KCR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితికి ఒకరకంగా కంచుకోట. 2014లో ఇక్కడ మాగంటి గోపీనాథ్ టిడిపి తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత గులాబీ పార్టీ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా పింక్ కండువా కప్పుకున్నారు. 2018లో పింక్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2023 లో కూడా ఆయన అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. తద్వారా హ్యాట్రిక్ సాధించిన నాయకుడిగా రికార్డ్ సృష్టించారు. అయితే అనారోగ్యం వల్ల మాగంటి గోపీనాథ్ కన్నుమూయడంతో జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైపోయింది.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా 2014 నుంచి 2023 వరకు ఎన్నో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజరాబాద్ స్థానాలలో గులాబీ పార్టీ ఓడిపోయింది. వాస్తవానికి ఆ నియోజకవర్గాలలో గులాబీ పార్టీ అధినేత కేసిఆర్ ప్రచారం చేయలేదు. ఆ ఎన్నికల్లో బాధ్యతలను కేటీఆర్, హరీష్ రావు కు అప్పగించారు. దీంతో గులాబీ పార్టీ అమలు చేసిన వ్యూహాలు ఆ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. దీంతో ఓటమి తప్పలేదు. అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ రెండు స్థానాలను గులాబీ పార్టీ కోల్పోయింది.
హుజూర్ నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది. ఇక 2023లో ఓడిపోయిన తర్వాత.. కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నిక ప్రచారంలో కెసిఆర్ పాల్గొనలేదు. దీంతో ఆ నియోజకవర్గంలో కూడా ఓటమి ఎదురైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సంబంధించి ప్రచారానికి కెసిఆర్ వస్తారని పార్టీ నాయకులు భావించారు. పైగా ప్రచార నాయకుల జాబితాలో కేసీఆర్ పేరు ముందు ఉంది. అయినప్పటికీ ప్రచారానికి కెసిఆర్ రాలేదు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బాధ్యతలు మొత్తం కేటీఆర్ మీద పెట్టారు. అయితే కేటీఆర్ మీడియా సంస్థలకు విరివిగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. సోషల్ మీడియాను బలంగా వాడుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒకానొక సందర్భంలో తానే అభ్యర్థి నేమో అన్నట్టుగా ఓటర్లకు అనిపించేలా చేశారు. ఇన్ని చేసినప్పటికీ.. పోల్ మేనేజ్మెంట్ లో సరికొత్త విధంగా దూకుడు కొనసాగించినప్పటికీ గులాబీ పార్టీ విజయం సాధించలేకపోయింది.
ఒకవేళ కెసిఆర్ గనక ప్రచారానికి వచ్చి ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఫలితం మరో విధంగా ఉండేదని గులాబీ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ గనుక గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి మారిపోయేదని.. ప్రజలు క్రమేపి గులాబీ పార్టీని నమ్మేవారని.. అని ఇప్పుడు పరిస్థితి ఒకసారిగా మారిపోయిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.