HomeతెలంగాణBandi Sanjay Kumar : హైడ్రా కొరవితో కాంగ్రెస్ తలగోక్కుంటుందా? ‘బండి’ మాటల్లో నిజమెంత.?

Bandi Sanjay Kumar : హైడ్రా కొరవితో కాంగ్రెస్ తలగోక్కుంటుందా? ‘బండి’ మాటల్లో నిజమెంత.?

Bandi Sanjay Kumar : మంచికి పోతే.. చెడు ఎదురైనట్లు’గా మారింది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ దుస్థితి. హైదరాబాద్ మహానగరాన్ని కబ్జాల నుంచి కాపాడాలని.. ఇప్పటికే వెలసిన ఆక్రమణలు లేకుండా కూల్చివేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు ఆయన హైడ్రాను ఏర్పాటు చేశారు. చెరువులు, కుంటలు ఎక్కడికక్కడ కబ్జాలకు గురికావడం వల్ల వరద నీరు వెళ్లే మార్గం లేకుండా పోయింది. అందుకే ఏటా వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ వరదలతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని రేవంత్ అభిప్రాయం. అందుకే.. కబ్జాలను తొలగిస్తే మహానగరానికి ఎలాంటి వరద బాధలు లేకుండా చేయొచ్చని రేవంత్ ఆలోచన.

రేవంత్ రెడ్డి లక్ష్యం మంచిదే అయినప్పటికీ.. ఈ హైడ్రా వల్ల చాలా మంది పేదలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇటీవల కూకట్‌పల్లి, అమీన్‌పూర్ పరిధిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలతో హైడ్రా చాలా వరకు వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా కూల్చివేతల సందర్భంగా అక్కడి బాధితుల రోదనలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దాంతో హైడ్రాపై ప్రజల్లో చాలా వరకు వ్యతిరేకత కనిపించింది. అంతేకాదు.. హైకోర్టు పరిధిలో ఉన్న ఓ కట్టడాన్ని కూల్చడంతో హైకోర్టు విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇదిలా ఉంటే.. మూసీ ప్రక్షాళన పేరిట దాని పరిధిలోని కుటుంబాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి మరోచోట పునరావాసం కల్పించి, పరిహారం ఇస్తామని చెప్పింది. అయితే.. దానికి చాలా మంది నిర్వాసితులు ససేమిరా ఒప్పుకోలేదు. కొంత మంది స్వతహాగా ఖాళీ చేసి వెళ్లిపోతున్నా ఇంకా పదుల సంఖ్యలో బాధితులు మాత్రం ఖాళీ చేయడానికి నిరాకరిస్తున్నారు. దాంతో వారు ఇప్పటికే చాలా వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపైకి నిరసనలు తెలుపుతున్నారు. అంతేకాదు.. ఇప్పుడు పార్టీల మద్దతు సైతం కోరుతున్నారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం బాధితులంతా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మరికొందరి నేతలను కలిశారు. అక్కడే వారంతా భేటీ నిర్వహించారు. స్పందించిన బీఆర్ఎస్ నేతలు మూసీ బాధితులందరికీ మద్దతుగా నిలిచారు. ‘మీకు మేమున్నాం.. మీ తరఫున మేం పోరాడుతాం. మీ పోరాటం మాది..’ అంటూ భరోసా ఇచ్చారు. అంతేకాదు.. ఆ వెంటనే తెలంగాణ భవన్‌లో 24/7 బాధితులకు అండగా ఉండేలా ఓ సెల్ కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌కు బాధితులు ఎప్పుడు వచ్చినా ఇద్దరు నేతలు అందుబాటులో ఉంటారని, వారికి బాధలు చెప్పుకోవచ్చని సూచించారు. వీరి బాధలు విన్న హరీశ్ సైతం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీలో గోదావరి జలాలకు బదులు బాధితుల రక్తాన్ని పారించాలని అనుకుంటున్నారా అంటూ నిలదీశారు.

ఇదిలా ఉంటే.. ఇటు బీజేపీ నేతలు కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘హైడ్రా అనే కొరివితో కాంగ్రెస్ పార్టీ తల గోక్కుంటుందని.. రాష్ట్రంలో ఆ పార్టీ పని అయిపోయింది’ అని అన్నారు. పేదల ఇళ్లను కూల్చేందుకు బుల్డోజర్లు ముందు తమ పైనుంచి వెళ్లాలని తీవ్రంగా మాట్లాడారు. పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పేదల గుడిసెలు కూలగొట్టడమే అభివృద్ధా అని నిలదీశారు.

దాంతో ఇప్పుడు ఇటు ప్రభుత్వంలోని పెద్దలు, అటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ఎంతో ఉన్నత లక్ష్యంతో హైడ్రాను తీసుకొస్తే ఇప్పుడు ప్రభుత్వంపై ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత వస్తుండడంతో వారంతా ఆందోళనలో పడినట్లు సమాచారం. అటు ప్రతిపక్షాల చేతికి కూడా హైడ్రా ఆయుధం దొరికినట్లు అయిందని.. అనవసరంగా గోక్కొని ఆయుధం ఇచ్చినట్లు అయిందని అనుకుంటున్నారట. ముందు ముందు ఈ పరిస్థితులు ఇంకా ఎటు దారితీస్తాయో అని ప్రభుత్వంలోని పెద్దలు, పార్టీ పెద్దలు సైతం ఆందోళన చెందుతున్నట్లు టాక్ నడుస్తోంది.

 

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular