Medaram Jatara 2024: సమ్మక్క సారక్క జాతర అంటే భారతదేశం అంతటా సంబరమే. ఇక తెలంగాణ ప్రజలు ఈ జాతర కోసం ఎదురుచూస్తుంటారు. ఈ జాతరకు సమయం ఆసన్నమైంది. జనమంతా ఆ వన దేవతల సన్నిధి వైపు అడుగులు వేస్తున్నారు. మినీ కుంభమేళా గా నాలుగు రోజులు సాగే ఆ తల్లుల దగ్గరకు కోటి యాభై లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం కోటి మంది భక్తులే హైయెస్ట్ రికార్డ్. కానీ ఈ సారి ఈ లెక్క మరింత పెరిగేలా ఉందట. ఇక ఇందులో పోలీసుల పాత్రే అత్యంత కీలకం.
అయితే జాతరకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనువణువు నిఘా నేత్రాలతో కనిపెట్టేందుకు అత్యాధునిక డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఇప్పటికే 500 సీసీ కెమెరాలతో భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ సెట్అప్ చేశారు. 14 వేల మంది పోలీసులతో జాతర బందోబస్తుకు సర్వం సిద్దం చేశారు. ఇందులో వెయ్యి మంది మహిళా పోలీసులు జాతర విధుల్లో పాల్గొంటున్నారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను కూడా ఆపరేట్ చేయనున్నారట.
మొత్తం ఐదు రహదారులలో డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఆ డ్రోన్ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి ఎక్కడ ఇబ్బంది కలిగిన వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణంలో మహా జాతర సాగేలా పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా గద్దెల ప్రాంతంలో తోపులాట జరిగే అవకాశం ఉంటుంది. క్యూలైన్ లో తోపులాట జరుగుతుంటుంది. చాలా మంది స్పృహతప్పి కూడా పడిపోతుంటారు.
కొబ్బరి చిప్పలు తగిలి కొందరికి గాయాలు అవుతుంటాయి. అలాగే సందట్లో సడేమియాలాగా చైన్ స్నాచింగ్, జేబు దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ఈ సారి మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు. దీని కోసం ఎక్కువగా డ్రోన్ కెమెరాలను ఆపరేట్ చేస్తున్నారు. అనువణువు పరీక్షించేలా అలర్ట్ అయ్యారు పోలీసులు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బస్సుల ద్వారా గద్దెల వరకు పోనిచ్చేలా ఏర్పాటు చేశారు సో ఆర్టీసీ బస్సుల ద్వారా ఆ తల్లులను దర్శించుకోవడానికి హ్యాపీగా వెళ్లొచ్చు