Viral Video : తెలంగాణ రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తిని.. కేసులు ఎదుర్కొని.. జైల్లో విచారణ ఖైదీగా ఇబ్బంది పడి.. అనేక అవమానాలను.. విమర్శలను.. ఆరోపణలను తట్టుకొని నిలబడిన నాయకులలో రేవంత్ రెడ్డి ఒకరు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా.. మల్కాజ్ గిరికి పార్లమెంటు సభ్యుడిగా.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా.. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వచ్చారు. ముఖ్యమంత్రిగా ఏడాది పరిపాలన కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. రేవంత్ రెడ్డికి మొదటినుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉండేది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉంది. అదే ఆయనకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాశంగా మారింది.
Also Read : పీఎం మెదీది ఏ కులం.. రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు వాస్తవమేనా.. ఇవీ వాస్తవాలు
గెలుపంటే ఇలా ఉండాలి..
ఇటీవల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.. మహిళలకు స్వయం సహాయక సంఘాల చెక్కులు అందజేశారు. పెట్రోల్ బంకులు ప్రారంభించారు. కేవలం స్వయం సహాయక మహిళా సంఘాలకు మాత్రమే పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ కంటే ముందు అక్కడ ఒక సంచలనమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సభకు భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ హాజరయ్యారు. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.. మంత్రిగా కూడా పని చేశారు. గతంలో ఆమెకు రేవంత్ రెడ్డికి వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో అరుణ సహనం కోల్పోయి గెట్ ఔట్ అని రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే ఈ డీకే అరుణ పార్లమెంటు సభ్యురాలి గానే ఉన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం తన స్థాయిని అంతకంతకు పెంచుకొని ముఖ్యమంత్రి దాకా ఎదిగారు. ఈ క్రమంలో ఆ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి వస్తుంటే డీకే అరుణ లేచి నమస్కరించారు. నాడు డీకే అరుణ గెట్ అవుట్ అన్న దృశ్యాన్ని.. ఇప్పుడు లేచి నిలబడిన దృశ్యాన్ని జోడిస్తూ కాంగ్రెస్ నాయకులు ఒక వీడియో రూపొందించారు. “నీ గెలుపు ఎలా ఉండాలంటే నిన్ను గెట్ అవుట్ అన్న వాళ్ళే.. నువ్వు వస్తే లేచి నిలబడాలే” అనే క్యాప్షన్ జత చేశారు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కాంగ్రెస్ నాయకులు ఈ వీడియోను అని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు.. రేవంత్ రెడ్డికి మరింత క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదీ గెలుపంటే.. పగోడు కూడా సలాం కొట్టాలే..#RevanthReddy pic.twitter.com/rRrZfxgBhU
— Telangana Galam (@TelanganaGalam_) February 22, 2025