YS Jagan : ఆళ్ల నాని వైసీపీని ఎందుకు వీడారు? జగన్ పట్టించుకోలేదా? ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇంతటి చిన్న వయసులో రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకున్నారు? క్రియాశీలక రాజకీయాలకు ఎందుకు గుడ్ బై చెప్పారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆళ్ల నాని అంటే విధేయత, వివాదాలకు దూరంగా ఉండడం, అధినేతపై అపార నమ్మకం, చిన్న వయసులోనే డిప్యూటీ సీఎం హోదా దక్కించుకోవడం… ఇవన్నీ సానుకూలతలే. అసలు ఆళ్ల నాని రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు. పెద్ద వివాదాస్పదమైన నేత కూడా కాదు. ప్రత్యర్థులతో మితిమీరిన శత్రుత్వం కూడా లేదు. అధికారంలో ఉన్నప్పుడుఅనవసర వ్యాఖ్యల జోలికి పోలేదు. ఇతరుల మాదిరిగా ప్రత్యర్థులను నిందించలేదు. అయినా సరే పార్టీని వీడారు. వేరే పార్టీలో చేరలేక రాజకీయ సన్యాసం చేశారు. యాక్టివ్ రాజకీయాలకు దూరమైనట్లు ప్రకటించారు. అయితే ఇందుకు కారణాలు మాత్రం తెలియడం లేదు. కానీ ముమ్మాటికీ జగన్ ఏ కారణం అన్న ఆరోపణ మాత్రం ఉంది. వాస్తవానికి జగన్ తన తొలి క్యాబినెట్లో ఆళ్ల నానిని తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పదవి పోస్ట్ కట్టబెట్టారు. విస్తరణలో పదవి నుంచి తొలగించారు. అయినా ఆళ్ల నాని బాధపడలేదు. మొన్నటి ఎన్నికల్లో టిక్కెట్ విషయంలో సైతం జగన్ నాన్చుడు ధోరణితో వెళ్లారు. అయినా సరే ఎక్కడా అసంతృప్తి చెందలేదు. కానీ ఇప్పుడు వైసీపీ అధికారానికి దూరమయ్యేసరికి ఆళ్ల నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పడం విశేషం.
* ఒక్కొక్కరుగా దూరం
అయితే ఒక్క ఆళ్ల నాని మాత్రమే కాదు.. ఆయన బాటలో 30 నుంచి 40 మంది వైసీపీ నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సినీ నటుడు అలీ వైసీపీతో తనకు సంబంధం లేదని ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని చెప్పుకొచ్చారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని అయితే క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. మద్దాలి గిరి, కిలారు రోశయ్య, సిద్ధా రాఘవరావు.. ఇలా నేతలంతా పార్టీని వీడుతున్నారు. అయితే పార్టీని వీడుతున్న చాలామంది నేతలు క్రియాశీలక రాజకీయాలనుంచి దూరమవుతున్నట్లు ప్రకటించారు. అంటే ఎదుటి పార్టీలో అవకాశం లేకపోయి ఉంటుంది. లేకుంటే వైసీపీకి భవిష్యత్తు లేదన్న బెంగ అయినా ఉంటుంది. దీనివల్లే ఎక్కువమంది పార్టీకి గుడ్ బై చెబుతున్నారు కానీ.. రాజకీయాలు వదిలేశామని చెప్పుకొస్తున్నారు.
* అధినేత తీరు మారడంలే
అధికారం కోల్పోయిన తర్వాత అధినేత వైఖరిలో మార్పు వస్తుందని ఎక్కువ మంది భావించారు. తమ మాట వింటారని ఆశించారు. తమ అభిప్రాయాన్ని గౌరవిస్తారని అనుకున్నారు. ఈ విషయంలో జగన్ వైఖరి నచ్చకే ఆళ్ల నాని లాంటి నమ్మకస్తుడు.. వేరే పార్టీలో చేరక.. చేరలేక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. పార్టీ పరిస్థితి, స్థితిగతులపై ఆళ్ల నాని ఇచ్చిన సలహాలను కనీస పరిగణలోకి తీసుకోలేదు జగన్. ఆ పరిణామం తోనే ఆళ్ళ నాని పార్టీకి దూరమైనట్లు తెలుస్తోంది.
* జగన్ అతి ధీమాతో..
పార్టీలో ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో తెలియని పరిస్థితి. ఉన్నవారితో పార్టీని నడుపుకుంటానని జగన్ ధీమాతో ఉన్నారు. వైసీపీ ఏర్పాటు చేసినప్పుడు తాను, తనతో పాటు తన తల్లి విజయమ్మ మాత్రమే ఉన్నారన్న విషయాన్ని జగన్ గుర్తు చేస్తున్నారు. ఇద్దరితో ప్రారంభమైన వైసీపీ తొలుత బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. తరువాత అధికారంలోకి వచ్చింది. అటు తరువాత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. అయినా సరే జగన్ లో ధీమా కనిపిస్తోంది. తప్పకుండా అధికారంలోకి వస్తానని.. ఉన్నవారు ఉండొచ్చని.. ఇష్టం లేనివారు పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు అన్న భావనతో ఉన్నారు. ఈ క్రమంలో ఆళ్ల నాని లాంటి విధేయత కలిగిన నేతలు వదులుకున్నారు. మున్ముందు ఆళ్ల నాని బాటలో మరి కొంతమంది వైసీపీ నేతలు పయనించనున్నట్లు తెలుస్తోంది.