Kadiyam Kavya: మొన్ననే కదా కడియం కావ్య కేసీఆర్ ను కలిసింది. పుష్పగుచ్చమిచ్చి ఆశీర్వాదం తీసుకుంది.. అంతకుముందు ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి సీనియర్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించింది.. కానీ ఇంతలోనే ఏమైంది.. ఆకస్మాత్తుగా వరంగల్ ఎంపీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఎందుకు ప్రకటించింది? నిజంగా కావ్యకు భారత రాష్ట్ర సమితిలో ఏం జరుగుతుందో తెలియదా? తన తండ్రి కొన్ని సంవత్సరాల నుంచి ఆ పార్టీలోనే ఉన్నాడు కదా? అధికారంలో ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి నాయకులు చేసిన దందాలు, దౌర్జన్యాలు, అక్రమాలు కావ్యకు తెలియవనుకోవాలా? వృత్తిరీత్యా డాక్టర్, ఉన్నత విద్యావంతురాలైన కావ్య కు ఇప్పుడే భారత రాష్ట్ర సమితిలో ఇవన్నీ కనిపించాయా? ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం వంటివి ఆమెను ఆ స్థాయిలో బాధించాయా? తెరపైకి చెప్తున్న కారణాలు ఇవే గాని.. తెర వెనుక వేరే ఉన్నాయి. కాకపోతే వెళ్తూ వెళ్తూ ఆరోపణలు చేసి వెళ్ళింది.
భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసిన కావ్య.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేస్తారని విశ్వసనీయ సమాచారం.. త్వరలోనే కడియం శ్రీహరి కూడా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపారని.. ఢిల్లీ నుంచి అధిష్టానం లో పెద్దలు ఆయనతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఈ సంప్రదింపుల్లో భాగంగానే కడియం శ్రీహరి కుమార్తె కావ్య ముందుగా భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేశారు.
ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నుంచి ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బయటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి తరఫున గట్టిగా మాట్లాడే కడియం శ్రీహరి ఆ పార్టీకి గుడ్ బై చెబుతుండడం.. కాంగ్రెస్ లో చేరుతుండడం.. గులాబీ పార్టీకి పెద్ద ఇబ్బందేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి వారం క్రితమే వరంగల్ నుంచి కావ్యను భారత రాష్ట్ర సమితి పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. అప్పటినుంచి ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వరంగల్ జిల్లాలో భారత రాష్ట్ర సమితికి సంబంధించి అంతర్గత వ్యవహారాలు తనను ఇబ్బంది పెడుతున్నాయని, అందువల్లే రాజీనామా చేస్తున్నట్టు కావ్య ప్రకటించారు. ” గత అధికార పార్టీ నాయకుల పైన భూకబ్జా ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కాం, ఫోన్ ట్యాపింగ్ వంటి పరిణామాలు ఇబ్బందికి గురిచేస్తున్నాయి” అందువల్లే తను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నట్టు కడియం కావ్య ప్రకటించారు.
ఇక కడియం శ్రీహరి తో పాటు కీలకమైన నేతలు భారత రాష్ట్ర సమితిని విడిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. “శ్రీహరి మాత్రమే కాకుండా చాలామంది ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితి అవకాశం ఉందని.. అందువల్లే కాంగ్రెస్ నాయకులు చాలామంది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఇటీవల ప్రకటిస్తున్నారని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. త్వరలోనే చాలామంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని తెలుస్తోంది.