HomeతెలంగాణWine Shops in Telangana : తాగినోడికి తాగినంత.. తెలంగాణలో బార్లాన్నీ ఇక బార్లా..

Wine Shops in Telangana : తాగినోడికి తాగినంత.. తెలంగాణలో బార్లాన్నీ ఇక బార్లా..

Wine Shops in Telangana : ఇప్పటికే లెక్కకు మిక్కిలిగా వైన్ షాపులు ఉన్నాయి. వీటికి తోడు బెల్ట్ షాపులు. ఫలితంగా నగరాల నుంచి మారుమూల పల్లెలదాకా “మద్య”ధర సముద్రం పారుతోంది. ఉదయం కోడి కూయక ముందు నుంచే ప్రారంభమవుతున్న మద్యం వ్యాపారం.. అర్ధరాత్రి దాకా కొనసాగుతోంది. ఇంతే కాదు మద్యంపై ప్రభుత్వం భారీగా ధరలు కూడా పెంచింది. మరి ఈ ఆమ్దానీ కూడా సరిపోవడం లేదనుకుంటా? అందుకే ప్రభుత్వం ఏకంగా బార్ షాపులపై దృష్టి సారించింది. గతంలో ఉన్న నిబంధనలు మొత్తం ఒక్కసారిగా తొలగించింది. ఫలితంగా బార్లన్నీ బార్లా అయిపోయాయి. తాగినోడికి మరింత మద్యం దొరికే పరిస్థితులు ఏర్పడ్డాయి.

పెగ్గుల విధానానికి స్వస్తి
బార్లలో పెగ్గుల విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇకపై.. క్వార్టర్‌ నుంచి ఫుల్‌ వరకు అన్ని సైజుల బాటిళ్లను బార్లలోనూ అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు మద్యం డిపోల మేనేజర్లకు తెలంగాణ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. బార్లలో ఇప్పటివరకు పెగ్గుల సిస్టమ్‌ అమల్లో ఉంది. వైన్‌ షాపుల్లో మాత్రమే అన్ని సైజుల మద్యం సీసాలను విక్రయిస్తున్నారు. మద్యం డిపోలు కూడా బార్లకు ఫుల్‌ బాటిళ్లను మాత్రమే సరఫరా చేసేవి. అయితే, ఈ విధానాన్ని మార్చాలని  కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఈ నెల 10వ తేదీనే జారీ చేసింది. కానీ, అమల్లోకి రాలేదు. తాజాగా తెలంగాణ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ ఉత్తర్వులు జారీ చేస్తూ బార్లకు కూడా అన్ని సైజుల బాటిళ్లను సరఫరా చేయాలంటూ మద్యం డిపోల మేనేజర్లను ఆదేశించారు. ఈ మేరకు 90 ఎంఎల్‌ బాటిల్‌ మొదలు.. ఫుల్‌ బాటిల్‌ వరకు డిపోల నుంచి లిఫ్ట్‌ చేయనున్నాయి. తద్వారా బార్లలో మద్యం ప్రియులు ఏ సైజు బాటిల్‌ను అడిగితే… అదే సైజు బాటిల్‌ను విక్రయించడానికి బార్లకు అవకాశం ఏర్పడనుంది. దీంతో బార్లలోనూ గిరాకీ పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలు ఉన్నాయి.
వైన్ షాపుల యజమానులు వ్యతిరేకిస్తున్నారు
అయితే, ఈ విధానాన్ని వైన్‌ షాపుల యజమానులు వ్యతిరేకిస్తున్నారు. బార్లలో బాటిళ్ల వారీగా విక్రయిస్తే… వైన్‌ షాపుల్లో విక్రయాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మద్యం విక్రయాలను పెంచడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు… బార్లకు మరిన్ని వెసులుబాట్లు సైతం కల్పించింది. బార్ల యజమానులు ఏటా రెన్యువల్‌ చేసుకునే విధానాన్ని ఎత్తివేసిన ప్రభుత్వం.. కేవలం రెన్యువల్‌ ఫీజును చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంది. అలాగే, బార్ల టర్నోవర్‌ పరిమితిని కూడా పెంచింది. ఇప్పటిదాకా లైసెన్సు ఫీజు మొత్తం విలువకు ఐదింతల విలువ చేసే మద్యాన్ని మాత్రమే లిఫ్ట్‌ చేసే అవకాశం ఉంది. దీనిని తాజాగా ఏడింతలకు పెంచింది. ఉదాహరణకు ఒక బార్‌ లైసెన్సు ఫీజు రూ.50 లక్షలు ఉంటే… దానికి రూ.3.50కోట్ల విలువైన మద్యాన్ని బార్లు లిఫ్ట్‌ చేయవచ్చు. పరిమితి దాటితే చెల్లించాల్సిన టర్నోవర్‌ ట్యాక్స్‌ను సైతం 15.30 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular