Barrelakka: ఉదయం పేపర్ తిరిగేస్తుంటే “బర్రెలక్క పై దాడి.. ఆమెను ప్రచారం చేయనీయకుండా కొంతమంది అడ్డుకున్నారు. ఆమె తమ్ముడిని కొట్టారు” అని ఒక వార్త కనిపించింది. నిజంగానే బర్రెలక్క ఆ స్థాయికి ఎదిగిందా? కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచేంత రాజకీయ ఉధృతిని మూటగట్టుకుందా? సోషల్ మీడియాలో అంతస్థాయిలో పాపులారిటీని సంపాదించుకునేందుకు ఆమె ఏం చేసింది? సామాన్య మానవులనే కాదు.. సగటు రాజకీయ నాయకుడిని కూడా ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు ఇవి.
ఒక సామాన్య యువతి
బర్రెలక్క అలియాస్ శిరీష కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఒక మామూలు గ్రామానికి చెందిన యువతీ. పేద కుటుంబం.. హైదరాబాదులో చదువుకుంటున్నది. తాను ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య మీద, తన ఊరికి సరైన బస్సు లేకపోవడంతో పడుతున్న ఇబ్బంది మీద తీసిన చిన్న వీడియోలు ఆమెను సోషల్ మీడియా స్టార్ ను చేశాయి. కానీ ఇక్కడే తనకు వచ్చిన పాపులారిటీని ఆమె అత్యంత తెలివిగా వాడుకుంది. బిత్తిరి సత్తి లాగా, సావిత్రి లాగా పెయిడ్ షోలు చేయకుండా.. న్యూట్రల్ గా ఎదిగింది. తనకు వచ్చిన ఆ పాపులారిటీని మంచికి ఉపయోగించుకోవాలని ఉంది. అందులో భాగంగానే కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. తన తమ్ముడితో కలిసి నామినేషన్ దాఖలు చేసింది. మొదట్లో తను నామినేషన్ వేసిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆమె దీన్ని తనకు బూస్టర్ లాగా వాడుకుంది. అడుగు అడుగు కూడ తీసుకొని ప్రచారానికి దరఖాస్తు చేసుకుంటే.. అక్కడ కూడా ఆమెకు ఆశించినంత స్థాయిలో అధికారుల నుంచి ప్రోత్సాహం దక్కలేదు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలియడంతో ఆమెకు మద్దతు విపరీతంగా లభించడం ప్రారంభమైంది. ఏముంది రాత్రికి రాత్రే ఆమె మీడియా స్టార్ కూడా అయిపోయింది. యూ ట్యూబర్లు ఆమెను ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించారు. ఆ యువతి కూడా ఎటువంటి సంకోషం లేకుండా వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రారంభించింది. ఇక పెద్దపెద్ద వారు కూడా ఆమెకు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో ఆమె కొల్లాపూర్ లో ఒక సెలబ్రిటీ లాగా మారిపోయింది.
దాడి చేయాల్సిన అవసరం ఉంది
సహజంగా శిరీష ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తోంది కాబట్టి.. ప్రజాస్వామ్యం గురించి వీరలెవల్లో ప్రచారం చేసే గులాబీ నేతలు ఆమెపై గుర్రుగా ఉన్నారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలని లెక్చర్లు దంచే కవిత, కేటీఆర్ కూడా ఆమె రాజకీయ ప్రవేశంపై కించిత్ మాట కూడా మాట్లాడటం లేదు. అయితే ఆమె నిన్న ప్రచారానికి వెళ్తుంటే కొంతమంది అడ్డుకున్నారు. ఆమె తమ్ముడి పై దాడి చేశారు. దీంతో ఒకసారిగా బర్రెలక్క ఏడుపు లంకించుకుంది. ఇవి సోషల్ మీడియా రోజులు కాబట్టి ఆ సంఘటన వైరల్ గా మారింది. అయితే ఈ దాడుల వెనుక భారత రాష్ట్ర సమితి నాయకుల హస్తం ఉందని కొంతమంది ఆరోపిస్తుంటే, బర్రెలెక్కకు విరాళం ఇచ్చి ఆమెను పోటీలోకి దించారని కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావును గులాబీ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.. ఏది ఏమైనప్పటికీ ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక యువతి.. ఎటువంటి అండదండలు లేకుండా ఈ స్థాయిలో ప్రాచుర్యం పొందడం అంటే మామూలు విషయం కాదు. అంటే సోషల్ మీడియా చేతిలో ఉంది కాబట్టి ప్రాచుర్యానికి పెద్దగా డోకా లేదు అని అనుకోవచ్చు.. సోషల్ మీడియా అకౌంట్లు ఉన్న వారంతా సెలబ్రిటీలు కారు.. కాలేరు. బర్రెలక్క సమాజం మీద సంధిస్తున్న ప్రశ్నలు చాలానే ఉన్నాయి. దానికి సమాధానాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఒక సామాన్య యువతి రాజకీయాలకు రావడం అత్యంత కష్టమేం కాదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం డబ్బు ద్వారానే ఎదుటివారి అభిమానాన్ని చూరగొంటామంటే అది అవివేకమే. ఈ లెక్కన నాయకులు కోట్లకు కోట్లు ఖర్చు చేసినా కూడా పొందలేని అభిమానాన్ని బర్రెలక్క పొందింది. చివరికి నిన్న కేసీఆర్ మూడు చోట్ల ఎన్నికల సమావేశం నిర్వహించినప్పటికీ ట్విట్టర్లో ట్రెండింగ్ టాపిక్ కాలేకపోయాడు. కానీ అదే బర్రెలక్క ట్విట్టర్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. అంటే సోషల్ మీడియాలో నెంబర్ వన్ అయినంత మాత్రాన బయట సమాజంలో అంత సీన్ ఉండదు అనే ప్రశ్న ఇక్కడ ఉదయించవచ్చు. కానీ బయట సమాజం ఓన్ చేసుకుంది కాబట్టే సోషల్ మీడియాలో ఇంత క్రేజీ వచ్చింది. అంటే కొల్లాపూర్ లో రేపటి నాడు ఏదైనా జరగవచ్చు. బర్రె లక్క ఎమ్మెల్యే కావచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉండే బ్యూటీ అదే కాబట్టి.