ABN RK And Konda Vishweshwar Reddy: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని.. రాజకీయ నాయకుల నుంచి మొదలుపెడితే సినీ తారల వరకు ఫోన్ కాల్స్ విన్నారని అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నియమించిన అధికారుల బృందం గత కొద్దిరోజులుగా ఈ కేసు పై విచారణ సాగిస్తోంది. ఈ విచారణలో ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులను ప్రశ్నించింది. ఇప్పుడు ఈ జాబితాలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు.
Also Read:టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెటైర్లు
శుక్రవారం వీరిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది . ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం వీరికి నోటీసులు జారీ చేసింది. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీరిద్దరి ఫోన్లు కూడా విన్నట్టు తెలుస్తోంది. అందువల్లే వీరిద్దరికీ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నోటీసులు జారీ చేశారు. రాధాకృష్ణ పాత్రికేయుడిగా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల అధిపతిగా కొనసాగుతున్నారు.కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఒక పర్యాయం పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత ఆయనకు భారత రాష్ట్ర సమితి నాయకత్వం పార్లమెంట్ టికెట్ కేటాయించలేదు. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేసి 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో విజయం సాధించారు.. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ తప్పులను విశ్వేశ్వర్ రెడ్డి ఎండగట్టారు. అప్పట్లో ఆయన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పరిధిలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. అందువల్లే ఆయనపై నాటి ప్రభుత్వం కక్ష కట్టిందని..ఫోన్ ట్యాపింగ్ చేసిందని అభియోగాలు నమోదయ్యాయి.
ఏం చెబుతారు?
ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అధికారుల బృందం ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది.. ప్రభాకర్ రావును విచారించడంతోపాటు.. రాజకీయ నాయకులు నుంచి మొదలుపెడితే ప్రముఖులను సైతం విచారించింది. అయితే వీరందరూ కూడా తమ ఫోన్ ట్యాపింగ్ అయిందని.. తమ మాట్లాడుకున్న వివరాలను నాటి ప్రభుత్వ పెద్దలు విన్నారని వివరించారు. ఇప్పుడు వేమూరి రాధాకృష్ణ కూడా ఈ జాబితాలో ఉన్న నేపథ్యంలో ఆయన ఏం చెబుతారనేది ఆసక్తికరంగా ఉంది.. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు వేమూరి రాధాకృష్ణ నిర్వహిస్తున్న ఆంధ్రజ్యోతి పత్రికకు ప్రభుత్వ పరంగా ప్రకటనలు రాలేదు. పైగా కొద్ది రోజులపాటు ఏబీఎన్ ఛానల్ పై నిషేధం కొనసాగింది. ఇవన్నీ కూడా వేమూరి రాధాకృష్ణకు కెసిఆర్ పై కోపాన్ని కలిగించాయి. అందువల్లే తన పత్రిక ద్వారా అప్పటి ప్రభుత్వంలో జరిగిన తెర వెనుక వ్యవహారాలను ప్రముఖంగా ప్రచురించారు. ప్రభుత్వపరంగా జరిగిన కుంభకోణాలను కూడా వెలుగులోకి తీసుకువచ్చారు. అందువల్లే ఆంధ్రజ్యోతి అధిపతి పై నాటి ముఖ్యమంత్రి కక్ష కట్టారని.. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని కాల్స్ విన్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.. మరోవైపు శుక్రవారం జరిగే విచారణలో ఆర్కే తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి చెప్పే విషయాలు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.