CM Revanth Reddy: తెలంగాణలో క్యాబినెట్ విస్తరణతోపాటు హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి అంశాలపై హైకమాండ్‌తో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అక్టోబర్ 1న(మంగళవారం) ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేను కలిశారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన ఆరోగక్యం గురించి అడిగ తెలుసుకున్నారు. ఏఐసీసీ సెక్రెటరీ కేసీ.వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం, మూసీ ప్రక్షాళన పేరిట చేపట్టిన పనులతో హైదరాబాద్‌లో నిర్వాసితుల ఆందోళనపై చర్చించారు. ఈ సందర్భంగా అధిష్టానం కూడా రేవంత్‌రెడ్డికి కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మూసీ సుందరీకరణలో భాగంగా కూల్చివేతలు చేపట్టిన నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో దూకుడు తగ్గించాలని, ఆచితూచి వ్యవహరించాలని తెలిపినట్లు చర్చ జరుగుతోంది.
రాహుల్ వ్యాఖ్యల దుమారం..
తెలంగాణలో హైడ్రా బుల్డోజర్లు కూల్చివేతలు చేస్తున్న నేపథ్యంలో రాహుల్‌గాంధీ యూపీ, మధ్యప్రదేశ్‌లో బుల్డోజర్ విధానంపై విమర్శలు చేశారు. కానీ తెలంగాణలో హైడ్రా బుల్డోజర్లపై మాట్లాడడం లేదని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో బీజేపీ పాలిత రాష్ట్రాల తరహాలోనే పాలన సాగుతోందన్న సంకేతాలు వెళ్లాని అధిష్టానం రేవంత్‌రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. మూసీ సుందరీకరణపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని కేసీ.వేణుగోపాల్ సూచించినట్లు తెలిసింది.
ప్రత్యామ్నాయం చూపించాకే..
మూసీ సుందరీకరణలో భాగంగా ముందుగా నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపించాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు సమాచారం. ఇప్పటికే మూసీ నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తోంది. అయినా కొంతమంది ఖాళీ చేయడానికి నిరాకరిస్తున్నారు. ఇలాంటి వారిని కూడా ఇబ్బంది పెట్టొద్దని, కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. అన్నివిధలా నచ్చజెప్పిన తర్వాతనే తరలించాలని, తరలించిన తర్వాతనే కూల్చివేతలు చేపట్టాలని తెలిపింది. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో చర్యలు చేపట్టిందని రేవంత్‌రెడ్డి కూడా కాంగ్రెస్ హైకమాండ్‌కు వివరించారు.