YS Sharmila: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె పూర్తిగా ఇక్కడ రాజకీయాలకు దూరమయ్యారు. అనివార్య కారణాల వల్ల తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమెకు ఆశించిన స్థాయిలో తెలంగాణ ప్రజల నుంచి మద్దతు లభించడం లేదు. అయినప్పటికీ ఆమె తనదైన శైలిలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజుల్లో అయినా ఇక్కడి ప్రజలు పట్టించుకుంటారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలతో వైఎస్ కుటుంబం ఒక్కసారిగా రాజకీయాల్లో యాక్టివ్ అయింది. రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నంత కాలం తండ్రి చాటు బిడ్డలుగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డి, షర్మిల.. ఆ తరువాత ఏర్పడిన రాజకీయ పరిణామాలతో రాజకీయంగా నిలదొక్కుకునేందుకు తీవ్రమైన ప్రయత్నాలు సాగించారు. జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. ఆమె పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. దురదృష్టవశాత్తు 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. అన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే తనకు కీలకమైన బాధ్యతలను అప్పగిస్తాడని షర్మిల భావించింది. అయితే అందుకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు.
కుటుంబ సభ్యులను దూరంగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి..
2014 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడంతో అనేక విమర్శలు వచ్చాయి. ఇటువంటి విమర్శలకు తావివ్వకూడదు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో కుటుంబ సభ్యులను ఎన్నికలకు దూరంగా ఉంచారు. అంతకు ముందు ఒంగోలు ఎంపీగా పని చేసిన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని, అంతకు ముందు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయించిన తల్లి విజయలక్ష్మి, పార్టీ కోసం ఎంతగానో కృషి చేసిన చెల్లి షర్మిలకు జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వలేదు. తమ్ముడు అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్, మావయ్య రవీంద్రనాథ్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన వారిని మాత్రం పార్టీకి దూరంగా ఉంచారు. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఏదైనా పదవి కట్టబెడతారని భావించిన షర్మిలకు నిరాశే ఎదురయింది.
ఏపీలో చక్రం తిప్పాలని భావించిన షర్మిల..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన భూమిక ఉండాలని, అవసరమైతే చక్రం తిప్పే స్థాయిలో తన పాత్ర ఉండాలని షర్మిల బలంగా భావించారు. అయితే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆమెను పూర్తిగా పక్కన పెట్టడంతో కొంత ఇబ్బందులకు గురయ్యారు. కుటుంబ పరమైన పాలన అన్న పేరు వస్తుందన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కుటుంబాన్ని దూరం పెట్టారు. అయితే ఇది ఏమాత్రం రుచించిన షర్మిల కొన్నాళ్లపాటు ఇబ్బంది పడింది. ఏపీలో సైలెంట్ గా ఉండడం కంటే తెలంగాణలో రాజకీయంగా యాక్టివ్ కావాలన్న ఉద్దేశంతో అక్కడికి రాజకీయంగా షిఫ్ట్ అయ్యారు.
రాజకీయంగా యాక్టివ్ కావాలని.. పవర్ కావాలన్న కసితో..
రాజకీయంగా యాక్టివ్ గా ఉండడంతో పాటు అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న కసితో ఉన్న షర్మిల తెలంగాణపై దృష్టి సారించారు. అందులో భాగంగానే వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆమె ఏర్పాటు చేశారు. షర్మిలకు మద్దతుగా వైఎస్ విజయమ్మ తెలంగాణకు వెళ్లారు. ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా వ్యవహరించిన ఆమె.. ఇక్కడ బాధ్యతల నుంచి తప్పుకొని పూర్తిస్థాయిలో తెలంగాణలో కుమార్తె పార్టీ కోసం పని చేసేందుకు వెళ్లిపోయారు. తెలంగాణలోని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో పాదయాత్రను చేపట్టారు షర్మిల. సుమారు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. రెండుసార్లు మూడు వేలకు పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మహిళగా రికార్డు సృష్టించారు షర్మిల.
బలమైన బేస్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న షర్మిల పార్టీ..
తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీకి బలమైన బేస్ లేకపోవడంతో షర్మిల పార్టీ కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. రాజశేఖర్ రెడ్డి సంక్షేమమే అజెండాగా షర్మిల పార్టీని పెట్టింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీ నాటి రాజశేఖర్ రెడ్డి పాలనకు మించి అన్నట్టుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. దీంతో రాజశేఖర్ రెడ్డి నాడు చేసిన గొప్ప కార్యక్రమాల గురించి చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి ప్రస్తుతం కొంత ఇబ్బందికరంగా షర్మిలకు మారింది. నాడు రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. నాటి కంటే ఎక్కువ లబ్ది ప్రస్తుతం ప్రజలకు చేరుతోంది. సంక్షేమ పరంగా చూస్తే రాజశేఖర్ రెడ్డి పాలనకంటే ఎక్కువగానే ప్రస్తుత సర్కారు చేస్తోంది. ఇక కొన్ని వర్గాల్లో ఉండే అసంతృప్తి, అసహనాన్ని అక్కడ బలంగా ఉన్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో షర్మిల పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతోంది. షర్మిల చేసిన పాదయాత్రకు కూడా ప్రజలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా జరిగిన అరెస్టులు, బెయిల్ రావడం వంటి పరిస్థితులతో అయినా సింపతి వస్తుందా, ప్రజలు ఈ పార్టీని గుర్తించే పరిస్థితి ఉంటుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.