CM Jagan: జగన్ భయపడుతున్నారా? వివేకా హత్య కేసు ప్రతికూల ఫలితం ఇస్తుందని భావిస్తున్నారా? ప్రజల్లోకి బలంగా వెళ్లిందని అనుకుంటున్నారా? అందుకే వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఏనాడు జగన్ ఈ హత్య గురించి, ఈ కేసు గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు బాబాయిని ఎవరు చంపారో… ఎవరు చంపించారో.. ఆ దేవుడికి, కడప జిల్లా ప్రజలకు బాగా తెలుసు. చంపిన హంతకుడు దర్జాగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారు తెలుసు అంటూ జగన్ కడపలో ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.అయితే వివేక హత్య కేసులో ఒక నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ని పక్కన పెట్టుకుని జగన్ ఈ తరహా ఆరోపణలు చేయడం విశేషం.
గత ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. తొలుత వైసిపి నేతలే గుండెపోటు అని ప్రకటించారు. తరువాత హత్యగా చెప్పుకొచ్చారు. ఇది రాజకీయంగా చేసిన హత్య అని.. సిబిఐ దర్యాప్తు కోసం నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ డిమాండ్ చేశారు. సాక్షి మీడియా అయితే నారాసుర రక్త చరిత్ర అంటూ పతాక శీర్షిక కథనాలు వండి వార్చింది. గత ఎన్నికల్లో జగన్కు విపరీతమైన సానుభూతి లభించింది. అధికారంలోకి రాగలిగారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తు మందగించింది. అసలు సిబిఐ దర్యాప్తు అవసరం లేదని జగన్ అభిప్రాయపడ్డారు. దీంతో వివేకా కుమార్తె సునీత న్యాయపోరాటం చేయడం, కోర్టు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడం, దర్యాప్తు సుదీర్ఘకాలం సాగడం, నిందితులకు జగన్ అండగా నిలబడుతున్నారని సునీత ఆరోపణలు చేయడం, ఇలా ఎన్నెన్నో ట్విస్టులతో నాలుగున్నర సంవత్సరాల కాలం గడిచిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విషయమై ప్రస్తావించని జగన్.. ఇప్పుడు ఎన్నికల ముంగిట.. అది ప్రచార సభలో ప్రస్తావించడం విశేషం.
అయితే జగన్ విపక్ష నేతగానే మాట్లాడుతున్నట్లు ఉన్నారు. గత ఐదు సంవత్సరాలుగా తాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మరిచిపోయారు. ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారణ మందగించడానికి కారణం ఎవరు? చంపిన వాడే.. ఎవరు చంపమన్నారో బాహటంగా చెబుతున్నాడు. వివేక కుటుంబ సభ్యులు సైతం అతన్ని ఎందుకు చంపారో? ఎందుకు చంపించారో? బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు. వారు చెప్పే మాటలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ముఖ్యంగా కడప జిల్లా ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులకు జగన్ అండగా నిలబడుతున్నారన్నది బహిరంగ రహస్యం. అది ఆరోపణ కాదు అనుమానం.. అంతకుమించి వాస్తవానికి దగ్గరగా ఉండే అంశం. అయినా సరే ఎన్నికల ప్రచార సభలో నేరుగా జగన్ వివేకా హత్య కేసును ప్రస్తావించటం.. రాజకీయ ప్రత్యర్థులే చంపించారని ఆరోపణలు చేయడం మాత్రం కాస్త అతిగా ఉంది. గత ఐదు సంవత్సరాల జగన్ పాలనలో ఇటువంటి కేసులు రోజుల వ్యవధిలో పోలీస్ శాఖ ఛేదించింది. కానీ ఒక రాష్ట్రానికి మాజీ మంత్రి, మాజీ సీఎం సోదరుడు, ప్రస్తుత సీఎం బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి హత్య కేసును ఐదు సంవత్సరాలుగా ఛేదించలేకపోవడం మాత్రం విచారకరం.