Amar Raja: రేవంత్ రెడ్డికి గల్లా జయదేవ్ వార్నింగ్ వెనుక మతలబు ఏంటి ?

నాడు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అమర్ రాజా సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ ఒప్పందాలలో భాగంగా లిథియం - ఆయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, గ్రీన్ ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని అమర్ రాజా నిర్మిస్తుంది. 10 సంవత్సరాల వ్యవధిలో 9500 కోట్ల పెట్టుబడిని ఈ విభాగం మీద అమర్ రాజా పెడుతుంది.

Written By: NARESH, Updated On : August 11, 2024 11:57 am
Follow us on

Amar Raja: తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ పలు విదేశీ కంపెనీల ప్రతినిధులను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. దీనిపై భారత రాష్ట్ర సమితి నానా యాగీ చేస్తోంది. ఇదే క్రమంలో సుప్రసిద్ధ బ్యాటరీ తయారీ సంస్థ అమర్ రాజా ఒక్కసారిగా బాంబు పేల్చింది. భారత రాష్ట్ర సమితికి ఆయాచిత అస్త్రం అందించేలాగా వ్యాఖ్యలు చేసింది. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా సంచలనం నెలకొంది. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో అమరాజా బ్యాటరీస్ సంస్థ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 9వేల కోట్లకు పైచిలుకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇక్కడ బ్యాటరీ తయారీ సంస్థను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంలో నాడు అమర్ రాజా సంస్థ నిర్మించబోయే కార్యాలయాలకు అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అప్పట్లో అమర్ రాజా బ్యాటరీస్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.. నాటి నుంచి ఆ సంస్థ తన కార్యకలాపాలు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది.

నాడు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అమర్ రాజా సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ ఒప్పందాలలో భాగంగా లిథియం – ఆయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, గ్రీన్ ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని అమర్ రాజా నిర్మిస్తుంది. 10 సంవత్సరాల వ్యవధిలో 9500 కోట్ల పెట్టుబడిని ఈ విభాగం మీద అమర్ రాజా పెడుతుంది. ఈ తయారీ కేంద్రంలో 16 GWh, బ్యాటరీ బ్యాక్ అసెంబ్లీ యూనిట్ 5 5GWh వరకు ఇక్కడ బ్యాటరీలు ఉత్పత్తి అవుతాయి. ఈలోగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడులకు సంబంధించి ఫోకస్ చేశారు. పలు సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించేందుకు నడుం బిగించారు. అయితే ఆయన సొంత జిల్లాలో ఏర్పాటు అవుతున్న అమర్ రాజా సంస్థ నిర్వాహకులు మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం అమర్ రాజా గ్రూప్ సెల్ తయారీ కోసం కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. 1.5 GWh బ్యాటరీ ప్యాక్ ప్లాంట్ ఫేజ్ -1 కూడా మొదలు పెట్టింది.

శనివారం శంకుస్థాపన కార్యక్రమం అనంతరం అమరాజా బ్యాటరీస్ అధిపతి గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు..” గత ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాల విషయంలో మాకు కొన్ని హామీలు ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం వాటిని కొనసాగిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మేము ప్రస్తుత ప్రభుత్వం నుంచి సానుకూల దృక్పథాన్ని ఆశిస్తున్నాం. రాజకీయంగా పార్టీలు అధికారం కోల్పోయిన తర్వాత.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితిలో ఒక్కసారిగా మారిపోతుంటాయి. ఒకవేళ ఇక్కడి పరిస్థితులు మాకు అనుకూలంగా లేకపోతే మేము వేరే ప్రాంతాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ప్లాంట్ సామర్థ్యాన్ని 16 GGWh కంటే ఎక్కువగా విస్తరించడంపై మేము దృష్టి సారించామని” జయదేవ్ అన్నారు. మరోవైపు EV మార్కెట్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. వచ్చే ఐదు సంవత్సరాలలో ఐదు బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా అమర్ రాజా గ్రూప్ మారే అవకాశం ఉందని తెలుస్తోంది.