HomeతెలంగాణPanchayat Elections: పంచాయతీ ఎన్నికలకు పచ్చ జెండా ఊపేనా!?

Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు పచ్చ జెండా ఊపేనా!?

Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం 2024, ఫిబ్రవరి ఒకటితో ముగియనుంది. దీంతో పంచయతీరాజ్‌శాఖ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలు పెట్టింది. పంచాయతీ ఎన్నికలకు సమాయాత్తం కావాలని ఈనెల 6న అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్‌శాఖకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పాలకవర్గం పదవీ కాలం ముగియడానికి రెండు నెలల ముందే ఎన్నికలు నిర్వహించాలని పంచాయతీరాజ్‌ చట్టం చెబుతోంది. దీంతో ఈసీ ఈమేరకు కసర్తు ప్రారంభించింది.

అనుమతి ఇస్తేనే..
ఇదిలా ఉంటే.. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువుదీరి కేవలం రెండు రోజులే అయింది. మరోవైపు కాంగ్రెస్‌ సర్కారుకు ఇంకా గ్రామ స్థాయిలో బలమైన పట్టులేదు. పైగా రాష్ట్రంలో అధికార పార్టీ మారడం, ఆయా అసెంబ్లీ స్థానాల్లో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే గెలవడం, మరికొన్ని స్థానాల్లో కొత్తగా కాంగ్రెస్‌ శాసనసభ్యులు రావడం వంటి రాజకీయ పరిణామాల్లో పల్లెల్లోని ప్రస్తుత సర్పంచులు, ఆశావహులు అంతర్మథనంలో పడ్డారు. దీంతో గ్రామస్థాయిలో పరిస్థితులు చక్కదిద్దుకున్నాకే పంచాయతీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. పాలకవర్గాల పదవీకాలం ముగిసిన వెంటనే కొన్ని నెలలు స్పెషల్‌ ఆఫీసర్ల పాలన పెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

పాత రిజర్వేషన్లేనా..
గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ కోటా రిజర్వేషన్లు ఖారారు చేయాల్సి ఉంటుంది. అయితే 2019లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లపాటు రిజర్వేషన్లు అమలయ్యేలా చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే రిజర్వేషన్లు మార్చాల్సిన అవసరం ఉండదు. అలా కుదరని పక్షంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రిజర్వేషన్లు మారుస్తుంది. ఎన్నికల సమయానికి రిజర్వేషన్లు సహా ఎన్నికల తేదీలనూ ప్రకటించాల్సి ఉండగా అది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

ఓటర్లు పెరిగే చాన్స్‌..
ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల కోసం 2023 అక్టోబర్‌ 1 వరకు 18 ఏళ్లు పూర్తయిన వారికి ఓటుహక్కు కల్పించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2024, జనవరి 1వ తేదీ వరకు అవకాశం కల్పించే చాన్స్‌ ఉంది. దీంతో పంచాయతీల్లో ఓటర్ల సంఖ్య పెరుగుతుంది. రానున్న రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాలన చక్కదిద్దే పనిలో ఉన్న ప్రభుత్వం రిజర్వేషన్లు, ఓటర్ల నమోదుపై దృష్టి సారించకపోవచ్చని తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular