Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. అందేంటి ఈనెల 30న కదా పోలింగ్ ఇప్పుడే మొదలైంది అంటున్నారు అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజమే.. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, పోలింగ్ కేంద్రాలనికి రాలేని వృద్ధులు, దివ్యాంగులు ఇంటివద్దే ఓటు వేసే అవకాశాన్ని ఈసారి ఎన్నికల సంఘం కల్పించింది. ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు ఈ పోలింగ్ పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. దీంతో మంగళవారం నుంచి పోలింగ్ మొదలైంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, పోలింగ్ కేంద్రానికి రాలేని దివ్యాంగులు ఇప్పటికే 12డి ఫాంతో దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హులను ఎంపిక చేసిన అధికారులు వారి ఇంటికే మొబైల్ పోలింగ్ కేంద్రాన్ని పంపిస్తున్నారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
వీరికి అవకాశం..
80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సర్వీసుల్లో ఉండే ఉద్యోగులు ఇంటినుంచే ఓటు వేసే సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందించింది. దీంతో వృద్ధులు, వికలాంగులు ఇంటి వద్ద ఓటు వేస్తుండగా, ఎన్నికల సిబ్బంది శిక్షణ కేంద్రంలోనే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.
ఇంటివద్దే ఓటు..
ఈ ప్రక్రియలో ఇద్దరు ఎన్నికల అధికారులు, పోలీసుల సహాయంతో ఓటరు ఇంటికే పోస్టల్ బ్యాలెట్ తీసుకువెళ్లి ఇస్తారు. ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసే సౌకర్యాన్ని అదే ఇంట్లో కల్పిస్తారు. ఓటువేశాక దాన్ని కవర్లో పెట్టి, ఎన్నికల అధికారికి ఓటరు అప్పగిస్తారు. ఈ ప్రక్రియను వీడియో తీస్తారు. ప్రస్తుత ఎన్నికల్లో మంగళవారం ప్రారంభమైన ఈ సదుపాయం ఈనెల 27వరకూ కొనసాగుతుంది.
జిల్లాల వారీగా తేదీల ప్రకటన..
ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు ఓట్ ఫ్రం హోం అవకాశం ఉంటుంది. దీంతో ఎన్నికల అధికారులు ఏ జిల్లాలో ఏరోజు పోలింగ్ నిర్వహించాలో ఇప్పటికే దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చారు. రెండుసార్లు ఎన్నికల సిబ్బంది దరఖాస్తుదారు ఇంటికి వెళ్తారు. మొదటి రోజు వేయకపోతే రెండో రోజు వేయొచ్చు. రెండో రోజు కూడా వేయకుంటే ఇక ఓటే వేసే అవకాశం కోల్పోతారు. ఇలా పోలైన పోస్టల్ ఓట్లను పోలింగ్ తేదీ ముగిశాక, అన్ని ఓట్లతో కలిపి లెక్కిస్తారు..