Telangana BJP: తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష(BJP State Prasident) పదవి ఎవరిని వరిస్తుందో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇప్పటికే సంస్థాగత ఎన్నికలు పూర్తికావొచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తయితే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. ఈమేరకు కేంద్ర నాయకత్వం కూడా కసరత్తు చేస్తోంది. ఈ నేలాఖరు వరకు రాష్ట్ర సారథిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ పగ్గాలు ఎవరు చేపడతారన్న చర్చ, జరుగుతోంది. మరోవైపు బీజేపీ షార్ట్ లిస్ట్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ముగ్గురి పేర్లు ఉన్నట్లు సమాచారం. ఈటల రాజేందర్, రామచంద్రారావు, డీకే. అరుణ పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎవరి ప్రయత్నాలు వారివి..
బీజేపీ సీనియర్ నేత అయిన రామచంద్రారావుకు ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఉంది. దీంతో ఆయన ఇప్పటికే అధిష్టానం పెద్దలను కలిశారు. తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. సేనీల్ బన్సల్, బీఎల్.సంతోష్ సహా ముఖ్యనేతలనూ రామచంద్రారావు కలిశారు. ఇక హై కమాండ్ మహిళా కోటాలో డీకే.అరుణ పేరును కూడా పరిశీలిస్తోంది. రెడ్డి సమాజికవర్గం కూడా ఆమెకు కలిసి వస్తుందన్న చర్చ జరుగుతోంది. ఇక బీసీ నేత అయిన ఈటల పేరు కూడా అధిష్టానం దృష్టిలో ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే రేసులో ఈటలనే ముందు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఈటలకు కలిసి వస్తుందంటున్నారు. ఈ ముగ్గురి పేర్లు పరిశీలించిన తర్వాత మోదీ, అమిత్‌షా ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.
వారిని పక్కన పెట్టి..
అధ్యక్ష పదవి కోసం గతంలో ఈటల రాజేందర్‌తోపాటు ధర్మపురి అరవింద్, రఘునందన్‌రావు, డీకే అరుణ పేర్లు వినిపించాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు కూడా ప్రచారం జరిగింది. అయితే అవన్నీ పరిశీలించిన తర్వాత షార్ట్ లిస్ట్‌లో ఈటల, డీకే. అరుణ, రామచంద్రరావు పేర్లు నిలిచాయి. ఈ ముగ్గురిలో ఒకరు అధ్యక్షులు కావడం దాదాపు ఖాయం.
కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే.. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్నవారే అధ్యక్షులు కావాలనేది లేదని తెలిపారు. ఏకాభిప్రాయంతోనే ఎన్నిక ఉంటుందని తెలిపారు. వారం రోజుల్లోనే అధ్యక్ష పదవికి ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. ఈ రేసులో ఈటల రాజేందర్ కూడా ఉన్నారని వెల్లడించారు. కొత్త సభ్యత్వాలు, పోలింగ్ బూత్ కమిటీలు, మండల కమిటీల ఎంపిక పూర్తయిందని, జిలా లకమిటీల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 600 కమిటీలను పూర్తి చేస్తే అందులో 50 శాతం బీసీలకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించామని తెలిపారు. పార్టీ పదవుల్లో 33 శాతం మహిళలకు ఇస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు.