకి తసీఉకున్నారు. కూతురును కలిసేందుకు వచ్చిన విజయమ్మను లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఓ పోలీస్‌పై ఆమె చేయి చేసుకున్నారు. ఒక పోలీస్ అధికారిని కొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
కూతురును కలిసేందుకు వచ్చి…
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పీఎస్‌కు వైఎస్ విజయమ్మ వెళ్లారు. షర్మిలను కలిసేందుకు విజయమ్మ పీఎస్ లోపలికి వెళుతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. షర్మిలను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు.
మరోవైపు పోలీసులు విజయమ్మను కారులో నుంచి బయటకు రానివ్వలేదు. ఈ సందర్భంగా పోలీసులపై ఆమె చేయి చేసుకున్నారు. తన కూతురిని చూసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు.
కోర్టును ఆశ్రయిస్తాం..
ఇదిలా ఉండగా తెలంగాణ పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని విజయమ్మ తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై ప్రశ్నించడానికి షర్మిల బయటకు వచ్చిందని తెలిపారు. షర్మిల ఏమీ ఉగ్రవాధి కాదని, హత్యలు చేయలేదని, తెలంగాణ నిరుద్యోగుల తరఫున సిట్ అధికారులను కలిసేందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. అందుకు అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ పీఎస్ ముందు విజయమ్మ కారులోనే కాసేపు ఉండటంతో అక్కడ టెన్షన్∙వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు విజయమ్మను బలవంతంగా లోటస్‌పాండ్‌కు తరలించారు.

అరెస్ట్‌పై స్పందించిన షర్మిలా..
ఇదిలా ఉండగా తనను అరెస్ట్ చేయడంపై షర్మిల స్పందించారు. ఈమేరకు ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. సిట్ కార్యాలయానికి తాను ఒంటరిగా వెళ్లాలని అనుకున్నానని, సిట్ అధికారిని కలిసి టీఎస్‌పీఎస్సీ దర్యాప్తు మీద వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నానని షర్మిల చెప్పారు. కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు తమ అనుమానాలను అధికారికి చెప్పడం తమ బాధ్యత అని తెలిపారు. సిట్ ఆఫీస్‌కి వెళ్లడానికి తాను ఎవరికీ చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని, తాను ధర్నాకు పోలేదన్నారు. ముట్టడికి పిలుపునివ్వలేదని, తనను బయటకు పోనివ్వకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు..? అని షర్మిల ప్రశ్నించారు. ‘నేను ఏమైనా క్రిమినల్ నా..? హంతకురాలినా? నాకు వ్యక్తిగత స్వేచ్చ లేదా..? నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసుల పహారా ఎందుకు..? పోలీసులు నాపై దురుసు ప్రవర్తనకి దిగారు. నా దారిన నేను వెళ్తుంటే అడ్డుపడ్డారు. నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. నా మీద పడితే నేను భరించాలా..? నా రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం నా భాధ్యత. ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారు..?’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.