Jagan And KCR: ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొన్నవేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ రాబోతున్నారు.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును పరామర్శించబోతున్నారు.. జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర రావును పరామర్శించబోతున్నారు అనే వార్త నిన్నటి నుంచి తెలుగు మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో తన ఆస్తులకు సంబంధించిన కేసులో ప్రతి శుక్రవారం హైదరాబాదులోని కోర్టుకు హాజరయ్యే జగన్మోహన్ రెడ్డి.. కాలం నుంచి హైదరాబాద్ రావడం లేదు.. హైదరాబాద్ రాక కూడా దాదాపు నెలలు దాటిపోయింది. అయితే కెసిఆర్ తుంటి ఎముక సర్జరీ చేయించుకోవడంతో ఆయనను పరామర్శించేందుకు జగన్ వస్తున్నారు.. వాస్తవానికి కెసిఆర్ జారిపడినప్పుడు.. ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు జగన్ పరామర్శకు రాలేదు.. అప్పట్లో జగన్ పరామర్శకు వస్తారని అందరూ అనుకున్నారు.. కానీ ఎందుకనో ఆయన రాలేదు.
కెసిఆర్ ప్రస్తుతం నంది నగర్ లోని తన ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.. అయితే జగన్ కేసీఆర్ ను పరామర్శించడం వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అనే చర్చ నడుస్తోంది.. గత ఎన్నికల్లో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు. వారి మీద ఉన్న వ్యతిరేకత వల్ల మూడవసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. చివరికి కామారెడ్డి లో కూడా ఆయన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.. ఇక ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వడం లేదు. కొంతమందికి మాత్రం వేరే స్థానంలో టికెట్లు కేటాయిస్తున్నారు.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారం కోల్పోయిన నేపథ్యంలో.. దానికి కారణం ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత అని.. అందుకే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం. కెసిఆర్ నూతన రాజకీయ గురువుగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటుంటారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తన సోదరుడని కెసిఆర్, కేటీఆర్ కూడా పలు సందర్భాల్లో చెప్పారు. అప్పట్లో 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కెసిఆర్ పలు విధాలుగా సహాయం చేశారని.. చంద్రబాబు మీద ఉన్న కోపంతో రిటర్న్ గిఫ్ట్ కూడా పంపించారని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంటుంది.. అయితే తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో కేసీఆర్ ఎటువంటి సలహాలు జగన్మోహన్ రెడ్డికి ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి వాటిని ఏ విధంగా పాటిస్తారు అనేది? చర్చనీయాశంగా మారింది.
జగన్మోహన్ రెడ్డి సోదరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో.. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ద్వారా తనకు ఏమైనా నష్టం జరుగుతుందా? ఒకవేళ అలాంటి ప్రభావం ఉంటే దానిని ఏ విధంగా అధిగమించాలి? అనే విషయంపై జగన్, కెసిఆర్ చర్చించుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. షర్మిల తాను తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేశారు. సమయంలో భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా ఆమె మీద విమర్శలు చేశారు. ఇప్పుడు జగన్ నుంచి ఒక్క మాట కూడా రాలేదు. హరీష్ రావు, కేటీఆర్ కూడా ఏపీలో రోడ్ల పరిస్థితి మీద విమర్శలు చేస్తే.. అక్కడి మంత్రులు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల సత్తుపల్లిలో ఎన్నికల ప్రచార నిర్వహించినప్పుడు కేసీఆర్ ఆంధ్ర లో పాలన మీద విమర్శలు చేస్తే.. వైసీపీ నుంచి ఏ విధమైన కౌంటర్ రాలేదు. ఇక తెలంగాణలో ఉన్న వైసీపీ సానుభూతిపరులు మొత్తం మొన్నటి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి జై కొట్టారని.. అందువల్లే గ్రేటర్లో అన్ని స్థానాలు ఆ పార్టీ సాధించిందని చర్చ నడుస్తోంది.
ఇక ఈ రెండు పార్టీలు అటు ఎన్డీఏ కూటమిలో గాని, ఇటు ఇండియా కూటమిలో గానీ లేవు. ఈ రెండు పార్టీలు తెర వెనుక బిజెపికి అనుకూలంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం బిజెపి కూడా తెలంగాణ నుంచి భారీగానే పార్లమెంటు స్థానాలు ఆశిస్తోంది. అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నాయకులు పార్లమెంటు స్థానాల్లో పోటీచేసే బలమైన నాయకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి? టిడిపి ఎత్తు లను ఎలా తిప్పికొట్టాలి? ఎలా చేస్తే రెండోసారి కూడా అధికారం సొంతమవుతుంది? అనే చర్చలు అటు కెసిఆర్, ఇటు జగన్ మధ్య జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కెసిఆర్ కాలుజారి పడినప్పుడు, ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడు, డిస్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లినప్పుడు.. కనీసం అటువైపు మొహం కూడా చూపించని జగన్.. ఇప్పుడు పరామర్శకు వెళ్లడం వెనుక ఉద్దేశం అదే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే వీరిద్దరి కలయిక వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నదనే దానిపై కూడా చర్చ నడుస్తోంది. అయితే వీరిద్దరి భేటీ అనంతరం ఎటువంటి విషయాలు చర్చకు వచ్చాయి అన్నది తర్వాత తెలుస్తుందని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.